గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు.

Published : 18 Jun 2024 05:17 IST

మూడు నెలల్లో సరకు రవాణాను కట్టడి చేస్తాం 
హోం మంత్రి అనిత వెల్లడి

ఈనాడు, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. టాస్క్‌ఫోర్స్‌ తక్షణం రంగంలోకి దిగుతుందని చెప్పారు. మూడు నెలల్లో గంజాయి రవాణా తగ్గించి, మార్పు తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. గంజాయిపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రత్యేక చర్యలు ప్రారంభిస్తున్నామన్నారు. గంజాయి రవాణా నిరోధానికి చెక్‌పోస్టుల సంఖ్యను పెంచుతామని, కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశాఖలో రోడ్లపై గుంపులుగా గంజాయి తాగేవారిని అదుపులోకి తీసుకుంటామని, డి-అడిక్షన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గంజాయిపై సమాచారమిచ్చిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తామని, ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరును ప్రకటిస్తామని మంత్రి చెప్పారు. సోమవారం విశాఖలో నగర పోలీసు అధికారులతో సమీక్ష అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడారు. 

ఎవరినీ వదలం

‘సాయంత్రం వేళ కొన్ని ప్రదేశాలకు వెళ్లాలంటే గంజాయి బ్యాచ్‌లతో భయపడాల్సి వస్తోందని ఓ ఎమ్మెల్యే చెప్పారు. విశాఖ మినహా రాష్ట్రంలో గంజాయి కేసుల్లో చిక్కినవారు 385 మంది ఉంటే.. ఒక్క ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోనే 1,252 మంది జైల్లో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ఖైదీలను కలవాలని, వారిని కుటుంబసభ్యులతో వీడియో కాల్స్‌ మాట్లాడించాలని, గిరిజన ప్రాంతాలకు వెళ్లి గంజాయి నియంత్రణపై చైతన్యం కలిగించాలనే ఆలోచన ఉంది. గంజాయి వాసన గుర్తించే శునకాలు రెండే ఉన్నాయి. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను ఉంచేందుకు వేర్‌హౌస్‌ కూడా లేదు. నిధులున్నా గడిచిన ఐదేళ్లలో కలెక్టర్‌ వేర్‌హౌస్‌పై దృష్టి పెట్టలేదు’ అని వివరించారు. గంజాయి రవాణాలో ఏ పార్టీ వారున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. వీఆర్‌లో ఉన్న పోలీసులకు జీతాలు, స్టేషన్ల నిర్వహణ ఖర్చులకు సొమ్ములు ఇవ్వలేని దుస్థితిని గత ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. ఏపీలో కనీసం పోలీసు అకాడమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కర్నూలు వద్ద పోలీసు అకాడమీ నిర్మాణానికి రూ.500 కోట్లు, విశాఖ జిల్లా జగన్నాథపురంలో గ్రేహౌండ్స్‌ అకాడమీకి రూ.వెయ్యి కోట్లు కేటాయించిందని.. ఆ నిధులేమయ్యాయో తెలియదని అన్నారు.

కేసులపై పునర్విచారణ

‘పోలీసుల్లో చాలా మంది వైకాపాతో అంటకాగారు. కచ్చితంగా ప్రక్షాళన చేస్తాం’ అని మంత్రి అనిత వ్యాఖ్యానించారు. దిశ పోలీస్‌స్టేషన్లను మహిళా పోలీస్‌స్టేషన్లుగా మారుస్తామని చెప్పారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ కుటుంబం కిడ్నాప్‌ కేసు పునర్విచారణపై దృష్టి పెడతామని, తెదేపాకు ఓటేశారన్న అక్కసుతో విశాఖ బర్మా క్యాంపు ప్రాంతంలో జరిగిన దాడిపై బాధితులతో మాట్లాడతానని హోం మంత్రి ‘ఈనాడు’కు తెలిపారు. విశాఖ పోర్టుకు వచ్చిన 25 వేల కేజీల డ్రగ్స్‌ కంటెయినర్‌పై సమీక్షలో అధికారులను ప్రశ్నించానని.. నివేదిక తెప్పించుకుంటానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని