సంక్షిప్త వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ)గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ గురువారం ఉదయం హైకోర్టులోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.

Published : 21 Jun 2024 05:30 IST

ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్‌ బాధ్యతల స్వీకరణ


బాధ్యతలు స్వీకరిస్తున్న దమ్మాలపాటి శ్రీనివాస్‌

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ)గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ గురువారం ఉదయం హైకోర్టులోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు న్యాయవాదులు, హైకోర్టు ఉద్యోగులు, పలువురు ప్రముఖులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.


ఇక నుంచి చంద్రన్న బీమా 

ఈనాడు, అమరావతి: వైఎస్సార్‌ బీమా పథకం పేరును చంద్రన్న బీమాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసంఘటితరంగ కార్మికులు, పేదల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.


‘గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదా వేయాలి’

ఈనాడు డిజిటల్, అమరావతి: గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షను రెండు నెలల పాటు వాయిదా వేయాలని ఏపీ నిరుద్యోగ ఐకాస అధ్యక్షుడు హేమంత్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే డీవై డీఈఓ మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని గురువారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 


అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
మంత్రి పయ్యావుల కేశవ్‌కు పలు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో అరాచకాలకు సహకరించిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్‌ అసోసియేషన్, గెజిటెడ్‌ అధికారుల సంఘం, ఆఫీస్‌ సబార్డినేట్ల సంఘం ప్రతినిధులు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ ఆధ్వర్యంలో వారంతా గురువారం మంత్రిని కలిశారు. గత ఆర్థిక మంత్రి, సీఎంవో అధికారుల ఆదేశాలతో స్మగ్లర్లు, పన్ను ఎగవేతదారులకు అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఉద్యోగుల పదోన్నతుల్లో జరిగిన అక్రమాలు, ప్రాంతీయ కార్యాలయాల పేరుతో కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటును ప్రశ్నించిన ఉద్యోగులు, అధికారులను రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా బదిలీలు చేశారని పేర్కొన్నారు. అదేమని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపారని వివరించారు.


సీఈఓను సత్కరించిన తెదేపా నేతలు 

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాను తెదేపా నేతలు సత్కరించారు. గురువారం ఆ పార్టీ నేతలు వర్ల రామయ్య, అశోక్‌బాబు, బుచ్చిరాంప్రసాద్, ఏఎస్‌.రామకృష్ణ తదితరులు రాష్ట్ర సచివాలయంలో సీఈఓను కలిసి శాలువతో సత్కరించి, మొక్కను బహూకరించారు. రాష్ట్రంలో పోలింగ్‌ శాతం పెరగడానికి మీనా కృషి చేశారని, నోటిఫికేషన్‌ మొదలు ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వ్యవహరించారని కొనియాడారు. అనంతరం హోంమంత్రి వంగలపూడి అనితను ఆమె ఛాంబర్‌లో వర్ల రామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య ఆశీస్సుల్ని ఆమె తీసుకున్నారు. హోంమంత్రి పదవిని ఎస్సీ మహిళ నిర్వహించడం గర్వంగా ఉందని, మాదకద్రవ్యాలు, గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపాలని మంత్రిని వర్ల రామయ్య కోరారు.


పదవీ విరమణ చేసిన అధికారులుంటే.. తప్పించండి
సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశం

ఈనాడు, అమరావతి: పదవీ విరమణ తర్వాత కూడా వివిధ విభాగాల్లో కొనసాగుతున్న అధికారుల్ని వెంటనే తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా కొనసాగుతున్న వారి జాబితా తయారు చేసి, వారి నుంచి రాజీనామాలు తీసుకోవాలని శాఖల వారీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆయన ఆదేశించారు. దీనిపై ఈ నెల 24 లోగా నివేదిక అందించాలన్నారు. ఏదైనా శాఖలో పదవీ విరమణ చేసిన వారి సేవలు అవసరమైతే.. అధీకృత యంత్రాంగం ద్వారా తాజా ఉత్తర్వులు తెచ్చుకోవాలని సూచించారు.


25, 26 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటన

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన నియోజకవర్గానికి వెళ్తున్నారు. 


అమరావతి రైతులపై అక్రమ కేసులు ఎత్తేయాలి

ఈనాడు డిజిటల్, అమరావతి: రాజధాని అమరావతి కోసం చేసిన ఉద్యమంలో రైతులపై వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగా బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని హోం మంత్రి వంగలపూడి అనితకు అమరావతి మహిళలు విజ్ఞప్తి చేశారు. రాజధాని ఉద్యమంలో మహిళలను పోలీసులు వేధించినప్పుడు తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలి హోదాలో తమకు ఎంతో భరోసానిచ్చారని గురువారం సచివాలయంలో ఆమెను కలిసి గుర్తుచేశారు. తాము ప్రతి నెలా కోర్టుకు హాజరై వాయిదాల కోసం నేరస్థుల మాదిరిగా తిరగాల్సి వస్తోందని వాపోయారు.


గవర్నర్‌ కార్యదర్శిగా పరిశీలనలో ముగ్గురి పేర్లు

ఈనాడు, అమరావతి: గవర్నర్‌ కార్యదర్శిగా ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. 2010 బ్యాచ్‌కు చెందిన కె.హర్షవర్ధన్, పోలా భాస్కర్, 2012 బ్యాచ్‌కు చెందిన డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌.. ఈ ముగ్గురిలో ఒకరు నియమితులయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కార్యదర్శిగా వ్యవహరించిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు.


రాజ్‌భవన్‌లో పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు

ఈనాడు, అమరావతి: విజయవాడలోని రాజ్‌భవన్‌లో పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర అవతరణ వేడుకలను గురువారం నిర్వహించారు. ‘ఏక్‌ భారత్‌.. శ్రేష్ఠ్‌ భారత్‌’లో భాగంగా వీటిని నిర్వహించారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కార్యక్రమంలో పాల్గొని సందేశమిచ్చారు. పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ వీడియో సందేశాన్ని వినిపించారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్, సిద్ధార్థ వైద్య కళాశాలలో చదువుతున్న పశ్చిమబెంగాల్‌ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. గవర్నర్‌ సతీమణి, రాష్ట్ర ప్రథమ పౌరురాలు సమీరా నజీర్, రాజ్‌భవన్‌ అధికారులు పాల్గొన్నారు.


ముఖ ఆధారిత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలి
ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి

ఈనాడు, అమరావతి: క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ముఖ ఆధారిత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ను కోరింది. ఈ మేరకు సచివాలయంలో ఆయనకు విజ్ఞాపనపత్రం అందజేసింది. ఇబ్బడిముబ్బడిగా ఉన్న మొబైల్‌ యాప్‌లను తొలగించాలని, వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయాలని కోరినట్లు సంఘం అధ్యక్షుడు ఆస్కారరావు, ఇతర నేతలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


ముర్ముజీ మార్గదర్శకత్వంలో దేశం పురోగమిస్తుంది: సీఎం చంద్రబాబు 

ఈనాడు డిజిటల్, అమరావతి: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె ఆయురారోగ్యాలతో సంపూర్ణ జీవితం గడపాలని అభిలషించారు. ఆమె మార్గదర్శకత్వంలో దేశం పురోగమిస్తుందని పేర్కొన్నారు. 


రాష్ట్రపతికి ఉపముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ ఉపాధ్యాయురాలిగా జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. ప్రజాక్షేత్రంలో స్థానిక సంస్థల ప్రతినిధిగా, చట్టసభలో సభ్యురాలిగా, గవర్నర్‌గా, రాష్ట్రపతిగా ఎదిగిన క్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని గురువారం ఒక ప్రకటనలో కొనియాడారు.


‘జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం’

ఈనాడు, అమరావతి: రవాణా శాఖ అధికారులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్స్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.జగదీష్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారులు విధి నిర్వహణలో మోటారు వాహన చట్టం ప్రకారం పని చేస్తారని పేర్కొన్నారు. 


ద్వారకా తిరుమలరావుకు సత్కారం

డీజీపీగా నియమితులైన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు ఘనంగా సన్మానించారు. భారీ పూలదండలతో సత్కరించారు. సంస్థ అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి శ్రమించారని కొనియాడారు.


‘ఉపాధి’ నిధుల్ని ఉద్యాన పంటలకు మళ్లించొద్దు
రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం విజ్ఞప్తి

ఈనాడు డిజిటల్, అమరావతి: ఉపాధి హామీ నిధుల్ని ఉద్యాన పంటల అభివృద్ధికి మళ్లించవద్దని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ‘ఉపాధి’ సొమ్మును ఇతర వాటికి మళ్లించడం వల్ల కూలీల నిధులు ధనిక రైతులకు చేరినట్లవుతుందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే గ్రామాల్లో పనులు లేక 20 లక్షల మంది వ్యవసాయ కార్మికులు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 


సస్పెండైన ఉపాధ్యాయుల్ని విధుల్లోకి తీసుకోవాలి: యూటీఎఫ్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికల విధుల్లో భాగంగా వివిధ కారణాలతో సస్పెండైన ఉపాధ్యాయుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాకు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఏపీ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(యూటీఎఫ్‌) అధ్యక్షుడు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పలువురికి ఇచ్చిన షోకాజ్‌ నోటీసులనూ ఉపసంహరించుకోవాలని కోరినట్లు గురువారం ఓ ప్రకటనలో వారు పేర్కొన్నారు.


జీవో నం.117ని రద్దు చేయాలి: ఏపీటీఎఫ్‌

పాఠశాల విద్యను అస్తవ్యస్తం చేసిన జీవో నం.117, దాని అనుబంధ జీవోల్ని వెంటనే రద్దు చేయాలని ఏపీ ఉపాధ్యాయుల సమాఖ్య (ఏపీటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, యస్‌.చిరంజీవిలు కోరారు. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌కు వినతిపత్రం ఇచ్చారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని