ఏయూకు భద్రత కల్పించండి!

వైకాపా ప్రభుత్వ హయాంలో ఆంధ్ర వర్సిటీలో ఉపకులపతి ప్రసాదరెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇప్పటికీ ఆయన తీరు మారలేదు.

Updated : 16 Jun 2024 07:33 IST

గవర్నర్‌కు, పోలీసులకు వీసీ ప్రసాదరెడ్డి ఫిర్యాదు
కూటమి విజయం అనంతర పరిణామాలతో కలవరం
శాంతియుతంగానే ఉద్యోగుల నిరసనలు

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం, న్యూస్‌టుడే, ఏయూ ప్రాంగణం: వైకాపా ప్రభుత్వ హయాంలో ఆంధ్ర వర్సిటీలో ఉపకులపతి ప్రసాదరెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇప్పటికీ ఆయన తీరు మారలేదు. గతంలో తొలగించిన అతిథి అధ్యాపకులను విధుల్లోకి తీసుకోవాలని, వీసీ, రిజిస్ట్రార్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ వర్సిటీలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట శనివారం ఏయూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ నిరసనకు అనుమతి లేకపోవడంతో.. పోలీసులు అందుకు అభ్యంతరం తెలిపారు. మరోవైపు.. కొన్నాళ్లుగా యూనివర్సిటీలో జరుగుతున్న కార్యకలాపాల నేపథ్యంలో, ఇక్కడ భద్రత కొరవడిందని ఛాన్స్‌లర్‌ అయిన గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు వీసీ ప్రసాదరెడ్డి ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగానే కార్యాలయానికి వస్తున్న ఆయన... ప్రధాన పరిపాలన భవనం వద్ద భద్రత పెంచాలని మూడో పట్టణ పోలీసులను కోరారు. దీంతో శనివారం ముగ్గురు కానిస్టేబుళ్లను పంపించారు. 

ఫలితాల తర్వాత నుంచి...

ఎన్నికల్లో కూటమి విజయంతో వర్సిటీలోని కొందరు ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. గతంలో వీసీ అవినీతిపై ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసులు పెట్టించారని వారు వాపోయారు. ఫలితాలు వచ్చిన రెండో రోజు నుంచి వరుసగా కొన్ని రోజుల పాటు అంబేడ్కర్‌ విగ్రహానికి విశ్రాంత ఆచార్యులు, పూర్వవిద్యార్థులు పాలాభిషేకం చేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పూర్వ రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో కేకు కోసి, సంబరాలు చేసుకున్నారు. ఇవన్నీ శాంతియుతంగానే జరిగినా.. వీసీ ప్రసాదరెడ్డి మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉద్యోగులు అవాక్కవుతున్నారు.

అడ్డగోలుగా ప్రవేశాలు 

ఏయూ రిజిస్ట్రార్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ అంబేడ్కర్‌ ఛైర్‌ ప్రొఫెసర్‌గా తాత్కాలిక నియామకంతో వర్సిటీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత గతేడాది వీసీ ఆయనకు రిజిస్ట్రార్‌ పదవి కట్టబెట్టారు. ఆయన దొడ్డిదారిలో కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగంలో పీహెచ్‌డీలో చేరినట్లు వర్సిటీలో చర్చ జరుగుతోంది. తాజాగా ఆయన ప్రీ పీహెడ్‌డీ పరీక్షలకు దరఖాస్తు చేశారు. మరోవైపు ఆయన అడ్డగోలుగా అనేకమందికి టీడీఆర్‌ హబ్‌లోకి ప్రవేశాలు కల్పించారనే అభియోగాలున్నాయి. కొత్త ప్రభుత్వం రాకముందే దూరవిద్య విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా ప్రొఫెసర్‌ను ఇటీవల హడావుడిగా సోషల్‌ వర్క్‌ విభాగానికి మార్చినట్లు తెలిసింది. మరో ప్రొఫెసర్‌కు పీహెచ్‌డీ పూర్తవ్వగానే ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి. పీహెచ్‌డీలో ప్రవేశంపై రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ.. ఇగ్నోలో ఎంబీఏ పూర్తిచేశానని, వర్సిటీలోకి రాకముందే పీహెచ్‌డీలో చేరానని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా చేరాననే ప్రచారం అవాస్తమని కొట్టిపారేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని