చిన్న పరిశ్రమల కష్టాలపై కసరత్తు

రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) సంఖ్యను గుర్తించి.. క్షేత్రస్థాయిలో అవి ఎదుర్కొనే సమస్యలు తెలుసుకోడానికి చేపట్టిన ‘రైజింగ్‌ అండ్‌ యాక్సిలరేటింగ్‌ ఎంఎస్‌ఎంఈ పెర్ఫార్మెన్స్‌ (ర్యాంప్‌)’ సర్వేను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 17 Jun 2024 06:29 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) సంఖ్యను గుర్తించి.. క్షేత్రస్థాయిలో అవి ఎదుర్కొనే సమస్యలు తెలుసుకోడానికి చేపట్టిన ‘రైజింగ్‌ అండ్‌ యాక్సిలరేటింగ్‌ ఎంఎస్‌ఎంఈ పెర్ఫార్మెన్స్‌ (ర్యాంప్‌)’ సర్వేను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా చిన్న పరిశ్రమల ప్రస్తుత పరిస్థితిపై అవగాహనకు వచ్చి, అవసరమైన చర్యలపై ఒక అంచనాకు రానుంది. రాష్ట్రంలో 20 లక్షల చిన్న పరిశ్రమలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్‌ పోర్టల్‌ సూచిస్తోంది. గత ప్రభుత్వం ‘ర్యాంప్‌’ సర్వే ప్రారంభించి.. కేవలం 70 వేల పరిశ్రమల డేటాను సేకరించింది. ఆ సర్వేను త్వరగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం వాటికి ప్రాధాన్యం ఏర్పడింది. 

ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు చిన్న పరిశ్రమలు ఎంతో కీలకం. వాటి బాగోగులు చూస్తే అవి నిలదొక్కుకొని ఎంతో మందికి పని కల్పిస్తాయి. అందుకే ప్రభుత్వం పరిశ్రమలశాఖ నుంచి వాటిని వేరు చేసి.. ఎంఎస్‌ఎంఈల పర్యవేక్షణకు మొదటిసారిగా ప్రత్యేకంగా మంత్రికి బాధ్యతలను అప్పగించింది. కానీ ఇప్పటి వరకు వాటికి సంబంధించిన ఎలాంటి డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. దీంతో వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేయాలని భావిస్తోంది. సర్వే కోసం కేంద్రం రూ.100 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు వెచ్చిస్తున్నాయి. సర్వే పూర్తయితే జిల్లాల వారీగా ఉన్న ఎంఎస్‌ఎంఈల సంఖ్యపై స్పష్టత వస్తుంది. 

సర్వే కోసం 7 ప్రశ్నలతో కూడిన జాబితాను అధికారులు రూపొందించారు. దీని ద్వారా తయారీ, సేవ, వాణిజ్యం, రిటైల్‌ రంగాల్లోని ఎంఎస్‌ఎంఈల సంఖ్యను గుర్తించనున్నారు. ఉత్పత్తులు, పెట్టుబడుల కోసం ఎదుర్కొనే సమస్యలు, ఉత్పత్తుల మార్కెటింగ్‌ సమస్యలను సేకరించనున్నారు. 2020లో గత ప్రభుత్వం సమగ్ర పరిశ్రమల సర్వే (ఎస్‌పీఎస్‌) కోసం సుమారు 40 ప్రశ్నలతో జాబితా రూపొందించడంతో సమాచారం సేకరించడం కష్టంగా మారింది. దీంతో ఆ సర్వేను మధ్యలోనే నిలిపేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని