గనుల శాఖకు మస్కా కొట్టారు!

గనుల శాఖ సాఫ్ట్‌వేర్‌ను కొందరు ‘ఘనులు’ ట్యాంపరింగ్‌ చేశారు. పర్మిట్లు పరిమితంగా తీసుకున్నా.. సాఫ్ట్‌వేర్‌లో భారీగా ఉన్నట్టు కనిపించేలా చేశారు.

Published : 18 Jun 2024 05:11 IST

సాఫ్ట్‌వేర్‌ను ట్యాంపర్‌ చేసిన మినరల్‌ డీలర్‌ లైసెన్సుదారులు
తక్కువ పర్మిట్లతోనే భారీగా గ్రానైట్‌ పలకల తరలింపు
రూ.కోట్లలో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ‘ఘనులు’

ఈనాడు, అమరావతి: గనుల శాఖ సాఫ్ట్‌వేర్‌ను కొందరు ‘ఘనులు’ ట్యాంపరింగ్‌ చేశారు. పర్మిట్లు పరిమితంగా తీసుకున్నా.. సాఫ్ట్‌వేర్‌లో భారీగా ఉన్నట్టు కనిపించేలా చేశారు. తద్వారా పెద్దఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడి, అడ్డదారిలో గ్రానైట్‌ పలకలను తరలించారు. చాలాకాలంగా జరుగుతున్న ఈ దోపిడీ ఇటీవలే వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు ప్రాంతాల్లో ఖరీదైన గ్రానైట్‌ లభిస్తోంది. అక్కడ లీజుదారులు తవ్విన గ్రానైట్‌ ముడిరాయిని మినరల్‌ డీలర్‌ లైసెన్సుదారులకు (ఎండీఎల్స్‌) విక్రయిస్తారు. అందుకు గనుల శాఖకు ప్రతి క్యూబిక్‌ మీటరు ముడిరాయికి నిర్దేశిత సీనరేజ్‌ ఫీజు, కన్సిడరేషన్‌ మొత్తం తదితరాలు చెల్లించి పర్మిట్లు తీసుకుంటారు. ఆ తర్వాతే ముడిరాయి ఎండీఎల్స్‌కి వెళ్తుంది. అనంతరం ఆయా ఎండీఎల్స్‌ తమ మిల్లుల్లో ముడిరాయిని పలకలుగా కోసి, మెరుగు పెడతారు. ఏ సైజుల్లో, ఎన్ని చదరపు అడుగుల మేర పలకలుగా కోస్తారో.. ఆ మేరకు గనుల శాఖ నుంచి పొందిన పర్మిట్లు ఆన్‌లైన్‌లో పాస్‌లుగా మారతాయి. వాటితోనే పలకలను రవాణా, ఎగుమతి చేస్తారు. ఇక్కడే కొందరు ఎండీఎల్స్‌దారులు అక్రమాలకు తెర తీశారు.

పర్మిట్లు తరిగిపోకుండా మాయ

సాధారణంగా ఓ క్యూబిక్‌ మీటరు గ్రానైట్‌ ముడిరాయితో 40 ఎం.ఎం. సైజు పలకలైతే 150 చదరపు అడుగులు, 30 ఎం.ఎం. కొలతల్లో అయితే 270 చ.అ., 20 ఎం.ఎం. 350 చ.అ., 10 ఎం.ఎం. 450 చదరపు అడుగులు వస్తాయి. ఒకే క్యూబిక్‌ మీటరు పర్మిట్‌తో 40 ఎంఎం, 30 ఎంఎం, 20 ఎంఎం తదితర సైజుల్లో అనేక పలకలు కోసినట్లు చూపి, వాటికి ఆన్‌లైన్‌లో పాస్‌లు పొందుతూ వచ్చారు. సాధారణంగా ఒక పర్మిట్‌కు నిర్దేశిత చదరపు అడుగుల మేర పలకలకు పాస్‌లు జారీ అయ్యాక.. సాఫ్ట్‌వేర్‌లో లాక్‌ అవుతుంది. కానీ కొందరు ఎండీఎల్స్‌దారులు సాఫ్ట్‌వేర్‌ను ట్యాంపరింగ్‌ చేసి, లాక్‌ కాకుండా చేశారు. అంటే వారి ఎండీఎల్‌ ఎకౌంట్‌లో ఒకసారి తీసుకున్న పర్మిట్లు నిరంతరం అలాగే ఉంటాయి. వాటితో గ్రానైట్‌ పలకలకు కన్వర్షన్‌ పాస్‌లు జారీ అయినాసరే.. పర్మిట్లు మాత్రం తరగకుండా, ఖాతాలో కనిపించేలా చూశారు. ఇలా చీమకుర్తిలో 20 మందికిపైగా, బల్లికువర పరిధిలో ఇద్దరు అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. ఇంకా ఎంతమంది ఇలా పన్ను ఎగవేశారనేది తేలాల్సి ఉంది. వీరంతా రూ.కోట్లలో ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టినట్లు తెలుస్తోంది.

గుట్టుగా విచారణ

చాలాకాలంగా జరిగిన ఈ దోపిడీ దాదాపు రెండు నెలల కిందట బయటపడింది. సాఫ్ట్‌వేర్‌ను ట్యాంపర్‌ చేసి అక్రమాలు చేస్తున్న ఎండీఎల్స్‌దారుల్లో కొందరి మధ్య గొడవలు రావడంతో.. వారి దందాను వాళ్లే అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అప్పటి వరకు ఈ మోసాన్ని అధికారులు గుర్తించలేకపోయారు. గనుల శాఖ సాఫ్ట్‌వేర్‌కు సాంకేతిక సాయం అందిస్తున్న టీసీఎస్‌ సంస్థ కూడా దీన్ని పసిగట్టలేదు. ఇటీవల ఆ విషయం బయటకురావడంతో అధికారులు గుట్టుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కొందరికి షోకాజ్‌ నోటీసులు, తర్వాత జరిమానాలతో కూడిన డిమాండ్‌ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడిన వారిలో వైకాపాకు చెందినవారు, ఒకే సామాజికవర్గానికి చెందినవారు అధికంగా ఉన్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని