సంక్షిప్తవార్తలు(18)

వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బుధవారం మచిలీపట్నంలో నియోజకవర్గ కూటమి నేతలతో భేటీ అయిన ఆయన.. వివిధ అంశాలపై మాట్లాడారు.

Updated : 20 Jun 2024 06:19 IST

వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం
మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం(కోనేరు సెంటరు), న్యూస్‌టుడే: వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బుధవారం మచిలీపట్నంలో నియోజకవర్గ కూటమి నేతలతో భేటీ అయిన ఆయన.. వివిధ అంశాలపై మాట్లాడారు. ఎన్నికల ముందు వైకాపా నాయకులు భయపెట్టి తమతో రాజీనామాలు చేయించారంటూ రోజూ వందల మంది వాలంటీర్లు వస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. వైకాపా రాజకీయ స్వార్థంతో వారి జీవితాలతో ఆడుకుందని విమర్శించారు.


నేడు ఏజీగా దమ్మాలపాటి బాధ్యతల స్వీకరణ

ఈనాడు, అమరావతి: సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ను ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ)గా నియమిస్తూ న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకరరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్‌ను ఏజీగా నియమించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. హైకోర్టులో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 


జలవనరులశాఖ సలహాదారుగా ఎం.వెంకటేశ్వరరావు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ సలహాదారుగా  ఎం.వెంకటేశ్వరరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి   నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో పోలవరం చీఫ్‌ ఇంజినీరుగానూ, రాష్ట్ర జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గానూ ఆయన వ్యవహరించారు. పోలవరంలో తొలి నుంచి పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. 


‘నాడు-నేడు’ పేరు మార్పు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అమలు  చేస్తున్న ‘నాడు-నేడు’ కార్యక్రమం పేరును ప్రభుత్వం మార్చింది. ఇక నుంచి దీన్ని ‘స్కూల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంప్రూమెంట్‌’గా పిలవనున్నారు. అన్ని పాఠశాలల్లోనూ ఏడాదిలోపు మౌలిక  సదుపాయాలు కల్పించాలని మంత్రి నారా లోకేశ్‌ ఇటీవల అధికారులను ఆదేశించారు.


నీరభ్‌ పదవీకాలాన్ని పొడిగించండి
కేంద్రానికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి బుధవారం లేఖ రాశారు. నీరభ్‌కుమార్‌ పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన సర్వీసును పొడిగించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. తొలుత మూడు నెలల పాటు ఆయనకు సర్వీసు పొడిగింపు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 


ఫర్నిచర్‌ అప్పగించండి
జగన్‌కు లేఖ రాసిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్, ఎలక్ట్రికల్‌ వస్తువులను వెంటనే తమకు అప్పగించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు సాధారణ పరిపాలనశాఖ లేఖ రాసినట్లు తెలిసింది. జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయిలు వెచ్చించి అక్కడ ఫర్నిచర్, ఎలక్ట్రికల్‌ వస్తువులు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం పదవి నుంచి దిగిపోయిన 15 రోజుల్లోగా వాటన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించాలి. ఈ నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ ఆయనకు లేఖ రాసినట్లు సమాచారం. 


539 విద్యాసంస్థల్లో వృత్తి విద్యా శిక్షణ 

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ విద్యా సంస్థల్లో తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు వృత్తి విద్యా కోర్సుల నిర్వహణకు సమగ్ర శిక్షా అభియాన్‌ ఆదేశాలు జారీ చేసింది. శిక్షణ సంస్థల ఒప్పందాన్ని పునరుద్ధరించింది. రాష్ట్రవ్యాప్తంగా 539 పాఠశాలల్లో 818 వృత్తి విద్యాసంస్థల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. వ్యవసాయం, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఆహార శుద్ధి తదితర 11 విభాగాల్లో ఈ శిక్షణ ఇస్తారు. 


ఆ ఆరోపణలపై వివరాలు సమర్పించండి
రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: ఎన్నికల ఫలితాల తర్వాత ఓ వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిల్‌పై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. అంతకుముందు పిటిషనర్‌ తరఫున న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ఫలితాల అనంతరం ఓ పార్టీకి చెందిన వారిపై మరో పార్టీకి చెందిన వారు దాడులు చేశారన్నారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రప్రభుత్వం నుంచి స్థాయీ నివేదికను కోరాలని అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ.. స్థాయీ నివేదికను కోరలేమని స్పష్టంచేసింది. వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.


ఫిర్యాదుల పరిష్కారానికి ‘మీ కోసం’ పోర్టల్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఫిర్యాదుల పరిష్కారానికి ‘మీ కోసం’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రణాళికశాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి  ఎం.గిరిజాశంకర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రజాఫిర్యాదులు, పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌) పేరుతో జిల్లా కలెక్టర్లు ప్రస్తుతం ఉన్న యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.


ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం పేరు మార్పు

ఈనాడు, అమరావతి: రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ పథకం పేరును ‘ఆంధ్రప్రదేశ్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం’గా మారుస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం పేరుతో దీనిని అమలు చేసింది. పేరు మార్పు వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 


హైస్కూల్‌ ప్లస్‌ల్లో ఇంటర్మీడియట్‌పై స్పష్టత ఇవ్వాలి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 210 హైస్కూల్‌ ప్లస్‌ల్లో ఇంటర్మీడియట్‌ కొనసాగించడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు. హైస్కూల్‌ ప్లస్‌ల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఇంటర్మీడియట్‌ బోధనకు అధ్యాపకులను నియమించాలని, వీటి పేరును మార్పు చేయాలన్నారు. స్కూల్‌ అసిస్టెంట్లకు జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. 


అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌గా గణేశ్‌బాబు 

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌గా వి.గణేశ్‌బాబు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆక్టోపస్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా ఉన్న ఆయన్ను అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ వద్ద రిపోర్టు చేయాలని పేర్కొంటూ డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా బుధవారం ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌గా ఉన్న డి.ఏడుకొండలురెడ్డిని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని నిర్దేశించారు. 


యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాలి
ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

ఈనాడు, అమరావతి: గాలులు, వర్షాలతో స్తంభాలు విరిగిపడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలులకు తీగలు తెగిపడి.. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడిన ప్రాంతాల్లో చేపట్టిన పునరుద్ధరణ పనులపై రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్షించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత త్వరగా విద్యుత్‌ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న 48 గంటల్లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.


క్రీడాకారిణి జెస్సీరాజ్‌కు లోకేశ్‌ అభినందనలు
అంతర్జాతీయ పోటీల్లో రాణించడంపై హర్షం 

ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రపంచ ఓషియానిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అత్యున్నత ప్రదర్శన కనబరిచిన విజయవాడకు చెందిన క్రీడాకారిణి జెస్సీరాజ్‌కు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారత కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేయడం గర్వంగా ఉందన్నారు. ‘‘ఇన్‌ స్కేటింగ్‌ విభాగంలో జెస్సీరాజ్‌ బంగారు పతకాన్ని సాధించడం హర్షణీయం. ఆమెకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది’’ అని ఎక్స్‌ వేదికగా లోకేశ్‌ హామీ ఇచ్చారు. 

ఆర్డీటీ వ్యవస్థాపకుడు, మానవతామూర్తి ఫాదర్‌ ఫెర్రర్‌ వర్ధంతి సందర్భంగా లోకేశ్‌ నివాళులు అర్పించారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.


గ్రూపు-2 మెయిన్స్‌ వాయిదా వేయాలి: నిరుద్యోగ ఐకాస

ఈనాడు, అమరావతి: గ్రూపు-2 మెయిన్స్‌ను రెండు నెలలు వాయిదా వేయాలని, డిప్యూటీ డీఈఓ మెయిన్స్‌కు 1:100 విధానంలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరుద్యోగ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌ కోరారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి మెగా పోలీస్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని విన్నవించారు. 


పశుసంవర్ధకశాఖలో.. పేరు మారుతున్న పథకాలు
అమూల్‌ జగనన్న పాలవెల్లువపై  స్పందించని ఏపీడీడీసీఎఫ్‌ 

ఈనాడు-అమరావతి: పశుసంవర్ధకశాఖ, వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలకు పేర్లు మారుతున్నాయి. ఇప్పటి వరకు సెర్ప్‌ ఆధ్వర్యంలో చేయూత పథకం కింద జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా పశువులు, జీవక్రాంతి కింద మేకలు, గొర్రెలు పంపిణీ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వ హయాంలో చేయూత పథకం లేదు. దీంతో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కూడా లేనట్లే. పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీడీడీసీఎఫ్‌) కూడా జగనన్న పాల వెల్లువ పేరుతోనే అమూల్‌కు పాల సేకరణ చేస్తోంది. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్యసేవ పథకం కింద అంబులెన్స్‌లు నడుస్తున్నాయి. గతంలో తెదేపా హయాంలో చంద్రన్న సంచార పశు ఆరోగ్య కేంద్రం పేరుతో వీటిని నిర్వహించారు. ఇప్పుడు అంబులెన్స్‌లకు పాత పేరు పెట్టాలని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. వైఎస్సార్‌ పశు ఆరోగ్య బీమా పథకానికి పశు ఆరోగ్య బీమా పథకం అని ప్రతిపాదిస్తున్నారు.


‘యాప్‌ల భారం తగ్గించాలి’

ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిబంధనల ప్రకారం డిగ్రీ లెక్చరర్లకు అర్హతను అనుసరించి సహాయ, అసోసియేట్, ప్రొఫెసర్‌ హోదాలు ఇవ్వాలని ప్రభుత్వ కళాశాలల సంఘం నాయకులు రంగనాథ్, శ్రీధర్, జయప్ప, రాజశేఖర్‌ కోరారు. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ను బుధవారం కలిసి, పలు అంశాలపై విన్నవించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో యాప్‌ల భారం తగ్గించాలని, సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానాన్ని తొలగించాలని కోరారు. 


ఈపీడీసీఎల్‌ పోర్టల్‌లో విద్యుత్తు ఉపకరణాల విక్రయం

ఈనాడు, విశాఖపట్నం: విద్యుత్తు పొదుపునకు అవసరమైన పరికరాలను ఇ-రిటైల్‌ ద్వారా ఈపీడీసీఎల్‌ అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్తుశాఖ పరిధిలోని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌)తో ఒప్పందం చేసుకుంది. ఈఈఎస్‌ఎల్‌ సీఈఓ విశాల్‌ కపూర్‌ బుధవారం ఓ ప్రకటన ద్వారా ఒప్పంద వివరాలను వెల్లడించారు. ‘ఇకపై ఎల్‌ఈడీ బల్బులు, ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ కలిగిన బీఎల్‌డీసీ ఫ్యాన్లు, ఎయిర్‌ కండిషనర్లు ఈపీడీసీఎల్‌ వెబ్‌ పోర్టల్‌ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే నేరుగా ఇళ్లకే ఉపకరణాలను చేరవేస్తారు. ఆయా పరికరాల వారంటీ, గ్యారంటీల విషయంలోనూ సంస్థ నిక్కచ్చిగా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా 20 శాతం విద్యుత్తును పొదుపు చేయగలిగితే రూ.74 వేల కోట్లు ఆదా అవుతాయి’ అని కపూర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని