గనుల శాఖ పర్మిట్ల జారీ నిలిపివేత

రాష్ట్రవ్యాప్తంగా గనుల శాఖకు చెందిన ఆన్‌లైన్‌ పర్మిట్ల జారీ ప్రక్రియను నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆదివారం రాత్రి నుంచి సర్వర్‌ను డౌన్‌ చేశారు.

Published : 18 Jun 2024 05:29 IST

సర్వర్‌ను డౌన్‌ చేసిన అధికారులు
మంత్రి సమీక్షించాకే నిర్ణయం

ఈనాడు-అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గనుల శాఖకు చెందిన ఆన్‌లైన్‌ పర్మిట్ల జారీ ప్రక్రియను నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆదివారం రాత్రి నుంచి సర్వర్‌ను డౌన్‌ చేశారు. లీజుదారులు సోమవారం పర్మిట్ల కోసం ఆన్‌లైన్‌లో ఎంత ప్రయత్నించినా వెబ్‌సైట్‌ పని చేయలేదు. దీంతో అధికారులను సంప్రదించగా, సాంకేతిక సమస్య ఉందని బయటకు చెబుతున్నారు. కానీ, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పర్మిట్లు జారీ చేయకూడదని ఆదేశాలొచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం, గుంటూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సీనరేజ్‌ వసూళ్ల గుత్తేదారులు ఆఫ్‌లైన్‌లో చేతిరాతతో కూడిన పర్మిట్ల జారీని నిలిపివేశారు. మిగిలిన జిల్లాల్లో మాత్రం గనుల శాఖ ద్వారా ఆన్‌లైన్‌ పర్మిట్లు జారీ అవుతూ వచ్చాయి. కొన్నిచోట్ల పర్మిట్లు ఇచ్చి, మరికొన్నిచోట్ల ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో మొత్తంగా అన్ని జిల్లాల్లో ఆపేయాలని ఆదేశించారు. మరోవైపు గనుల శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. గనుల శాఖ కార్యదర్శి, సంచాలకునిగా ప్రస్తుతం యువరాజ్‌ పూర్తి అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఆయనే కొనసాగుతారా.. ఆ స్థానంలో మరొక ఐఏఎస్‌ అధికారి వస్తారా.. అనేది రెండు, మూడు రోజుల్లో తేలనుంది. ఆ తర్వాత మంత్రి, కార్యదర్శి కలిసి గనుల శాఖపై సమీక్ష చేసి, గత అయిదేళ్లలో జరిగిందేమిటి.. ఇకపై ఎటువంటి విధానం అమలు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అప్పటి వరకు గనుల శాఖ సంచాలకుని కార్యాలయం, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కార్యాలయం తెరుచుకోవని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని