‘ఉద్యోగాలు దక్కాలంటే పెట్టెలు తేవాలన్న బొత్స, సజ్జల’

మీ ఉద్యోగాలు దక్కాలంటే ఖాళీ చేతులతో కాదు..పెట్టెలు పట్టుకురావాలని అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ పీజీటీ(తెలుగు, ఇంగ్లీష్‌) ఉపాధ్యాయులు ఆరోపించారు.

Updated : 17 Jun 2024 08:21 IST

మహిళలని చూడకుండా దూషణలకు  పాల్పడ్డ ఎస్పీడీ శ్రీనివాసరావు
కేజీబీవీ పీజీటీల ఆవేదన
న్యాయం చేయాలని మంత్రి లోకేశ్‌కు వినతి

ఈనాడు డిజిటల్, అమరావతి: మీ ఉద్యోగాలు దక్కాలంటే ఖాళీ చేతులతో కాదు..పెట్టెలు పట్టుకురావాలని అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ పీజీటీ(తెలుగు, ఇంగ్లీష్‌) ఉపాధ్యాయులు ఆరోపించారు. ‘వైకాపా ప్రభుత్వం నాది..ఒకవేళ తెదేపా ప్రభుత్వం వచ్చినా నా హవానే నడుస్తుంది. మీకు నచ్చినట్టు చేసుకోండి’ అని సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు బెదిరించారని వాపోయారు. మహిళలని కూడా చూడకుండా తమని దూషించారని ఆవేదన వెలిబుచ్చారు. ఈ సమస్యను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు తెలియజేసి న్యాయం కోరేందుకు ఆదివారం వారు ఉండవల్లిలోని ఆయన నివాసం వద్దకు వచ్చారు. లోకేశ్‌ పీఏకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘2018-19 నోటిఫికేషన్‌ ద్వారా విధుల్లోకి తీసుకొన్న మమ్మల్ని హేతుబద్దీకరణ పేరుతో వైకాపా ప్రభుత్వం తొలగించింది. మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వైకాపా పెద్దల్ని ఎంతమందిని కలిసినా..లంచం డిమాండ్‌ చేశారే కానీ..న్యాయం చేయలేదు. మీ నియామకమే తప్పు అని ఎస్పీడీ శ్రీనివాసరావు తిట్టారు. దీనిపై హై కోర్టుకు వెళ్లాం. మమ్మల్ని తొలగించడం న్యాయసమ్మతం కాదని హైకోర్టు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. పైగా మాపై రిట్‌ పిటిషన్‌లు ఫైల్‌ చేశారు. మమ్మల్ని నడిరోడ్డు మీద నుంచోబెట్టారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ను కలిస్తే ‘మీరు నడిరోడ్డు మీద ఇళ్లు కట్టుకున్నారు.. వాటిని తొలగించారు’ అంటూ వెటకారంగా మాట్లాడారు. తెదేపా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో లోకేశ్‌ను కలవడానికి వచ్చాం’’ అని బాధితులు లలిత, కామేశ్వరి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని