మహిళా లక్షాధికారులు!

జీవనోపాధి కల్పన ద్వారా సుస్థిర ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళల్ని లక్షాధికారులను చేసేందుకు గ్రామీణ, పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) నడుంకట్టింది.

Published : 15 Jun 2024 05:19 IST

ఏడాదిలో 20.36 లక్షల మందిని తీర్చిదిద్దాలని కేంద్ర లక్ష్యం
ఆ లక్ష్యసాధనకు అనుగుణంగా సెర్ప్‌ ఏర్పాట్లు
సుస్థిర జీవనోపాధి కల్పన ద్వారా ఆదాయం పెంపు
ఎంపిక చేసిన మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు

ఈనాడు, అమరావతి: జీవనోపాధి కల్పన ద్వారా సుస్థిర ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళల్ని లక్షాధికారులను చేసేందుకు గ్రామీణ, పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) నడుంకట్టింది. ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన ‘3 కోట్ల లక్‌పతి’ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 20.36 లక్షల మంది డ్వాక్రా మహిళల్ని లక్షాధికారులను చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 2024-25కిగాను జాతీయ జీవనోపాధుల కల్పన మిషన్‌ కార్యక్రమంలో భాగంగా ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి జీవనోపాధి లేని మహిళలు మొదలు ఏదో ఒక చిన్న ఉపాధి ఏర్పాటు చేసుకుని ముందుకు సాగే మహిళల్ని ఎంపిక చేసి, వారిని లక్షాధికారులుగా మలచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నెలకు కనీసం రూ.10 వేల ఆదాయం పొందేలా తోడ్పాటును సెర్ప్‌ అధికారులు అందిస్తారు. లబ్ధిదారులు వారికి ఆసక్తి ఉన్న ఉపాధిని ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 12 లక్షల మంది డ్వాక్రా మహిళల్ని అధికారులు గుర్తించారు. మిగతా వారి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.

24 వేల మంది సీఆర్పీల నియామకం

ఈ కార్యక్రమం కింద మహిళల్ని ఎంపిక చేసేందుకు, వారికి అవసరమైన సహాయ సహకారాలను క్షేత్రస్థాయిలో అందించేందుకు 24 వేల మంది డ్వాక్రా మహిళల్ని కమ్యూనిటీ రిసోర్స్‌పర్సన్‌ (సీఆర్పీ)లుగా నియమించారు. ఒక్కో సీఆర్పీకి 70 మంది మహిళల ఉపాధి కల్పన బాధ్యతల్ని అప్పగిస్తారు. ఎంపిక చేసిన మహిళలు ఏ జీవనోపాధిని ఏర్పాటు చేసుకోవచ్చు? దాన్ని సుస్థిర ఆదాయ మార్గంగా మార్చుకోవడం ఎలా? వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా వారికి అందే సహకారం ఏంటి? తదితర వాటిని సీఆర్పీలు లబ్ధిదారులకు వివరిస్తారు. 


6 శాతం వడ్డీకే రుణాలు

ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన మహిళలకు ఉపాధి కల్పనకుగాను తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తారు. ఇప్పటికే వారు ఏదో ఒక ఉపాధిని ఏర్పాటు చేసుకుంటే.. దాన్ని విస్తరించేందుకూ సహకారాన్ని అందిస్తారు. వారు ఏర్పాటు చేసుకునే ఉపాధికి అనుగుణంగా రుణ సౌకర్యం ఉంటుంది. సీఐఎఫ్, సీఈఎఫ్, పీఎంఎఫ్‌ఎంఈ, ఎస్‌వీఈపీ పథకాల కింద 6 శాతం వడ్డీతో రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు రుణాలు అందిస్తారు. ఇంకా అవసరమైతే స్త్రీనిధి కింద రూ.లక్ష వరకు రుణం అందిస్తారు. లబ్ధిదారులు దీన్ని నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని