ఉద్యోగులకు పాత పింఛను ఇప్పించండి

గత ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులకు పింఛనుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, దీనిపై ప్రత్యేక దృష్టిసారించి ప్రభుత్వ ఉద్యోగులకున్న పాత పింఛను తమకూ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి విజ్ఞప్తి చేశాయి.

Published : 21 Jun 2024 05:39 IST

రవాణా శాఖ మంత్రికి ఆర్టీసీ సంఘాల వినతి

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులకు పింఛనుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, దీనిపై ప్రత్యేక దృష్టిసారించి ప్రభుత్వ ఉద్యోగులకున్న పాత పింఛను తమకూ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి విజ్ఞప్తి చేశాయి. గురువారం ఆర్టీసీ హౌస్‌కు వచ్చిన ఆయన్ను ఎంప్లాయీస్‌ యూనియన్, నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్, కార్మిక పరిషత్‌ రాష్ట్ర నేతలు కలిసి.. ఉద్యోగుల సమస్యలపై వినతులు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న పాత పింఛను తమకూ వర్తింపజేస్తారనే విలీనం కోరుకున్నామని తెలిపారు. ఈహెచ్‌ఎస్‌ వైద్యాన్ని తొలగించి, గతంలో మాదిరిగా రిఫరల్‌ ఆసుపత్రుల్లో ఎంత ఖర్చయినా వైద్యం పొందే సదుపాయం కల్పించాలని విన్నవించారు. ప్రతి చిన్న అంశానికి సస్పెన్షన్లు, తొలగింపులు వంటి చర్యలతో ఉద్యోగ భద్రత లేకుండా చేశారని పేర్కొన్నారు. కేడర్‌ స్ట్రెంక్త్‌ పేరిట దూర ప్రాంతాలకు బదిలీలు చేశారని, ఎక్కడ పనిచేస్తున్న వారిని అక్కడే కొనసాగించాలని కోరారు. అన్ని సంఘాల వినతులు స్వీకరించిన మంత్రి.. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని