నర్సింగ్‌ కళాశాలలకు అవస్థల సుస్తీ!

రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలల నిర్వహణ ఘోరంగా ఉంది. గత వైకాపా ప్రభుత్వం ప్రచారానికి మాత్రమే పరిమితమై.. నర్సింగ్‌ కళాశాలలు, వసతిగృహాల బాగోగులు, బోధన ప్రమాణాల గురించి పట్టించుకోలేదు.

Updated : 20 Jun 2024 06:27 IST

అరకొర సౌకర్యాలతో విద్యార్థినులకు ఇబ్బందులు
చాలీచాలని గదుల్లో సామర్థ్యానికి మించి వసతి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలల నిర్వహణ ఘోరంగా ఉంది. గత వైకాపా ప్రభుత్వం ప్రచారానికి మాత్రమే పరిమితమై.. నర్సింగ్‌ కళాశాలలు, వసతిగృహాల బాగోగులు, బోధన ప్రమాణాల గురించి పట్టించుకోలేదు. నర్సింగ్‌ విద్యలో భాగంగా కళాశాలలకు ఆసుపత్రులతో కుదిరిన  ఒప్పందాలు, విద్యార్థుల ప్రాక్టికల్స్‌ అంతా ఓ ఫార్సుగా మారాయి. రోగులకు సాంత్వన చేకూర్చడంలో నర్సుల సేవలు ఎంతో ముఖ్యం. ఇలాంటి ముఖ్యమైన కోర్సులు నడిచే నర్సింగ్‌ కళాశాలలు అధ్వాన పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కలిపి 13 నర్సింగ్‌ కళాశాలలు నడుస్తున్నాయి. ఈ కళాశాలల అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. 

100 మందికి 4 గదులు

కర్నూలులో 1982లో ఏర్పాటైన నర్సింగ్‌ కళాశాల నిర్వహణ అధ్వానంగా ఉంది. వసతిగృహం, వంటశాల, డైనింగ్‌ హాల్‌ నిర్మాణాలకు 2018లో అప్పటి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. వీటిని వెంటనే వినియోగించకపోవడంతో అవి మురుగుపోయాయి. ఇక్కడ వంద సీట్లు ఉన్నాయి. సీట్ల పెరుగుదలకు తగ్గట్లు నూతన కళాశాల భవన నిర్మాణానికి రూ.11 కోట్లు అవుతుందని ప్రతిపాదనలు సిద్ధంచేశారు. అప్పట్లో ప్రభుత్వం మారడంతో పరిస్థితి మొదటికొచ్చింది. నర్సింగ్‌ కళాశాలకు చెందిన వంద మంది విద్యార్థినులకు కలిపి 4 గదులు కేటాయించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కళాశాల భవనంలోనే పై అంతస్తులో వసతిగృహం, కింది అంతస్తులోని తరగతి గదుల్లో విద్యాబోధన చేస్తున్నారు. 

70% పనులతో ఆగిపోయిన భవనం..!

శ్రీకాకుళంలో 2012లో ఏర్పాటైన నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణాలను 2016లో ప్రారంభించారు. 70% పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం మిగిలిన పనుల పూర్తికి చర్యలు తీసుకోలేదు. ఈ భవనం వినియోగంలోకి రానందున విద్యార్థినులకు వైద్య కళాశాల ఆవరణలోనే బోధన సాగుతోంది. వైద్య కళాశాలకు చెందిన వసతిగృహాల్లోనే విద్యార్థినులు ఉంటున్నారు. నలుగురికి మాత్రమే సరిపోయే గదుల్లో 8 మంది చొప్పున ఉంటున్నారు.

ఆసుపత్రి వార్డుల్లో తరగతులు

ఏలూరులోని బీఎస్సీ నర్సింగ్‌ కళాశాలలో విద్యార్థులను సమస్యలు వెంటాడుతున్నాయి. ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ కళాశాలలోని తరగతి గదులు ఇరుకుగా ఉన్నాయి. భోజనం చేసేందుకు డైనింగ్‌ హాల్‌ ప్రత్యేకంగా లేదు. ఇతర సమస్యలనేకం ఉన్నాయి.

వరండాలోనే బోధన..! 

మచిలీపట్నం నర్సింగ్‌ కాలేజీని స్థానిక సర్వజన ఆసుపత్రిలో 2014లో ఏర్పాటుచేసినా ఇప్పటివరకూ సొంత భవనం నిర్మించలేదు. ఇక్కడ ప్రస్తుతం 149 మంది విద్యార్థినులు ఉన్నారు. ప్రస్తుతం వీరికి వరండాలోనే బోధన సాగుతోంది. అక్కడే విద్యార్థినులకు వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. 

తాగునీటి సమస్య!

ఒంగోలు జీజీహెచ్‌లో 2016లో ఏర్పాటుచేసిన నర్సింగ్‌ కళాశాలకు ఇంతవరకు సొంతభవనం సమకూరలేదు.  నాలుగేళ్ల కోర్సుకు సంబంధించి ప్రస్తుతం 400 మంది విద్యార్థులున్నారు. వీరికి జీజీహెచ్‌ నాలుగో అంతస్తులో రోగులకు కేటాయించిన గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. అక్కడే హాస్టల్‌కు గదులు కేటాయించారు. వసతిగృహంలో తాగునీటి సమస్య, అరకొర సౌకర్యాల మధ్య ఉండలేక...విద్యార్థులు వెలుపల అద్దెకు ఉంటున్నారు. 

గుంటూరులోనూ సమస్యలే..!

గుంటూరు సర్వజనాసుపత్రికి అనుబంధంగా ప్రభుత్వ నర్సింగ్‌ పాఠశాల గత 50 ఏళ్ల నుంచి నడుస్తోంది. పాఠశాల తరగతి గదులు, వసతిగృహం తదితర సదుపాయాలతో పక్కా భవనాలుండేవి. గత ప్రభుత్వ హయాంలో ఆ స్థలాన్ని క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించారు. దీంతో అక్కడ ఉన్న భవనాలు తొలగించారు. రేకులతో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. గతంలో హౌస్‌సర్జన్స్‌కు కేటాయించిన గదులను వసతిగృహంగా వినియోగిస్తున్నారు.


విశాఖ నర్సింగ్‌ కళాశాలలో మంచాలూ లేవు..!

1979లో విశాఖలో ఏర్పడ్డ ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల కొత్త భవన నిర్మాణ అవసరాలకు తగ్గట్లు ఆగస్టు 5, 2021లో మంజూరైన రూ.48.15కోట్లను వెంటనే ఖర్చుపెట్టలేదు. సుమారు 200 మంది విద్యార్థినులు ఇక్కడ చదువుతున్నారు. ఇందులో మంచాలు లేవు. కిటికీల అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. నర్సింగ్‌ పాఠశాలకు చెందిన భవనంలోనే నర్సింగ్‌ కళాశాల, వసతి గృహాన్ని కొనసాగిస్తున్నారు. కొత్త భవనం నిర్మాణం కోసం 2021లో విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో 3 ఎకరాలు కేటాయించారు. నిర్మాణాలకు అవసరమైన రూ.48.15 కోట్లు మంజూరయ్యాయి. దిల్లీకి చెందిన సంస్థ టెండరు దక్కించుకుంది. భవనాల డిజైన్లు పూర్తయిన తర్వాత రీఎస్టిమేషన్‌ చేయాలన్నారు. తదుపరి చర్యల్లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని