ఇటు ఎండ.. అటు వానలు

నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకి 15 రోజులు దాటినా.. పలు ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతలు కొనసాగుతున్నాయి. సోమవారం తుని, నరసాపురం, ఉత్తరాంధ్రలో పలు చోట్ల వడగాలులు వీచాయి.

Published : 18 Jun 2024 05:19 IST

తునిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40.2 డిగ్రీలు
చిట్టమూరులో 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకి 15 రోజులు దాటినా.. పలు ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతలు కొనసాగుతున్నాయి. సోమవారం తుని, నరసాపురం, ఉత్తరాంధ్రలో పలు చోట్ల వడగాలులు వీచాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా తునిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40.2 డిగ్రీలుగా నమోదైంది. మరో 2 లేదా 3 రోజులు వేడి, ఉక్కపోత ఉండొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో మరో ఆవర్తనం లేదా అల్పపీడనం ఏర్పడితే రుతుపవనాలు బలపడతాయని చెబుతున్నారు. మరోవైపు గోవా నుంచి దక్షిణ కోస్తా వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని వివరించింది. పిడుగులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. సోమవారం తిరుపతి, పల్నాడు, గుంటూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాత్రి 7 గంటల వరకు తిరుపతి జిల్లా చిట్టమూరులో 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని