ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియామకం

గిరిజన ప్రాంతాల్లోని 543 ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్‌మెట్రిక్‌ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు కొత్తగా ఏఎన్‌ఎంలను నియమించనున్నట్లు గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రకటించారు.

Published : 18 Jun 2024 05:18 IST

ఐటీడీఏ, ఐసీడీఎస్‌లను ప్రక్షాళన చేస్తాం
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుమ్మిడి సంధ్యారాణి

రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న గుమ్మిడి సంధ్యారాణి

ఈనాడు, అమరావతి: గిరిజన ప్రాంతాల్లోని 543 ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్‌మెట్రిక్‌ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు కొత్తగా ఏఎన్‌ఎంలను నియమించనున్నట్లు గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రకటించారు. 2014-19 మధ్య తెదేపా హయాంలో వీరిని నియమించినా, వైకాపా ప్రభుత్వం తొలగించిందని గుర్తుచేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని ఏఎన్‌ఎంలు నిరంతరం పర్యవేక్షిస్తారని, నెలకోసారి వైద్యుడు వెళ్లి పరీక్షించి హెల్త్‌ కార్డులు రూపొందిస్తారని ఆమె తెలిపారు. సచివాలయం మూడో బ్లాక్‌లోని ఛాంబర్‌లో మంత్రిగా సంధ్యారాణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియామకం, అంగన్‌వాడీ కేంద్రాల్లో సంపూర్ణ పౌష్టికాహారం పంపిణీపై తొలి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘కొత్త వారిని నియమించే వరకు ఆరోగ్య కేంద్రాల్లోని ఏఎన్‌ఎంలను డిప్యుటేషన్‌పై వసతి గృహాలకు పంపిస్తాం. వర్షాకాలంలో వ్యాధుల తీవ్రత దృష్ట్యా వారిని పిల్లలకు అందుబాటులో ఉంచుతాం. కొత్త ఏఎన్‌ఎంల నియామకాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం’ అని మంత్రి వివరించారు.

‘నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచా. సీఎం చంద్రబాబు నాపై నమ్మకంతో కీలక మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. త్రికరణ శుద్ధితో పనిచేస్తా. గర్భిణులు, చిన్నారులు, గిరిజనుల్లో పౌష్టికాహార లోపంతో ఏ ఒక్కరూ చనిపోకుండా చర్యలు తీసుకుంటాం. అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి ఒక్కోటి పరిష్కరిస్తాం. ఐటీడీఏలు, ఐసీడీఎస్‌లను ప్రక్షాళన చేస్తాం’ అని సంధ్యారాణి తెలిపారు. ‘కేవలం చంద్రబాబుకు పేరొస్తుందనే దురాలోచనతో, 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం నెలకొల్పిన గిరిజన గర్భిణుల వసతి గృహాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వీటిని పునరుద్ధరిస్తాం. ఫీడర్‌ అంబులెన్స్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తాం. రోగులు, గర్భిణులకు డోలీ కష్టాలను తొలగిస్తాం’ అని స్పష్టం చేశారు. 

మంత్రికి కనీస మర్యాద ఇవ్వరా?

మంత్రి సంధ్యారాణి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులెవరూ హాజరుకాలేదు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, డైరెక్టర్‌ వెట్రి సెల్వీ, ఇతర అధికారులెవరూ రాలేదు. కనీసం పుష్పగుచ్ఛం ఇచ్చేవారు లేకపోవడం చర్చనీయాంశమైంది. కొందరు సూపరింటెండెంట్‌ స్థాయి అధికారులు మాత్రమే ఆ శాఖ నుంచి హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు