హాకీ టీం సభ్యుల ఎంపిక మార్గదర్శకాలను వెబ్‌సైట్‌లో ఉంచాలి

జాతీయ, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లకు హాకీ ఆటగాళ్ల ఎంపిక కోసం హాకీ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని దిల్లీ హైకోర్టు ఏపీ హాకీ సంఘాన్ని ఆదేశించింది.

Published : 19 Jun 2024 06:03 IST

ఏపీ హాకీ సంఘానికి దిల్లీ హైకోర్టు ఆదేశం

ఈనాడు, దిల్లీ: జాతీయ, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లకు హాకీ ఆటగాళ్ల ఎంపిక కోసం హాకీ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని దిల్లీ హైకోర్టు ఏపీ హాకీ సంఘాన్ని ఆదేశించింది. క్రీడాకారుల ఎంపిక విషయంలో ఏపీ హాకీలో జరుగుతున్న అవకతవకలను సవాల్‌ చేస్తూ నెల్లూరుకు చెందిన మహమ్మద్‌ మైనుద్దీన్‌ అహ్మద్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన కేసులో జస్టిస్‌ మినీ పుష్కర్ణ నేతృత్వంలోని దిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు మంగళవారం తీర్పునిచ్చింది. ‘‘ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ కోసం హాకీ ఇండియా ఒక నిర్దిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఆటగాళ్ల ఎంపిక తేదీలను కనీసం రెండు వారాల ముందు హాకీ ఇండియాలో సభ్యత్వం ఉన్న అన్ని జిల్లా/జోన్‌/క్లబ్‌ స్థాయి సంఘాలకు తెలియజేయాలని అందులో స్పష్టం చేసింది. అలాగే ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలతోపాటు, మెంబర్‌ యూనిట్‌కు విధివిధానాలను నిర్దేశిస్తూ జారీ చేసిన పత్రికా ప్రకటననూ వెబ్‌సైట్‌లో ఉంచాలి. అందులో తేదీ, సమయం, స్థలం, ఆటగాళ్లకు ఉండాల్సిన ముందస్తు అర్హతలను పేర్కొనాలి. కానీ ఈ వివరాలేవీ ఆంధ్రప్రదేశ్‌ హాకీ క్రీడాకారులకు అందుబాటులో లేకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల హాకీ ఇండియా జారీ చేసిన నిబంధనలను ఏపీ హాకీ సంఘం తప్పకుండా పాటించాలి. ఏ టోర్నమెంట్‌కు సంబంధించిన తేదీలైనా హాకీ ఆంధ్రప్రదేశ్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. దీంతో అవసరమైన వ్యక్తులందరికీ వెంటనే సమాచారం చేరి అందులో పాల్గొనాలనుకున్న క్రీడాకారులకు సమాయత్తం కావడానికి సమయం దొరుకుతుంది’’ అని దిల్లీ హైకోర్టు పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని