సంక్షిప్త వార్తలు (4)

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నీరభ్‌కుమార్‌ ప్రసాద్, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా శనివారం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో భేటీ అయ్యారు.

Updated : 16 Jun 2024 06:11 IST

గవర్నర్‌తో సీఎస్, డీజీపీ భేటీ

గవర్నర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్, డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నీరభ్‌కుమార్‌ ప్రసాద్, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా శనివారం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు ఉన్నతాధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు.


‘గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదా వేయాలి’ 

ఈనాడు డిజిటల్, అమరావతి: గ్రూప్‌-2 ప్రధాన పరీక్ష(మెయిన్స్‌)ను మూడు నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు కోరారు. వైకాపా ప్రభుత్వం అయిదేళ్లు కాలయాపన చేసి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రయోజనం కోసం నోటిఫికేషన్‌ ఇచ్చిందని పేర్కొన్నారు. హడావుడిగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిందని గుర్తుచేశారు. కొందరు ఎన్నికల విధుల్లో పాల్గొనడం వల్ల పరీక్షలకు సన్నద్ధం కాలేకపోయారని, ఈ నేపథ్యంలో వాయిదా వేయాలని శనివారం ఓ ప్రకటనలో కోరారు.


రేషన్‌ బియ్యాన్ని.. తూకం వేసి ఇప్పించేలా చూడండి
మంత్రి నాదెండ్ల మనోహర్‌కు రేషన్‌ డీలర్ల సంఘం నివేదన

ఈనాడు, అమరావతి: మండలస్థాయి నిల్వ కేంద్రాల నుంచి రేషన్‌ బియ్యాన్ని.. తూకం వేసి సరఫరా చేసేలా పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు దివి లీలా మాధవరావు కోరారు. గతంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ-పోస్‌ కాటాలను మూలనపెట్టి తూకం వేయకుండా ఇస్తున్నారని.. ఫలితంగా ఒక్కో డీలర్‌ 100 కిలోల బియ్యాన్ని కోల్పోతున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో రేషన్‌ సరఫరా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఆయన విమర్శించారు. ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కోరారు.


‘స్పందన’కు బదులుగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ 

ఈనాడు, అమరావతి: ప్రజలు చేసే ఫిర్యాదులను పరిష్కరించే విభాగాన్ని వారికి మరింత సౌకర్యవంతంగా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్లలో ‘స్పందన’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ప్రక్షాళన చేయనున్నట్లు పేర్కొంది. దాని స్థానంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇక నుంచి ఈ పేరుతోనే ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ఆదేశిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులిచ్చారు. ప్రజాపాలనలో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారం కీలకమైనదని పేర్కొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని