వడివడిగా పర్యటన.. సమస్యలపైనే చర్చ

ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి పోలవరం పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. ప్రాజెక్టులోని స్పిల్‌వే, కాఫర్‌ డ్యాంలు, ప్రధాన డ్యాం ప్రాంతం, డయాఫ్రం వాల్, విద్యుత్కేంద్రం పనులను పరిశీలించారు.

Published : 18 Jun 2024 04:04 IST

ప్రాజెక్టులో ప్రధాన ప్రాంతాల పరిశీలన 

ఈనాడు, ఏలూరు: ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి పోలవరం పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. ప్రాజెక్టులోని స్పిల్‌వే, కాఫర్‌ డ్యాంలు, ప్రధాన డ్యాం ప్రాంతం, డయాఫ్రం వాల్, విద్యుత్కేంద్రం పనులను పరిశీలించారు. పోలవరంలో నెలకొన్న సమస్యలను, గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసాన్ని ఆమూలాగ్రం తెలుసుకున్నారు. స్పిల్‌వే పరిస్థితిపై ఆరా తీశారు. వైకాపా అనాలోచిత నిర్ణయాల వల్ల కుంగిన గైడ్‌బండ్‌ ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులను వివరాలు అడిగారు. వారు సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయారు. కనీస అప్రమత్తత లేకుండా వ్యవహరించారని అప్పటి అధికారుల తీరును తప్పుబట్టారు. అక్కడి నుంచి గ్యాప్‌ 2,3 దగ్గరకు వెళ్లారు. ఆయా ప్రాంతాల్లో ఇసుక కొట్టుకుపోవటంతో దెబ్బతిన్న డయాఫ్రంవాల్‌ను పరిశీలించారు. దెబ్బతిన్న ప్రాంతాన్ని చూసి జరిగిన నష్టంపై ఆరా తీశారు. అక్కడి నుంచి బస్సులో వెళుతూ దిగువ కాఫర్‌డ్యాం, జలవిద్యుత్తు కేంద్రాలను చూశారు. భోజన విరామం అనంతరం ప్రాజెక్టు అధికారులు, ఇంజినీరింగ్‌ విభాగం, నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ ప్రతినిధులతో నిర్వహించిన సీఎం సమీక్ష కూడా వాడీవేడిగా సాగింది. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు ఏం చర్యలు తీసుకోవాలి, జరిగిన నష్టాలను భర్తీ చేసేందుకు ఎంత ఖర్చవుతుందనే అంశాలపై సమీక్షించారు.

నాలుగున్నర గంటల పర్యటన

చంద్రబాబు ఉదయం 11.45 గంటలకు పోలవరం హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. వడివడిగా ప్రజాప్రతినిధులను కలిసి, వెంటనే ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. షెడ్యూల్‌ 2.05 గంటల వరకు ఉన్నా.. 1.55కే ప్రాజెక్టు సందర్శన, ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించటం, సందేహాలు లేవనెత్తి వాటిని నివృత్తి చేసుకోవడం పూర్తి చేశారు. పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌తో పని లేకుండా నేరుగా విషయం తెలుసుకున్నారు. సమస్యలపైనే ఎక్కువగా చర్చించారు. మీడియాతో మాట్లాడి, సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి బయలుదేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని