సంక్షిప్త వార్తలు(11)

రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) ఎండీ భరత్‌రెడ్డిని విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏవియేషన్‌ సలహాదారు బాధ్యతల నుంచి ఆయన్ను తప్పిస్తూ కొద్ది రోజుల కిందట సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది.

Published : 19 Jun 2024 06:28 IST

ఏపీఏడీసీఎల్‌ ఎండీ భరత్‌రెడ్డి తొలగింపు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) ఎండీ భరత్‌రెడ్డిని విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏవియేషన్‌ సలహాదారు బాధ్యతల నుంచి ఆయన్ను తప్పిస్తూ కొద్ది రోజుల కిందట సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఎండీ బాధ్యతల నుంచి కూడా తప్పించింది. ఇన్‌ఛార్జ్‌ ఎండీగా పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీఏడీసీఎల్‌ ఎండీగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా భరత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఆయన మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు.


వైకాపాతో అంటకాగిన ఎస్పీఎం డిప్యుటేషన్‌ రద్దు

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వంతో అంటకాగిన జాతీయ ఆరోగ్య మిషన్‌ స్టేట్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ (ఎస్పీఎం) డాక్టర్‌ డి.వెంకట రవికిరణ్‌ను మాతృశాఖకు పంపిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్య సంచాలకుల పరిధిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రవికిరణ్‌ జూనియర్‌ అయినప్పటికీ వైకాపా ప్రభుత్వం ఎస్పీఎంగా నియమించింది. విధుల నిర్వహణలో ఆయన వ్యవహారశైలి వివాదాలకు దారితీసింది.


పీసీబీ సభ్యుల రాజీనామాలకు ఆమోదం

ఈనాడు, అమరావతి: వైకాపా హయాంలో ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్యులుగా నియమితులైన పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే ఎం.సునీల్‌కుమార్, విశాఖపట్నానికి చెందిన మహ్మద్‌ సాదిక్, పులివెందుల నియోజకవర్గానికి చెందిన మరక శివకృష్ణారెడ్డి, మార్కాపురానికి చెందిన వెన్నా హనుమారెడ్డిల రాజీనామాలను ఆమోదిస్తూ అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శరవణన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఛైర్మన్‌ గుబ్బ చంద్రశేఖర్‌ రాజీనామానూ అటవీ శాఖ ఆమోదించింది.


భూ హక్కు పత్రాల పంపిణీ నిలిపివేత

ఈనాడు, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ఫొటోలతో ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాల (భూ హక్కు పత్రం) పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో లక్ష పుస్తకాలు రెవెన్యూ శాఖ సిబ్బంది వద్ద ఉన్నాయి. కొత్త ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని అనుసరించి వీటి పంపిణీ నిలిపివేయాలని నిర్ణయించారు. 


టమాటా ధరల నియంత్రణకు చర్యలు

ప్రతి జిల్లాకు రూ.5 లక్షల రివాల్వింగ్‌ ఫండ్‌

గుంటూరు(మిర్చియార్డు), న్యూస్‌టుడే: పెరుగుతున్న టమాటా ధరల్ని నియంత్రించేందుకు ప్రతి జిల్లాకు రూ.5 లక్షల చొప్పున రివాల్వింగ్‌ ఫండ్‌ కేటాయిస్తున్నట్లు మార్కెటింగ్‌ శాఖ కమిషనర్, రైతు బజార్ల ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రశాంతి తెలిపారు. రిటైల్‌ మార్కెట్లో కిలో టమాటా రూ.55 నుంచి రూ.65 వరకు పలుకుతున్న నేపథ్యంలో ధరల్ని అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు ప్రస్తుత సీజన్లో లేకపోవడం, చిత్తూరు జిల్లాలో మాత్రమే లభ్యమవుతుండటంతో ధర పెరుగుతోందని చెప్పారు. మార్కెటింగ్‌ శాఖ.. ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. గత పది రోజుల్లో చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని మార్కెట్లలో 30 టన్నుల టమాటాలు కొనుగోలు చేసి గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని రైతుబజార్లలో కొనుగోలు ధరలకే విక్రయించామని తెలిపారు. ఈ కొనుగోలు ప్రక్రియను చేపట్టేందుకు ప్రతి జిల్లా అధికారి ఆధీనంలో రూ.5 లక్షల రివాల్వింగ్‌ ఫండ్‌ అందుబాటులో ఉంచామని వివరించారు.


రుషికొండ భవనాలను ఆసుపత్రులుగా మార్చాలి: సీబీఐ మాజీ డైరెక్టర్‌ నాగేశ్వరరావు 

ఈనాడు-అమరావతి: విశాఖలో రుషికొండపై నిర్మించిన భవనాలను దిల్లీలోని ఎయిమ్స్‌ తరహాలో తీర్చిదిద్ది జాతికి అంకితం చేయాలని సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రికి ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జగన్‌ ప్రభుత్వంలో రుషికొండపై ప్రజాధనం దుర్వినియోగం చేసి కట్టిన భవనాల్లో జరిగిన అవినీతి, అవకతవకలు వెలికి తీయాలని సూచించారు.


ఇప్పుడిస్తున్న ధ్రువపత్రాలనే జారీ చేయాలి

కలెక్టర్లకు సచివాలయాల శాఖ స్పష్టత

ఈనాడు, అమరావతి: తదుపరి ఆదేశాలొచ్చే వరకు ఎన్నికల కోడ్‌ సమయంలో ప్రత్యేకంగా ముద్రించి సరఫరా చేసిన ధ్రువపత్రాలనే గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు జారీ చేయాలని కలెక్టర్లకు రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సూచించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వాటినే జారీ చేయనున్నారు.


ఏజీ, అదనపు ఏజీ, పీపీల రాజీనామాలు ఆమోదం 

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ)గా పనిచేసిన ఎస్‌.శ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి, పీపీ వై.నాగిరెడ్డిల రాజీనామాలను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఎన్నికల్లో వైకాపా ఓటమి పాలయ్యాక ఏజీ, అదనపు ఏజీ, పీపీ రాష్ట్ర ప్రభుత్వానికి రాజీనామా లేఖలు సమర్పించిన విషయం తెలిసిందే.


ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి: ద.మ.రైల్వే జీఎం

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో భద్రతాపరమైన అంశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని జనరల్‌ మేనేజర్‌ (జీఎం) అరుణ్‌కుమార్‌ జైన్‌ అధికారుల్ని ఆదేశించారు. లోకోపైలట్లు, ట్రాక్‌ మెయింటెయినర్లు, షంటర్లు, గార్డులకు భద్రతపై కౌన్సెలింగ్‌ నిర్వహించాలని స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ రైలు నిలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రైళ్ల రాకపోకలు, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పశ్చిమబెంగాల్‌లో సోమవారం జరిగిన రైలు ప్రమాదం నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో మెరుగైన పనితీరు కనబర్చిన 12 మంది ఉద్యోగులకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డులను ప్రదానం చేశారు. 


హోం మంత్రికి తెదేపా కార్యాలయంలో ఘన స్వాగతం

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో తెలుగు మహిళలు మంగళవారం ఘన స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆమె తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఇన్ని రోజులూ తనతో కలిసి పనిచేసిన మహిళా విభాగం సభ్యులందరికీ అనిత ధన్యవాదాలు తెలిపారు.  


తొలకరి.. కుంటాలకు జలసిరి 

తెలంగాణలోనే ఎత్తయిన జలపాతంగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలంలోని ‘కుంటాల’... ఆరు నెలలుగా చుక్క నీరు లేక బోసిపోయింది. సోమవారం రాత్రి ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి నీటి పరవళ్లతో కుంటాల జలపాతం కళకళలాడింది. హోరుమంటూ పెద్ద శబ్దాలతో ఎరుపురంగులో జాలువారుతున్న నీరు.. చూసేవారిని ఆనందంలో తేలియాడేలా చేసింది.

ఈనాడు, ఆదిలాబాద్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని