ఆర్టీసీ ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చు పెంపు

ప్రభుత్వంలో విలీనం కాకముందు 2019 డిసెంబరు 31 వరకు ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులుగా ఉంటూ.. పదవీ విరమణ చేసినవారు మరణిస్తే వారి కుటుంబీకులకు అందించే అంత్యక్రియల ఖర్చును రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు.

Published : 19 Jun 2024 04:57 IST

ఈనాడు, అమరావతి: ప్రభుత్వంలో విలీనం కాకముందు 2019 డిసెంబరు 31 వరకు ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులుగా ఉంటూ.. పదవీ విరమణ చేసినవారు మరణిస్తే వారి కుటుంబీకులకు అందించే అంత్యక్రియల ఖర్చును రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు. 2022 జనవరి ఒకటి నుంచి మరణించిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే మరణించిన ఉద్యోగులకు సంబంధించి వారి కుటుంబీకులకు అంత్యక్రియల ఖర్చుకింద రూ.15 వేలు చెల్లించి ఉంటే, మిగిలిన రూ.10 వేలను కూడా అందజేయనున్నారు.

పొరుగు సేవల ఉద్యోగులకు ప్రమాద బీమా

 ఆర్టీసీలో పొరుగుసేవల కింద పనిచేస్తున్న ఉద్యోగులకు.. వారి మ్యాన్‌పవర్‌ ఏజెన్సీలు, గుత్తేదారులు తప్పనిసరిగా ప్రమాద బీమా సదుపాయం కల్పించేలా ఆదేశిస్తూ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో ఉద్యోగికి రూ.10 లక్షలకు తక్కువ కాకుండా ప్రమాద బీమా పాలసీ కల్పించాలని అందులో పేర్కొన్నారు. కొత్తగా పొరుగుసేవల ఉద్యోగుల కోసం పిలిచే టెండర్లలో తప్పనిసరిగా ఈ నిబంధన చేర్చాలని, ఇప్పటికే ఈ టెండరు పొందిన గుత్తేదారుల ఒప్పందాన్ని పునరుద్ధరించి, ఈ నిబంధన అదనంగా చేర్చాలని అధికారులను ఆదేశించారు.

ఆర్టీసీ నుంచి నేరుగా జీతాలివ్వాలి

 ఆర్టీసీలో పనిచేస్తున్న 7,300 మంది పొరుగు సేవల ఉద్యోగులకు సంబంధించి కాంట్రాక్ట్‌ విధానం రద్దుచేసి, యాజమాన్యం నేరుగా జీతాలు ఇచ్చేలా చూడాలని ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం మంగళవారం కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని