ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి

ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రకటనలను జారీ చేయాలంటే... ప్రకటనలు ఇచ్చే వ్యాపార సంస్థలు, వ్యక్తులు ఇకపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి మంగళవారం నుంచే అమలులోకి రానున్నాయి.

Updated : 18 Jun 2024 05:55 IST

కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖ ఉత్తర్వులు
నేటి నుంచి అమల్లోకి...
ఇబ్బందికరమంటున్న ప్రకటనకర్తలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రకటనలను జారీ చేయాలంటే... ప్రకటనలు ఇచ్చే వ్యాపార సంస్థలు, వ్యక్తులు ఇకపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి మంగళవారం నుంచే అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనను అమలు చేయడంలో ఇబ్బందులు తప్పకపోవచ్చని ప్రకటనకర్తలు, ప్రకటనల ఏజెన్సీల వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘ప్రతి ప్రకటనతో తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాలనే నిబంధన ఇబ్బందికరమైనదే, ప్రకటన ఇచ్చి ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వకపోయినా, సకాలంలో పంపించకపోయినా ప్రకటనను ప్రచురించడం కుదరదు. ఇతర సమస్యలూ ఎదురుకావచ్చు’ అని ఓటీఎస్‌ అడ్వర్‌టైజింగ్‌ ఎండీ ఎన్‌.వెంకట్‌ జగదీష్‌ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కొంత అనుకూలత కూడా ఉన్నట్లు చెప్పారు. ఒక మాదిరి నాణ్యత ఉన్న ఉత్పత్తులకు కూడా అత్యంత నాణ్యమైనవని, దీర్ఘకాలం మన్నుతాయని మరీ ఎక్కువగా చెప్పుకొంటూ ప్రకటనలు ఇవ్వడం ఇకపై సాధ్యం కాదని వివరించారు. ఆ మేరకు ప్రకటనలు జారీ చేసే సంస్థలపై ప్రభావం పడుతుందన్నారు.

స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలనే నిబంధన ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమని, అమల్లోకి వచ్చిన తర్వాతే స్పష్టంగా తెలుస్తుందని మరికొన్ని వర్గాలు తెలిపాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలతోపాటు ఇతర ప్రసార సాధనాల్లో వచ్చే ప్రకటనలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే, వాటిని అడ్వర్‌టైజ్‌మెంట్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌సీఐ) దృష్టికి తీసుకువెళ్లవచ్చు. ఈ సంస్థకు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. తన దృష్టికి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి 8-10 వారాల సమయంలో తగిన పరిష్కారాన్ని కనుగొనడానికి ఏఎస్‌సీఐ కృషి చేస్తుంది. ఈ మండలి సూచనలను ప్రకటనకర్తలు తప్పనిసరిగా పాటిస్తారు. ప్రకటనలపై ఫిర్యాదులను పరిష్కరించే యంత్రాంగం ఇప్పటికే ఉందని, ఇంకా స్వీయ ధ్రువీకరణపత్రం ఎందుకని ఇంతకుముందే కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏఎస్‌సీఐ తీసుకువెళ్లింది. కానీ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉండటంతో... ఈ నిబంధన తప్పనిసరని కేంద్రం బదులిచ్చినట్లు సమాచారం.

జారీ చేసిన ప్రకటనకు సంబంధించిన స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని కేంద్ర ప్రభుత్వ బ్రాడ్‌కాస్ట్‌ సేవా పోర్టల్‌లో, ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పోర్టల్‌లో ఏరోజుకారోజు అప్‌లోడ్‌ చేయాలి. ప్రకటన ఇచ్చేవారుగానీ, ప్రకటనల ఏజెన్సీగానీ సంతకం చేసిన స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని పోర్టళ్ల ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ కొన్ని వేల సంఖ్యలో ప్రకటనలు ఇస్తుంటారు. వాటిని వివిధ మీడియా సంస్థలు ప్రచురిస్తాయి. అందువల్ల ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో స్వీయ ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయడం కష్టసాధ్యమని, సిస్టం క్రాష్‌ కావడం, సర్వర్‌ పని చేయకపోవటం వంటి సమస్యలు ఎదురు కావచ్చని ప్రకటనల ఏజెన్సీ ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన కొత్తలోనూ ఇలానే ఇబ్బంది పడినట్లు వెల్లడించారు. స్వీయ ధ్రువీకరణ పత్రం సమయానికి అందకపోయినా, దాన్ని సిస్టమ్‌లో అప్‌లోడ్‌ చేయడం సాధ్యం కాకపోయినా, ఆ ప్రకటన ప్రచురణ నిలిపివేయాల్సి ఉంటుందని, దానివల్ల ప్రకటనకర్తలు ఇబ్బంది పడతారని వివరించారు. ప్రకటనల పరిశ్రమపై దీని ప్రభావం పడుతుందన్నారు. 

సుప్రీంకోర్టు ఆదేశాలు ఇలా... 

ప్రకటనకర్తలు, ప్రకటన ఏజన్సీలు... పత్రికలు, మీడియాకు ప్రకటనలు ఇచ్చే ముందు స్వీయ ధ్రువీకరణపత్రం ఇవ్వాల్సి ఉంటుందని మే నెలలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ కేంద్రం (పతంజలి) కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. తప్పుదారి పట్టించే ప్రకటనలను నియంత్రించడానికి 2022లో కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలంది. తప్పుడు ప్రకటనల నియంత్రణకు పటిష్ఠమైన చట్టం లేనప్పుడు శూన్యాన్ని భర్తీ చేయడానికి కేబుల్‌ నెట్‌వర్క్‌ నిబంధన-7కు లోబడి ఉండేలా ప్రకటన జారీ చేస్తున్నట్లు స్వీయ ధ్రువీకరణ సమర్పించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇకపై స్వీయ ధ్రువీకరణపత్రం లేకుండా ప్రకటన జారీ చేయరాదని, ప్రకటన జారీ చేసేవారికి జవాబుదారీతనం, బాధ్యత తప్పనిసరని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది. డిజిటల్, ఇంటర్నెట్‌ ప్రకటనల కోసం కేంద్ర ప్రభుత్వ బ్రాడ్‌కాస్ట్‌ సేవా పోర్టల్‌తోపాటు ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పోర్టల్‌లోనూ కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. తమ ప్రకటనలో తప్పుదోవ పట్టించే సమాచారం లేదని, అన్ని నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందని, దీంతోపాటు కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ నిబంధనలు-1994లోని నిబంధన-7కు, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొన్న నియమావళికి అనుగుణంగా ఉందంటూ స్వీయ ధ్రువీకరణ పత్రంలో పేర్కొనాల్సి ఉంటుంది. ప్రకటనదారు స్వీయధ్రువీకరణ పత్రాన్ని సమర్పించినట్లు ఆధారాన్ని సంబంధిత ప్రసారకర్తకు, ముద్రణదారుడికి, ప్రచురణకర్తకు అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రకటన జారీ చేసే సంస్థ అధీకృత సంతకందారు స్వీయ ధ్రువీకరణపత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఇది ప్రకటన ప్రామాణికతను, జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. అధీకృత సంతకందారు ఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌ వివరాలతో స్వీయ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని