‘చంద్రబాబు ఫొటో ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారా?’

ఉంగరాన్ని పోగొట్టుకున్న వ్యక్తి.. అనుమానితుణ్ని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించినా కేసు నమోదు చేయకపోగా, బాధితునితో సీఐ హేళనగా మాట్లాడిన ఘటనపై తిరుపతి రెండో అదనపు మున్సిఫ్‌ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published : 17 Jun 2024 05:44 IST

ఉంగరం పోగొట్టుకున్న బాధితుడితో సీఐ వేళాకోళం
అధికారిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: ఉంగరాన్ని పోగొట్టుకున్న వ్యక్తి.. అనుమానితుణ్ని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించినా కేసు నమోదు చేయకపోగా, బాధితునితో సీఐ హేళనగా మాట్లాడిన ఘటనపై తిరుపతి రెండో అదనపు మున్సిఫ్‌ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వస్తువు రికవరీలో నిర్లక్ష్యంగా వ్యహరించిన తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌ సీఐను నిందితుడిగా చేర్చాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

బాధితుడు, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు జయరామిరెడ్డి ఆదివారం తెలిపిన మేరకు.. ‘తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలతో ఉన్న 36 గ్రాముల తన బంగారు ఉంగరాన్ని 2023 సెప్టెంబరు 24న తిరుపతిలోని ఓ రెస్టారెంట్‌లో అక్కడి కార్మికుడు దొంగిలించాడు. ఆ కార్మికుడిని తిరుపతి తూర్పు పోలీసులకు అప్పగించి ఫిర్యాదు ఇచ్చాను. విచారణ పేరుతో మూడు రోజులు స్టేషన్‌ చుట్టూ తిప్పించుకున్న సీఐ మహేశ్వరరెడ్డి.. కేసు నమోదు చేయకుండా అతడిని వదిలేశారు. పైగా ఉంగరంపై చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలు ఉన్నాకా ఎవరైనా కేసు నమోదు చేస్తారా.. అంటూ హేళనగా మాట్లాడారు’ అని పేర్కొన్నారు. తర్వాత పోలీస్‌స్టేషన్‌లో న్యాయం జరగదని గ్రహించి స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఆఖరి ప్రయత్నంగా కోర్టులో ప్రైవేటు కేసు వేశానని తెలిపారు. ఆధారాలను పరిశీలించిన కోర్టు.. సీఐని ఏ2గా చేర్చి కేసు నమోదు చేయాలని ఈ నెల 11వ తేదీన ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి స్పందన నుంచి ఫిర్యాదు వచ్చాక జనవరిలోనే కేసు పెట్టినట్లు తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. కోర్టు ఆదేశాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని