జనం సొమ్ముతో జగన్‌ సోకులు

మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాధనాన్ని లూటీ చేశారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ ఆరోపించారు.

Published : 17 Jun 2024 05:03 IST

పోలీసులకు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ ఫిర్యాదు

ఏఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేస్తున్న సిరిపురపు శ్రీధర్, రావిపాటి సాయికృష్ణ, కొమ్మినేని సాంబశివరావు, శబరి, చైతన్య, ఫణి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాధనాన్ని లూటీ చేశారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ ఆరోపించారు. సీఎం క్యాంపు కార్యాలయం పేరుతో తన సొంత ఇంటి కోసం సుమారు రూ.45.54 కోట్ల ప్రజాధనంతో విలాసవంతమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన జగన్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులతో కలిసి ఆదివారం గుంటూరు పోలీసు కార్యాలయంలో నేరవిభాగ ఏఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీధర్‌ విలేకరులతో మాట్లాడారు. ప్రజలు కట్టిన పన్నులను సక్రమంగా వెచ్చించాల్సిన బాధ్యత కలిగిన మాజీ సీఎం తన సొంతింటికి ఫర్నిచర్, డిజిటల్‌ పరికరాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ సామగ్రిని మొత్తం బాధ్యతగా ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు. వారమవుతున్నా సామగ్రిని తిరిగి అప్పగించకుండా ఆయన మరో నేరానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను దొంగచాటుగా వాడుకుంటున్న జగన్‌తోపాటు సహకరించిన అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలుగుయువత జిల్లా మాజీ అధ్యక్షుడు కొమ్మినేని సాంబశివరావు, జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, నాయకులు శబరి, చైతన్య, ఫణి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని