జలగన్నలు జారిపోతున్నారు!

కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి.. అర్హత లేకపోయినా జగన్‌ ప్రభుత్వం అందలం ఎక్కించిన అధికారుల్లో చాలామంది నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Updated : 18 Jun 2024 09:56 IST

కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి  
అర్హత లేకపోయినా జగన్‌ ప్రభుత్వం అందలం
చడీచప్పుడు లేకుండా జారుకునే ప్రయత్నాలు

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి.. అర్హత లేకపోయినా జగన్‌ ప్రభుత్వం అందలం ఎక్కించిన అధికారుల్లో చాలామంది నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐదేళ్లలో అనేక అరాచకాలకు, అవకతవకలకు పాల్పడిన అధికారులు, కొత్త ప్రభుత్వం తమపై విచారణ జరిపిస్తే దొరికిపోతామన్న భయంతో తప్పించుకుపోవాలని చూస్తున్నారు. అలాంటి అధికారులెవర్నీ రిలీవ్‌ చేయవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, తాము కోరినా రిలీవ్‌ చేయదని అర్థమవడంతో డిప్యుటేషన్‌ గడువు ముగిసిన వెంటనే ఇక్కడ రిలీవ్‌ అవుతున్నట్టుగా ఒక కాగితం పడేసి, చడీచప్పుడు లేకుండా వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. డిప్యుటేషన్‌ గడువు ముగిశాక తదుపరి ఉత్తర్వులేమీ అవసరం లేకుండానే అధికారులు రిలీవ్‌ అయిపోవచ్చునన్న కేంద్ర నిబంధనను అడ్డుపెట్టుకుని వారు వెళ్లిపోవాలని చూస్తున్నారు. ఐదేళ్లలో ఆర్థికశాఖను సకల అవలక్షణాలకు కేంద్రంగా మార్చేసిన ఆ శాఖ కార్యదర్శి, ఐఆర్‌టీఎస్‌ అధికారి కేవీవీ సత్యనారాయణ డిప్యుటేషన్‌ గడువు మంగళవారంతో ముగుస్తుండటంతో.. మాతృశాఖకు వెళ్లిపోయేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఈశాన్య రైల్వేలో పోస్టింగ్‌ కూడా తెచ్చుకున్నారు. దీన్ని పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రయత్నాలకు బ్రేక్‌ వేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు రిలీవ్‌ కావొద్దని, ఎవరికీ ఛార్జ్‌ అప్పగించవద్దని ఈ నెల 15న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ సెలవుపై ఉన్నందున, శాఖలో రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణకు సీనియర్‌ అధికారి అవసరముందని, కాబట్టి సత్యనారాయణ అక్కడే కొనసాగాలని సీఎస్‌ స్పష్టంచేశారు. ఐదేళ్లుగా వైకాపాతో అంటకాగుతూ, తమకు ఎదురేలేదన్నట్టుగా రెచ్చిపోయిన అధికారులకు ఈ పరిణామం మింగుడుపడటం లేదు.

ఫలితాలు రాగానే సర్దుకునే యత్నం 

అధికారం శాశ్వతమని, మరో 30 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని జగన్‌ కలలుగన్నారు. ఆయన వీరభక్త అధికారగణం కూడా అదే భ్రమల్లో ఉండి, తమకు తిరుగేలేదన్నట్టుగా చెలరేగిపోయింది. డిప్యుటేషన్‌పై వచ్చిన పలువురు అధికారులు.. రెగ్యులర్‌ ఏపీ కేడర్‌ అధికారులను మించి పెత్తనం చేశారు. వైకాపా నాయకుల అరాచకాలకు వంతపాడారు. వైకాపాకు ఘోరపరాజయం ఎదురవడంతో.. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అలాంటి అధికారులంతా సర్దుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమను రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్‌ చేస్తే మాతృశాఖకు వెళ్లిపోతామని రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ ఐజీ రామకృష్ణ, గనులశాఖ పూర్వ ఎండీ వెంకట్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) కమిషనర్‌ చిలకల రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ప్రభుత్వాన్ని కోరారు. కానీ కొత్త ప్రభుత్వం కొలువుతీరి, పరిస్థితి సమీక్షించే వరకు వారెవర్నీ రిలీవ్‌ చేయరాదని నిర్ణయించడంతో వారి ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది.  

ముందు బయట పడితే అదే చాలు.. 

కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు సుమారు 20 మంది ఉన్నారు. వారిలో కేవీవీ సత్యనారాయణ తప్ప మిగతా వారంతా జగన్‌ హయాంలో డిప్యుటేషన్‌పై వచ్చినవారే. వారిలో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వారిలో అనేకమంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీజీ వెంకట్‌రెడ్డి, రామకృష్ణ, మధుసూదన్‌రెడ్డి, ఎన్నికలకు ముందు ఈసీ బదిలీ చేసిన.. ఆంధ్రప్రదేశ్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, డీఆర్‌ఐ కమిషనర్‌ రాజేశ్వర్‌రెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ దీవన్‌రెడ్డి, తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డి వంటివారు ఈ కోవలో ఉన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక వీరిలో కొందరిని ఆ వారు నిర్వహిస్తున్న పోస్టుల నుంచి తప్పించింది. వారంతా ముందు ఈ రాష్ట్రం నుంచి ఏదోలా బయటపడితే చాలన్నట్టుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వకపోయినా... డిప్యుటేషన్‌ గడువు ముగిసిన వెంటనే రిలీవై వెళ్లిపోవాలని చూస్తున్నారు. 

ఐదేళ్లూ చెలరేగిపోయారు..!

డిప్యుటేషన్‌పై వచ్చిన పలువురు అధికారులు ఐదేళ్లలో చేసిన అక్రమాలు, అవకతవకలు అన్నీ ఇన్నీ కాదు. ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ.. ఆ శాఖను అన్ని రకాల అవలక్షణాలకు కేంద్రంగా మార్చేశారు. సీఎఫ్‌ఎంఎస్‌ను పూర్తిగా తన గుప్పిట్లోనే పెట్టుకున్నారు. ఎవరికైనా బిల్లులు చెల్లించాలంటే ఆయన కటాక్షం ఉండాల్సిందే. పూర్తిగా సీఎం కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తూ, అప్పటి సీఎంకు కార్యదర్శిగా ఉన్న ధనుంజయరెడ్డి చెప్పినట్టల్లా ఆడారు. ముందు వచ్చిన బిల్లులు ముందు చెల్లించే (ఫిఫో) విధానాన్ని వదిలేసి ప్రభుత్వ పెద్దల అస్మదీయులైన గుత్తేదారులకు మొదట చెల్లింపులు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఫిఫో విధానానికి భిన్నంగా చెల్లింపులు జరిపితే.. దానికి కారణాల్ని కూడా ప్రస్తావించాలి. ప్రతిసారీ సీఎం కార్యాలయం ఆదేశాలతో చేశామని రాయడం ఇబ్బందికరమని భావించి, ఆ విధానానికే ఆయన మంగళం పాడేశారు. ప్రభుత్వ కార్పొరేషన్ల పీడీ ఖాతాల్లోని డబ్బును.. ఇష్టానుసారం బదలాయించడంతో ఆయనే కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పెద్దల దోపిడీకి అడ్డగోలుగా సహకరించిన గనులశాఖ పూర్వ ఎండీ వీజీ వెంకటర్‌రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జేబ్రాండ్‌ మద్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిన వాసుదేవరెడ్డి, తితిదేని సొంత సామ్రాజ్యంగా మార్చేసుకున్న ధర్మారెడ్డి, జగన్‌ కోటరీలో కీలక వ్యక్తిగా వ్యవహరిస్తూ, ‘సాక్షి’ పత్రిక, ఛానళ్లకు ప్రకటనలు గుప్పించి రూ.వందల కోట్లు కట్టబెట్టిన సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, విపక్షాలపై కక్ష సాధింపే ఎజెండాగా పనిచేసిన రాజేశ్వర్‌రెడ్డి వంటివారు నిబంధనల్ని తుంగలో తొక్కి చెలరేగిపోయారు. అలాంటి వారంతా ఇప్పుడు విచారణ నుంచి తప్పించుకునేందుకు రాష్ట్రాన్ని వదిలి పోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం వారి ప్రయత్నాలకు అడ్డుకట్టవేసి, వారి అవకతవకలపై తగిన విచారణ జరపాలి. అవినీతికి పాల్పడినవారి నుంచి సొమ్ములు కక్కించాలి. ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని ఏం చేసినా చెల్లిపోతుందనుకునే అధికారులకు అది గుణపాఠం కావాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని