ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకున్న జగన్‌

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన భద్రత కోసం ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమించుకున్న సుమారు 30 మంది సిబ్బంది సోమవారం తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

Updated : 18 Jun 2024 09:21 IST

జగన్‌ క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది

ఈనాడు-అమరావతి, తాడేపల్లి-న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన భద్రత కోసం ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమించుకున్న సుమారు 30 మంది సిబ్బంది సోమవారం తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తొలుత ఒకేసారి అంతమంది సఫారీ సూట్లలో భరతమాత విగ్రహం కూడలి వద్ద నిలబడటంతో హడావుడి నెలకొంది. వారికి అనుమతి వచ్చిన తర్వాత క్యాంపు కార్యాలయంలోకి వెళ్లారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, పాదయాత్ర సమయంలో ప్రైవేటు భద్రతా సిబ్బందిని పెద్ద సంఖ్యలో జగన్‌ నియమించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి జగన్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి స్థాయిలోనే భద్రతను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మాజీ అవడంతో పాటు, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆయన పార్టీకి దక్కలేదు. ఇకపై జగన్‌ ఓ మాజీ ముఖ్యమంత్రిగా, సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగానే ఆయన భద్రతలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా ప్రైవేటు సిబ్బందిని జగన్‌ సిద్ధం చేసుకున్నారు. 

సీఎంగా ఉండగా ప్రత్యేక చట్టం 

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు, తన కుటుంబ సభ్యులకు రాష్ట్రంలోనే కాదు.. దేశంలో, విదేశాల్లో ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా అత్యంత సమీపం నుంచి భద్రత (ప్రాక్సిమేట్‌ సెక్యూరిటీ) కల్పించేందుకు స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌(ఎస్‌ఎస్‌జీ)ను ఏర్పాటు చేస్తూ ఒక చట్టాన్నే జగన్‌ తీసుకువచ్చారు. ఇలా ఒక ముఖ్యమంత్రి తన కుటుంబం కోసం ఎస్‌ఎస్‌జీని ఏర్పాటు చేసుకోవడం దేశంలో అదే మొదటిసారి కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని