వళవన్‌.. వైకాపాకు తలాడించెన్‌!

ఆయన గతేడాది ప్రత్యేక ప్రధానకార్యదర్శి హోదాలో పదవీవిరమణ చేశారు. కానీ జగన్‌ ప్రభుత్వం మరో ఏడాది సర్వీసు పొడిగించి.. దేవాదాయశాఖలో పోస్టింగ్‌ ఇచ్చింది.

Updated : 18 Jun 2024 06:57 IST

పలు మఠాల భూములు ధారాదత్తం చేసే యత్నాలు
కొందరు అధికారులను లక్ష్యంగా చేసుకొని చర్యలు
సర్వీసు పొడిగించినందుకు రుణం తీర్చుకునేలా నడవడిక

ఈనాడు, అమరావతి: ఆయన గతేడాది ప్రత్యేక ప్రధానకార్యదర్శి హోదాలో పదవీవిరమణ చేశారు. కానీ జగన్‌ ప్రభుత్వం మరో ఏడాది సర్వీసు పొడిగించి.. దేవాదాయశాఖలో పోస్టింగ్‌ ఇచ్చింది. ఇంకేముంది.. వైకాపా ముఖ్యనేతల రుణం తీర్చుకున్నారు. స్వామి కార్యం.. స్వకార్యం అన్నట్లు.. తనకు తెలిసిన వారికి దేవాదాయశాఖలో పొరుగుసేవల కింద ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. ఇది దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా 11 నెలలు కొనసాగి, తాజాగా రాజీనామా చేసిన కరికాల్‌ వళవన్‌ తీరు. ఆయన రాజీనామా నేపథ్యంలో.. ఇంతకాలం ఆయన తీసుకున్న నిర్ణయాలు, జారీచేసిన ఆదేశాలపై దేవాదాయశాఖలో పెద్ద చర్చ జరుగుతోంది.

వచ్చినప్పటి నుంచి అదే ధోరణి

పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉండగా.. గతేడాది జూన్‌ నెలాఖరులో వళవన్‌ పదవీవిరమణ చేశారు. ఆయనకు జగన్‌ ప్రభుత్వం మరో ఏడాది సర్వీసు పొడిగించి, దేవాదాయ శాఖలో నియమించింది. అప్పట్లోనే ఇలా ఎందుకు ఇచ్చారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ తర్వాత ఆయన తీరు, వైకాపా నేతలకు భారీ మేలు కలిగించడం చూస్తే.. వారితో ఎలా అంటకాగారో అర్థమైంది.

భూముల దస్త్రాలకు పరుగులు

  • అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం పట్టెంవాండ్లపల్లెలోని వ్యాసరాయ మఠానికి 727.43 ఎకరాలు ఉండగా.. దీన్ని గతంలో అధికారులు నిషేధిత భూముల జాబితాలో పెట్టారు. పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన ఓ వైకాపా నేత ద్వారా అర్జీపెట్టించి నిషేధిత జాబితా నుంచి తొలగించి, వాటిని కొట్టేసేందుకు గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ‘పెద్దాయన’ చూశారు. దీనిపై వళవన్‌ ప్రత్యేకదృష్టి సారించారనే విమర్శలు ఉన్నాయి. దేవాదాయ అధికారులతో కమిటీ వేయగా.. రాయలసీమ జిల్లాల ఉపకమిషనర్‌.. అనుకూలంగా నివేదిక ఇచ్చారు. మఠం కర్ణాటకలో ఉన్నందున, ఈ భూములతో మనకు సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. ఇతర అధికారులు మాత్రం.. ఈ భూములపై కోర్టులో కేసులు ఉన్నందున, అవి పరిష్కారమయ్యే వరకు వాటి జోలికి వెళ్లొద్దన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ఏప్రిల్‌ రెండోవారంలో సైతం దీనిపై సమీక్షలంటూ వళవన్‌ హడావిడి చేశారు.
  • విజయనగరం శివారులోని ధర్మపురి వద్ద మాన్సాస్‌ ట్రస్టుకు చెందిన రూ.100 కోట్ల విలువైన 8.96 ఎకరాలను ధారాదత్తం చేయాలని చూశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ భూమి తమదని, దాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రియల్‌ఎస్టేట్‌ సంస్థ ప్రతినిధి ఫిబ్రవరిలో అర్జీ పెట్టడంతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్వోసీ ఇచ్చేందుకు హడావిడి చేశారు. ఇలాగే 2021లో అర్జీ వస్తే, ఎన్వోసీ ఇవ్వడం కుదరదని అప్పటి అధికారులు ఆదేశాలిచ్చారు. కావాలంటే ట్రైబ్యునల్‌కు వెళ్లాలని సూచించారు. కానీ రియల్‌ఎస్టేట్‌ సంస్థ ప్రతినిధి ట్రైబ్యునల్‌కు వెళ్లకుండా, వైకాపా కీలక నేతల ద్వారా లాబీయింగ్‌ చేసి ఫిబ్రవరిలో మళ్లీ దరఖాస్తు చేసుకొని ఎన్వోసీ పొందే ప్రయత్నం చేశారు. అయితే ఎన్నికల కోడ్‌ రావడంతో.. చివరిదశలో ఆగింది.
  • తిరుపతి వరదరాజనగర్‌లో ఉన్న గాలిగోపురం మఠం భూములపై ఎప్పటినుంచో వివాదం ఉంది. మఠం దేవాదాయశాఖ పరిధిలో ఉన్నా.. 1980లలో మఠాధిపతి ఆ భూములను ఇతరులకు విక్రయించారు. అది చెల్లదని, ఆ భూములు మఠానికే చెందుతాయని తర్వాత దేవాదాయశాఖ తేల్చింది. అప్పటికే అక్కడ నిర్మాణాలు ఉండటంతో.. వాటిని క్రమబద్ధీకరించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ నివాసితుల నుంచి తక్కువ మొత్తం తీసుకొని క్రమబద్ధీకరించేలా ఓ కలెక్టర్‌ ప్రతిపాదన పంపారు. కానీ అప్పటి దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్, సీసీఎల్‌ఏ సాయిప్రసాద్‌ మాత్రం.. ప్రస్తుత మార్కెట్‌ ధర చెల్లిస్తేనే క్రమబద్ధీకరించాలని సూచించారు. దీంతో ఈ దస్త్రం ఆగిపోయింది. తాజాగా వళవన్‌ ఈ దస్త్రాన్ని మళ్లీ బయటకు తీయించి, వైకాపా నేతల ఒత్తిడితో తక్కువ మొత్తానికే క్రమబద్ధీకరణ చేసేందుకు ఉన్న మార్గాలపై విశ్వప్రయత్నాలు చేశారు.

తెలిసినోళ్లకు ఉద్యోగాలు..

వళవన్‌ తనకు తెలిసిన వారికి దేవాదాయశాఖ కార్యాలయాలు, వివిధ ఆలయాల్లో పొరుగుసేవల కింద ఉద్యోగాలు వేయించారు. శాఖ అధిపతి ఆదేశాలివ్వడంతో ఈఓలు, అధికారులు అడ్డు చెప్పలేకపోయారు. సచివాలయంలోని ఆయన పేషీ, ఇంటివద్ద పనిచేసేందుకు 10 మందిని నియమించుకున్నారు. వీరికి ఆలయాల నుంచి జీతాలు ఇప్పించారు. గతంలో పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన పేషీలో ఇద్దరు పొరుగుసేవల మహిళా ఉద్యోగులు కీలకంగా వ్యవహరించారు. ఆయన దేవాదాయశాఖకు వచ్చాక.. వారినీ ఇక్కడకు తీసుకొచ్చారు. వీళ్లిద్దరూ అన్ని దస్త్రాలు, బదిలీలు, పదోన్నతులు.. తదితరాలు అన్నింటి విషయంలో నేరుగా ఫోన్లు చేసి బేరాలు మాట్లాడి, సెటిల్‌మెంట్లు చేసేవారని ఆరోపణలు ఉన్నాయి.


సీఎస్‌కు రాజీనామా అందజేత

దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కరికాల్‌ వళవన్‌ తన ఉద్యోగానికి 3 రోజుల కిందట రాజీనామా చేశారు. గతేడాది జులైలో ఆయన ఈ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా నియమితులయ్యారు. వచ్చే నెలాఖరు వరకు ఆయనకు ఉద్యోగంలో కొనసాగే వీలుంది. ఇంతకాలం వైకాపా నేతలతో అంటకాగారనే విమర్శల నేపథ్యంలో.. ఇంకా గడువు ఉండగానే రాజీనామా చేసినట్లు తెలిసింది.


మంత్రి సూచనతో వేధింపులు

దేవాదాయశాఖ మంత్రిగా మొన్నటివరకు కొనసాగిన కొట్టు సత్యనారాయణ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అది సరికాదని చెప్పాల్సిన వళవన్‌.. ఆయనకు వంతపాడుతూ వచ్చారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని పేర్కొన్న అదనపు కమిషనర్‌ రామచంద్రమోహన్‌ను లక్ష్యంగా చేసుకొని.. ఆయన హోదా కంటే తక్కువ కేడర్‌ అయిన అన్నవరం ఆలయ ఈఓగా పంపారు. దీనిపై హైకోర్టు ఆయనకు అనుకూలంగా ఆదేశాలిచ్చినా.. కమిషనరేట్‌లోకి అడుగు పెట్టనివ్వకుండా చేశారు. మరోవైపు కమిషనరేట్‌లో అసలు పోస్టే లేని చంద్రశేఖర్‌ ఆజాద్‌ను.. తీసుకొచ్చి కీలక విభాగాల దస్త్రాలను ఆయన ద్వారా నడిపించారు.

ఈఓలు, సహాయ కమిషనర్ల పదోన్నతులపై పెద్ద రచ్చ జరిగింది. సీనియారిటీ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం పదోన్నతులు ఇచ్చారు. మంత్రి చెప్పినట్లు తలాడించారు. ఇది తప్పంటూ హైకోర్టును ఆశ్రయించిన ఆదిశేషు నాయుడు, తిమ్మి నాయుడు వంటి సహాయ కమిషనర్లను సస్పెండ్‌ చేయాలని చూడగా.. కమిషనర్‌ సత్యనారాయణ చివర్లో అడ్డుకున్నట్లు సమాచారం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని