‘జగన్‌పై సీబీఐ, ఈడీ కేసుల విచారణను వేగవంతంగా కొలిక్కి తేవాలి’

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణను ఆయా దర్యాప్తు సంస్థలు వేగవంతం చేసి కొలిక్కి తీసుకురాకపోతే, అది ఆయా సంస్థల ప్రతిష్ఠకే భంగకరమని ఉత్తర్‌ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల మాజీ డీజీపీ, బీఎస్‌ఎఫ్‌ మాజీ డీజీ ప్రకాశ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు.

Published : 19 Jun 2024 04:40 IST

లేకపోతే ఆ సంస్థల ప్రతిష్ఠకే భంగకరం
మాజీ డీజీపీ ప్రకాశ్‌సింగ్‌ ట్వీట్‌

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణను ఆయా దర్యాప్తు సంస్థలు వేగవంతం చేసి కొలిక్కి తీసుకురాకపోతే, అది ఆయా సంస్థల ప్రతిష్ఠకే భంగకరమని ఉత్తర్‌ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల మాజీ డీజీపీ, బీఎస్‌ఎఫ్‌ మాజీ డీజీ ప్రకాశ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. జగన్‌పై 11 సీబీఐ, 7 ఈడీ కేసులున్నప్పటికీ, ఐదేళ్లుగా న్యాయస్థానాల్లో విచారణకు హాజరు కావడం లేదంటూ ‘సీమకుర్రాడు’ అనే ఎక్స్‌ ఖాతా నుంచి చేసిన పోస్టును ప్రకాశ్‌సింగ్‌ రీట్వీట్‌ చేస్తూ, ఇలా అభిప్రాయపడ్డారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందంటూ వికీలీక్స్‌ చెప్పినట్లుగా పత్రికల్లో వచ్చిన కథనాలు, జగన్‌పై ఉన్న పెండింగ్‌ కేసుల వివరాల్ని ప్రస్తావిస్తూ సీమకుర్రాడు చేసిన ట్వీట్‌ను పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన ప్రకాశ్‌సింగ్‌ రీట్వీట్‌ చేశారు. 

జగన్‌ బెంగళూరు ప్యాలెస్‌ వీడియో కూడా..

బెంగళూరులోని జగన్‌ ప్యాలెస్‌ వీడియోతో ఉన్న ఓ పోస్టును కూడా ప్రకాశ్‌సింగ్‌ రీట్వీట్‌ చేశారు. జగన్‌ ఎంతటి విలాసవంతమైన జీవితం గడుపుతారో చెప్పేందుకు బెంగళూరు ప్యాలెస్‌ ఓ మచ్చుతునక మాత్రమేనంటూ షెల్‌బై అనే ఎక్స్‌ ఖాతా నుంచి పెట్టిన పోస్టును ఆయన తిరిగి పోస్టు చేశారు. జగన్‌పై అవినీతి కేసుల విచారణను ముమ్మరం చేయాలని అందులో పేర్కొన్నారు. ‘ఇది ఇల్లు కాదు. విలాసవంతమైన రాజభవనం. ఆ ప్యాలెస్‌ లోపలికి కాదు కదా, కనీసం దరిదాపుల్లోకి కూడా ఎవరినీ అనుమతించకుండా రాత్రీపగలూ భారీగా భద్రతా సిబ్బందిని కాపలాగా పెట్టారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపంలోని యలహంక వద్ద 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.70 కోట్లతో ఈ ప్యాలెస్‌ నిర్మించారు. అందులో తోటలు, ఫౌంటైన్‌లు, సేవకుల నివాసాలు, హెలీప్యాడ్‌ వంటివి ఉన్నాయి. ఇవన్నీ ఈ వీడియోలో చూడొచ్చు’ అంటూ షెల్‌బై అనే ఎక్స్‌ ఖాతా నుంచి చేసిన ట్వీట్‌ను ప్రకాశ్‌సింగ్‌ రీట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని