జగన్‌ అక్రమాస్తుల కేసులు.. డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ ప్రారంభం

ఏపీ మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసుల్లోని డిశ్ఛార్జి పిటిషన్లపై హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో గురువారం విచారణ ప్రారంభమైంది.

Published : 21 Jun 2024 06:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసుల్లోని డిశ్ఛార్జి పిటిషన్లపై హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో గురువారం విచారణ ప్రారంభమైంది. సీబీఐ 11, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 9 అభియోగ పత్రాలు దాఖలు చేశాయి. ఈ కేసుల్లో జగన్, సాయిరెడ్డిలతో సహా ఇతర నిందితులు దాదాపు 130 డిశ్ఛార్జి పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై దాదాపు దశాబ్ద కాలంగా వాదనలు పూర్తికావడం లేదు. అన్ని పిటిషన్లలో వాదనలు పూర్తయి తీర్పు వెలువరించాల్సిన సమయంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ అయిన విషయం తెలిసిందే. సీబీఐ కోర్టు న్యాయమూర్తిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ టి.రఘురాం డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ చేపట్టారు. సీబీఐ నమోదు చేసిన కేసుల గురించి న్యాయవాది ఇ.ఉమామహేశ్వరరావు వివరించారు. అనంతరం అరబిందో, హెటిరో సంస్థలపై సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిశ్ఛార్జి పిటిషన్‌పై న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశాలతో నమోదైన కేసులో అన్ని ఆధారాలనూ కోర్టు పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నమోదు చేసిన కేసులను కోర్టులు అనుమతించరాదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వివరించారు. దీనిపై శుక్రవారం కూడా విచారణ కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని