విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. ఆ సెంటిమెంట్‌ దెబ్బతినకుండా చూస్తాం

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న సెంటిమెంట్‌ దెబ్బతినకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై ఆలోచిస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు.

Updated : 19 Jun 2024 09:13 IST

కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీనివాసవర్మ.. చిత్రంలో సోమువీర్రాజు తదితరులు

ఈనాడు, దిల్లీ: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న సెంటిమెంట్‌ దెబ్బతినకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై ఆలోచిస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడి ఉద్యోగ్‌భవన్‌లోని ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ‘ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారిని, సంస్థలను ప్రోత్సహిస్తాం. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పరిశ్రమల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై చర్చిస్తా. ఐదేళ్లలో ఏపీకి కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. అలాంటి సంస్థలను పిలిచి మాట్లాడి తిరిగి రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేలా చేస్తాం. పరిశ్రమల ఏర్పాటుకున్న నిబంధనలను సరళతరం చేయడంతోపాటు భూములు కేటాయించి త్వరగా అన్ని అనుమతులూ మంజూరయ్యేలా చూస్తాం. ఏపీ అభివృద్ధిలో నావంతు పాత్ర పోషిస్తా’ అని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ గురించి విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ.. ప్రైవేటీకరణ అన్నది కేవలం ఆ కర్మాగారానికి మాత్రమే ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. ‘నాన్‌స్ట్రాటజిక్‌ ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది తప్పితే ప్రత్యేకంగా ఈ స్టీల్‌ప్లాంట్‌ను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం కాదు. దీనిపై గతంలో పార్టీ నాయకులుగా మేం జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి విన్నపాలిచ్చాం. ప్రస్తుతం మేం చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో కలిసి ఎన్డీయే కూటమిగా అధికారంలో ఉన్నాం. దీనిపైన వారిద్దరితోపాటు కేంద్రంలో ఉన్న తెలుగు మంత్రులం అంతా కలిసి త్వరలో ప్రధాని, ఆర్థిక మంత్రితో మాట్లాడతాం. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నేను మాట్లాడను. కార్మికుల భద్రతకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం హామీనిచ్చింది. విశాఖ స్టీల్‌కు కేప్టివ్‌ మైన్స్‌ కేటాయింపుపై నేను కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డితో మాట్లాడతా. రాబోయే రోజుల్లో దీనిపై క్షుణ్ణంగా ఆలోచిస్తాం’ అని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి దంపతులు, కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుజనాచౌదరి, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, విష్ణుకుమార్‌రాజు, బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని