ఒప్పందం చేసుకోకపోయినా ఔదార్యమే!

వైకాపా ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి అస్మదీయ గుత్తేదారు సంస్థలకు మేలు చేసిన రాష్ట్ర గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లలో ప్రభుత్వం మారినా మార్పు రావడం లేదు.

Published : 20 Jun 2024 06:10 IST

అస్మదీయ గుత్తేదారు సంస్థలతో ఇప్పటికీ అంటకాగుతున్న గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఈఎన్‌సీ కృష్ణారెడ్డి
జలజీవన్‌ మిషన్‌ టెండర్లలో అంతా అస్తవ్యస్తమే

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి అస్మదీయ గుత్తేదారు సంస్థలకు మేలు చేసిన రాష్ట్ర గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లలో ప్రభుత్వం మారినా మార్పు రావడం లేదు. గత ప్రభుత్వ పెద్దలకు కావలసిన సంస్థలతో ఇప్పటికీ అంటకాగుతున్నారు. జలజీవన్‌ పనులు చేసిన చిన్న గుత్తేదారులను పక్కనపెట్టి మేఘా, ఎన్‌ఏఆర్‌ ఇన్‌ఫ్రా వంటి గుత్తేదారు సంస్థలకు ఎన్నికల ఫలితాలొచ్చేముందు రూ.90 కోట్లకుపైగా పెండింగ్‌ బిల్లులు చెల్లించారు. అంతేకాక శ్రీకాకుళం జిల్లాలో రూ.203 కోట్ల విలువైన జలజీవన్‌ మిషన్‌ టెండర్‌ దక్కించుకున్న ఎన్‌ఏఆర్‌ ఇన్‌ఫ్రా.. నిర్ణీత 90 రోజుల గడువు దాటిపోయినా ఒప్పందం (అగ్రిమెంట్‌) చేసుకోలేదు. నిబంధనలు ఉల్లంఘించిన ఇలాంటి సంస్థలను మూడేళ్లపాటు బ్లాకు లిస్ట్‌లో చేర్చి ఎర్నిస్ట్‌ మనీ డిపాజిట్‌ (ఈఎండీ) మొత్తాన్ని జప్తు చేయాలి. ఈ సంస్థకు మొదటి నుంచి వంతపాడే గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) కృష్ణారెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ (సీఈ) హరేరాం నాయక్‌ ఇప్పటికీ అదే ఔదార్యం ప్రదర్శిస్తున్నారు. జలజీవన్‌ మిషన్‌ పనుల టెండర్‌ దక్కించుకుని 90 రోజులు దాటినా ఒప్పందం చేసుకోకుండా జాప్యం చేయడంపై తాగునీటి సరఫరా విభాగం శ్రీకాకుళం జిల్లా పర్యవేక్షక ఇంజినీర్‌ (ఎస్‌ఈ) 2023 డిసెంబరు 15న, 2024 జనవరి 12న, 2024 ఫిబ్రవరి 13న గుత్తేదారు సంస్థకు మూడు నోటీసులిచ్చారు. గడువులోగా ఒప్పందం చేసుకోనట్లయితే ఈఎండీ మొత్తాన్ని జప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఈఎన్‌సీ, సీఈ దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారి నుంచి స్పందన లేదు. ఒప్పందం జరగని కారణంగా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఇంతకంటే ముందు ఇదే సంస్థ శ్రీకాకుళంలో మొదలుపెట్టిన జలజీవన్‌ మిషన్‌ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. అయినా ఎన్‌ఆర్‌ఏ ఇన్‌ఫ్రాకు కృష్ణారెడ్డి సహకరిస్తున్నారని చిన్న గుత్తేదారులు ఆరోపిస్తున్నారు. ఒప్పందం చేసుకోని కారణంగా ప్రతిపాదిత పనులను ప్రారంభించే అవకాశం లేదు. వాటిని రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిస్తే కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం అంచనా విలువలు పెరిగి ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని