పారాలింపిక్స్‌కు నంద్యాల యువకుడు

పారిస్‌లో ఈ ఏడాది జరిగే పారాలింపిక్స్‌కు తెలుగు యువకుడు షేక్‌ అర్షద్‌ అర్హత సాధించాడు. పారాసైక్లింగ్‌లో అతనితో పాటు జ్యోతి గధేరియా (మహారాష్ట్ర) పారిస్‌ వెళ్తున్నారు.

Updated : 20 Jun 2024 06:20 IST

పారా సైక్లింగ్‌లో అర్హత సాధించిన అర్షద్‌

గతంలో తాను సాధించిన పతకంతో అర్షద్‌

ఈనాడు, హైదరాబాద్‌: పారిస్‌లో ఈ ఏడాది జరిగే పారాలింపిక్స్‌కు తెలుగు యువకుడు షేక్‌ అర్షద్‌ అర్హత సాధించాడు. పారాసైక్లింగ్‌లో అతనితో పాటు జ్యోతి గధేరియా (మహారాష్ట్ర) పారిస్‌ వెళ్తున్నారు. పారాలింపిక్స్‌ చరిత్రలోనే పారా సైక్లింగ్‌లో భారత అథ్లెట్లు పోటీపడటం ఇదే తొలిసారి. ఇటీవల ఆసియా రోడ్‌సైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఎలైట్‌ వ్యక్తిగత టైమ్‌ ట్రయల్‌ సీ2 విభాగం మహిళల్లో జ్యోతి స్వర్ణం, అర్షద్‌ రజతం గెలిచారు. దీంతో ర్యాంకింగ్స్‌లో మెరుగై పారాలింపిక్స్‌ బెర్తు పట్టేశారు. ఈ పారాలింపిక్స్‌ ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 8 వరకు జరుగుతాయి. 

వైకల్యాన్ని దాటి: నంద్యాల జిల్లాకు చెందిన 30 ఏళ్ల షేక్‌ అర్షద్‌ ఏడోతరగతిలో ఉండగా బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో మోకాలి వరకూ తీసేశారు. వైకల్యంతో అర్షద్‌ కుంగిపోయాడు. తండ్రి అతడిని ప్రోత్సహించి, చదువుపై దృష్టిసారిస్తే.. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్నారు. ఓ వైపు చదువుకుంటునే.. మరోవైపు క్రీడా పోటీల్లోనూ అర్షద్‌ పాల్గొనేవాడు. హైదరాబాద్‌ కేంద్రంగా దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఉచితంగా శిక్షణనిస్తున్న ఆదిత్య మెహతా ఫౌండేషన్‌లో చేరిన తర్వాత అర్షద్‌ దశ తిరిగింది. ప్రస్తుతం ప్రపంచ పారాసైక్లింగ్‌లో అయిదో ర్యాంకులో ఉన్నాడు. 

ఉద్యోగమంటూ ఉత్తుత్తి ఉత్తర్వులు: పారాసైక్లింగ్‌ పోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ ప్రదర్శించిన షేక్‌ అర్షద్‌కు గ్రూప్‌-2 ఉద్యోగం ఇస్తామని వైకాపా ప్రభుత్వం రెండేళ్ల క్రితం చెప్పింది. పదో పారా ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రజత, కాంస్యపతకాలు సాధించిన అతనికి.. క్రీడా కోటాలో గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వాలంటూ సెప్టెంబరు 2022లో అప్పటి సీఎంఓ అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు సాధారణ పరిపాలన శాఖకు లేఖ రాశారు. ఇప్పటివరకూ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు ప్రస్తుత ప్రభుత్వమైనా ఉద్యోగం ఇవ్వాలని అర్షద్‌ అభ్యర్థించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని