వైకాపా హయాంలో.. దోచుకున్నోళ్లకు దోచుకున్నంత!

అంతా మా ఇష్టం అన్నట్లు సాగిన వైకాపా పాలనలో పౌరసరఫరాల సంస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది. అడ్డగోలు నిర్ణయాల కారణంగా అయిదేళ్ల కాలంలో సంస్థ అప్పులు రూ.40వేల కోట్లకు చేరాయి. సంస్థకు అప్పు పుట్టే మార్గం లేక.. మార్క్‌ఫెడ్‌ తదితర సంస్థల ద్వారా రుణాలు తీసుకుని సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది.

Updated : 15 Jun 2024 06:24 IST

అయిదేళ్లలో పౌరసరఫరాల సంస్థ అప్పులు రూ.40వేల కోట్లకు
కందిపప్పు, పామోలిన్‌ కొనుగోళ్లలో అక్రమాలు
యంత్రాల పేరుతో రూ.కోట్లు దుర్వినియోగం
డోర్‌ డెలివరీ వాహనాల్లో కొన్ని మూలకు.. అయినా అద్దె చెల్లింపు!
విచారణ చేయిస్తే.. వాస్తవాలెన్నో వెలుగులోకి

ఈనాడు, అమరావతి: అంతా మా ఇష్టం అన్నట్లు సాగిన వైకాపా పాలనలో పౌరసరఫరాల సంస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది. అడ్డగోలు నిర్ణయాల కారణంగా అయిదేళ్ల కాలంలో సంస్థ అప్పులు రూ.40వేల కోట్లకు చేరాయి. సంస్థకు అప్పు పుట్టే మార్గం లేక.. మార్క్‌ఫెడ్‌ తదితర సంస్థల ద్వారా రుణాలు తీసుకుని సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. నిత్యావసరాల సేకరణలో అడ్డగోలు అక్రమాలకు బరితెగించారు. కనీసం పేదలకు కందిపప్పు, జొన్నలు, రాగులు, గోధుమపిండి లాంటి నిత్యావసరాలు కూడా అందించలేదు. రాష్ట్రంలో 1.47కోట్ల రేషన్‌ కార్డులకు సంబంధించి.. 4.29 కోట్ల మంది సభ్యుల ఆశలతో ఆటలాడుకున్నారు. రేషన్‌ బియ్యం కొల్లగొట్టి రూ.వందల కోట్లు దోచుకున్నారు. కాకినాడ కేంద్రంగా పెత్తనం చేసే వైకాపాకు చెందిన కొందరు మిల్లర్ల సంఘం నాయకులకు అడ్డగోలు లబ్ధి చేకూర్చారు. ఏళ్ల తరబడి తిష్టవేసిన కొందరు అధికారుల పెత్తనంలో..వారు చెప్పిందే వేదంగా దస్త్రాలు నడిపిస్తున్నారు. నచ్చని అధికారుల్ని రోజుల వ్యవధిలోనే పోస్టుల నుంచి తప్పించి సాగనంపుతున్నారు. కొత్త ప్రభుత్వం వీటిపై విచారణ చేయించి అక్రమాలు బయట పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.  

యంత్రాలకు రూ.కోట్లు? 

అప్పులు పెరుగుతుంటే ఎవరైనా జాగ్రత్తలు తీసుకుని వాటిని ఎలా తగ్గించాలో ఆలోచిస్తారు. అయితే పౌరసరఫరాల సంస్థ మాత్రం అందుకు విరుద్ధంగా.. అప్పులు విపరీతంగా తీసుకురావడంతోపాటు లెక్కాపత్రం లేదన్నట్లుగా ఖర్చులకు తెగించింది. ప్యాక్‌ చేసిన సంచుల్లో బియ్యం సరఫరా చేస్తామంటూ.. యంత్రాలు, వాటికి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశారు. ఒక్కోదానికి రూ.45లక్షల వరకు ఖర్చు చేశారు. మొత్తం 19 చోట్ల వీటిని ఏర్పాటు చేయడంతోపాటు.. వాటికి అవసరమైన ప్యాకింగ్‌ సామగ్రిని కూడా కొనుగోలు చేశారు. తర్వాత ప్యాకింగ్‌ కాకుండా.. వాహనాల ద్వారా ఇంటింటికి సరఫరా చేయాలని నిర్ణయించారు. దీంతో యంత్రాలను బయటకు కూడా తీయలేదు. గతేడాది టేక్‌ హోం రేషన్‌ పేరుతో మహిళా శిశు సంక్షేమశాఖ ద్వారా బియ్యం పంపిణీకి వీటిని ఉపయోగించాలని నిర్ణయించి.. ప్రైవేటుకు అప్పగించారు. మొత్తంగా రూ.50 కోట్ల వరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. 

కొనుగోళ్లలో ఇష్టారాజ్యం

పౌరసరఫరాల సంస్థ ద్వారా గత అయిదేళ్లలో చేసిన నిత్యావసరాల కొనుగోళ్లలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పామోలిన్‌ సేకరణలోనే రూ.80 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు అంచనా. లీటరు రూ.137 చొప్పున సరఫరా చేసేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ధరలు పెరగడంతో సరఫరా చేయలేదు. తీరా ధరలు తగ్గాక.. పాత ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చారు. లీటరు రూ.65 ఉన్న రోజుల్లోనూ రూ.137 చొప్పునే తీసుకున్నారు. కందిపప్పు కొనుగోలు విషయాన్ని తీసుకుంటే.. తమకు అనుకూలంగా ఉండే గుత్తేదారులకు అనుగుణంగా నిబంధనలు మార్చేశారు. కందిపప్పు ధర మార్కెట్లో రూ.80 ఉన్నప్పుడు కిలో రూ.118 చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నారు. డిపాజిట్‌ మొత్తాలను కూడా వారికి నచ్చినట్లు.. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నిర్ణయించారు. గోధుమపిండి, జొన్నలు, రాగుల పంపిణీ పేరుతో రెండు మూడు నెలల కిందట హడావుడి చేశారు. ఇందులోనూ టెండరులో పేర్కొన్న ప్రదేశంలో కాకుండా.. ఎక్కడికక్కడే మిల్లింగ్‌ చేయించి పంపిణీ చేశారు. లెక్కల్లో మాత్రం రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు సరఫరా చేసినట్లు చూపించారు. రవాణా ఛార్జీల రూపంలో రూ.కోట్లు నొక్కేశారు. గోధుమపిండి కూడా నాసిరకంగా ఉందని నివేదికల్లో తేలినా పట్టించుకోలేదు.

పేరుకే డోర్‌ డెలివరీ 

డోర్‌ డెలివరీ పేరిట రూ.540 కోట్ల వ్యయంతో 9,260 వాహనాలను కొనుగోలు చేసినా.. నిర్వహణకు ఏడాదికి రూ.250 కోట్ల చొప్పున రూ.1,000 కోట్లు వ్యయం చేసినా రాష్ట్రంలో రేషన్‌ పంపిణీ అంతా అస్తవ్యస్తంగా మార్చేశారు. ఏ నెల ఏమిస్తారో కూడా తెలియని పరిస్థితి. ఇంటింటికి రేషన్‌ అనే పేరు తప్ప.. వీధి మలుపులో నిలిపేసి అక్కడికే అందరినీ పిలిపిస్తున్నారు. గతంలో కూలీలు ఖాళీ సమయంలో రేషన్‌ దుకాణం వద్దకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకునేవారు. ఈ విధానం వచ్చాక పనులు మానుకుని వాహనం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. మరోవైపు అసలు రాష్ట్రంలో ఎన్ని వాహనాలు పనిచేస్తున్నాయో అధికారులకే అంతు పట్టడం లేదు. కొన్నిచోట్ల బినామీ పేర్లతో వైకాపా నేతలే నడిపిస్తున్నారు. మరికొన్నిచోట్ల వాహనాలు బయటకు కదలవు. అయినా వాటికి అద్దెలు మాత్రం ఎప్పటి తీరునే  చెల్లిస్తున్నారు. 

సార్టెక్స్‌ పేరిట ఏడాదికి రూ.240కోట్లు

వైకాపా ప్రభుత్వంలో సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చి తర్వాత సార్టెక్స్‌(నూకలు తక్కువగా ఉన్న బియ్యం) పంపిణీ అని మాట మార్చేశారు. దానికి నెలకు రూ.20కోట్లు ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి రూ.240 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయినా పేదలకు తినగలిగే బియ్యం అందడం లేదు. ఈ బియ్యానికే కిలోకు రూ.41 పైగా వరకు ఖర్చవుతోందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. రేషన్‌ వాహనాల్లో పంచదార, బియ్యం తప్పితే మరేమీ ఇవ్వడం లేదు. కొత్త ప్రభుత్వంలో అయినా రేషన్‌ పంపిణీ విధానాన్ని గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని