చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి...!

ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వస్తానని ఐదేళ్ల క్రితం పంతం పట్టిన మహిళ విజయలక్ష్మి.. శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వచ్చారు.

Updated : 16 Jun 2024 10:41 IST

 కేశవాపురంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద విజయలక్ష్మిని సత్కరిస్తున్న స్థానికులు

కూసుమంచి, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వస్తానని ఐదేళ్ల క్రితం పంతం పట్టిన మహిళ విజయలక్ష్మి.. శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వచ్చారు. ఈ గ్రామానికి చెందిన కట్టా గోపయ్య, సౌభాగ్యమ్మ దంపతుల నాలుగో కుమార్తె ఆమె. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడుకు చెందిన పెదనాటి నర్సింహారావుతో ఆమెకు వివాహమైంది. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. కేశవాపురంలో తల్లిదండ్రుల నివాసంలోనే ఉంటున్న తోబుట్టువు వద్దకు విజయలక్ష్మి వస్తుంటారు. ఈక్రమంలో తన ఇద్దరు కుమారులతో ఐదేళ్ల క్రితం ఊరికి వచ్చిన ఆమెకు.. అక్క కొడుకు తాళ్లూరి ప్రసాద్‌కు రాజకీయంగా భిన్నవాదనలు తలెత్తాయి. చంద్రబాబే సీఎం అవుతారని ఆమె.. జగన్‌ అధికారంలోకి వస్తారని ప్రసాద్‌లు ఎవరి వాదనలతో వారున్నారు. నాడు జగన్‌ సీఎం కావడంతో.. తెదేపా అధికారంలోకి వస్తేనే మళ్లీ ఊళ్లోకి వస్తానని ఆమె పంతం పట్టారు.  ఇన్నాళ్లూ పుట్టింట్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా హాజరు కాలేదు. తాజాగా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో శనివారం ఆమె గ్రామానికి వచ్చారు. బంధువులు, కుటుంబ సభ్యులు, స్థానిక తెదేపా అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు. గ్రామ బస్టాండ్‌ కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆమె నివాళి అర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని