శవాలతో కాసుల వేట!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొందరు పోస్టుమార్టం పేరుతో శవాలపై కాసులు ఏరుకుంటున్నారు. బాధితుడిపై ఉన్న బీమా విలువ, ఆ కుటుంబాల ఆత్రుత ఆధారంగా వసూళ్లకు తెగబడుతున్నారు.

Updated : 21 Jun 2024 05:51 IST

పోస్టుమార్టం ప్రక్రియలో వసూళ్లు
బాధితుల బంధువుల దుఃఖంపట్టని పలువురు వైద్యులు, పోలీసులు
నియంత్రణపై కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టాలని అభ్యర్థనలు!

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొందరు పోస్టుమార్టం పేరుతో శవాలపై కాసులు ఏరుకుంటున్నారు. బాధితుడిపై ఉన్న బీమా విలువ, ఆ కుటుంబాల ఆత్రుత ఆధారంగా వసూళ్లకు తెగబడుతున్నారు. నచ్చినంత ఇవ్వకపోతే పోస్టుమార్టం చేయడం, నివేదిక ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. కొన్ని ఘటనల్లో నెలలు గడిచినా రిపోర్టులు ఇవ్వడం లేదు. మృతదేహం మార్చురీలోకి వెళ్లింది మొదలు.. నివేదిక బాధితుల చేతికందే వరకూ ఈ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగుల్లో చాలామంది ఏదో ఓ సందర్భంలో దందాలో పాలుపంచుకుంటున్నారు. ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారికి ఈ వసూళ్ల దందా ఆవేదనను మిగుల్చుతోంది. మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి ఇద్దరిని బలి తీసుకుంటే.. ఈ కేసులో అక్కడి ఫోరెన్సిక్‌ వైద్యులు ఏకంగా నిందితుడి రక్త నమూనాలే మార్చేశారు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం, నివేదికలు చూసుకునే ఫోరెన్సిక్‌ విభాగంపై రాష్ట్రంలోనూ చర్చ జరుగుతోంది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే పోస్టుమార్టం జరగాలన్న నిబంధనను అక్రమార్కులు అనుకూలంగా మలుచుకొని జేబులు నింపుకొంటున్నారు. బోధనాసుపత్రుల్లో ఏడాదికి 20 వేల మృతదేహాలు, మిగిలిన ఆసుపత్రుల్లో అదనంగా ఏడాదికి 10 వేల మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోంది. ప్రతి ఆసుపత్రిలో రోజుకు ఒకటి నుంచి 5 మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోంది. ఒక్కో పోస్టుమార్టంకు కనీసం రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు డిమాండు చేస్తున్నారు. వివాదస్పద, పరువు కేసుల్లో ఈ విలువ పెరుగుతోంది. మృతదేహాలు ఆసుపత్రులకు రాగానే స్థానిక పోలీసుస్టేషన్‌ లేదా ఆసుపత్రిలోని ఔట్‌పోస్టులో ఉండే వారు వివరాలు సేకరించాలి. ఆసుపత్రిలోని సంబంధిత సెక్షన్‌ సిబ్బంది ద్వారా వైద్యులు, మార్చురీ సిబ్బందికి సమాచారం వెళ్తుంది. ఈ ప్రక్రియలోనే గొలుసు కట్టులా వసూళ్లూ జరుగుతున్నాయి. పోలీసులతో సంబంధిత ఉద్యోగులు కుమ్మక్కవుతున్నారు. 

రాష్ట్రంలో అక్రమాలు.. అవకతవకలు ఎన్నో..!

మృతదేహం తరలింపు మామూళ్ల విషయంలో తిరుపతి రుయాలో ఓ ఆర్‌ఎంఓ(వైద్యుల)ను మాతృశాఖకు సరెండర్‌ చేశారు. ఒంగోలులోని జీజీహెచ్‌లోనూ శవ పరీక్షల్లో భారీఎత్తున వసూళ్లు జరుగుతున్నాయి. ఆధారాల్లేవని చర్యలు తీసుకోలేక పోతున్నామని అధికారులే చెబుతున్నారు. ఓ పోస్టుమార్టం కేసులో మచిలీపట్నం ఆసుపత్రి వైద్యుడు రూ.10 వేలు డిమాండు చేయడంతో సస్పెండ్‌కు గురయ్యారు. ఉత్తరాంధ్రలో ఓ మృతదేహంలోని అవయవాలు కాకుండా.. వేరే అవయవాలను పరీక్షల కోసం బయటకు పంపారన్న పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ సాగుతోంది. విశాఖ కేజీహెచ్‌లో పోస్టుమార్టంకు సంబంధించి మామూళ్ల వసూలు విషయమై అధికారులకు వైద్యులే ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఒకరిని మాతృశాఖకు సరెండర్‌ చేశారు. నెల్లూరు జీజీహెచ్‌లోనూ పోస్టుమార్టం కోసం బాధిత కుటుంబాన్ని డబ్బు డిమాండ్‌ చేసిన వైద్యుడిని సస్పెండ్‌ చేశారు.


వసూళ్లకు ఎన్ని మార్గాలో...! 

  • బీమా మృతుల కేసుల్లో వసూళ్ల డిమాండు మరీ ఎక్కువగా ఉంటోంది. మరణించిన వ్యక్తి మద్యం తాగినట్లు నివేదిక ఇస్తే కొన్నిసార్లు బీమా కూడా రాకపోవచ్చు. దీంతో కొందరు వైద్యులు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు.. బీమా మొత్తం లెక్కేసి మరీ డబ్బు తీసుకుంటున్నారు.
  • కొన్ని కేసుల్లో శవ పరీక్ష చేయకుండా మృతదేహాన్ని అప్పగించాలని బంధువులు కోరితే రూ.20 వేలు డిమాండు చేస్తున్నారు. మృతికి గల కారణాల తీవ్రతను తగ్గించి చూపేందుకు అడిగినంత ఇవ్వాల్సిందే.
  • పరిశ్రమల్లో మరణించిన వారి కేసుల్లో సహజ మరణమని రాస్తే బాధితులకు వచ్చేది డబ్బు తక్కువ. అందుకని గాయపడి మరణించారని రాసిచ్చి.. అందులో వాటా డిమాండు చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో బీమా కంపెనీలు వైద్యులపై ఫిర్యాదులు చేస్తున్నాయి. 
  • చివరికి శవ పరీక్షకు అవసరమయ్యే సామగ్రి భారమంతా బాధిత కుటుంబాలపై వేస్తున్నారు.

పక్కా నిబంధనలు అవసరం..

మార్చురీల వద్ద తాత్కాలికంగా పనిచేసే వారికి నెలకు రూ.9 వేలు ఇస్తున్నారు. ఫోరెన్సిక్‌ డిపార్టుమెంట్‌లో వైద్యులు, ఇతర సిబ్బంది ఏళ్ల తరబడి పాతుకుపోయి పనిచేస్తుండడం కూడా అవినీతి, అక్రమాలకు దోహదం చేస్తోంది. బ్రిటిష్‌ కాలం నాటి మార్గదర్శకాల ప్రకారమే శవపరీక్షలు జరుగుతున్నాయి. వీటిని సరిదిద్ది, బాధిత కుటుంబాలకు అనుకూలంగా ఉండేలా చేయాల్సి ఉంది. స్టాండర్డ్‌ ఆఫ్‌ ప్రొసీజర్స్‌ కొత్తగా తయారుచేయాలి. పంజాబ్, హరియాణా లాంటి రాష్ట్రాల్లో కొంత మేరకు నియంత్రణ ఉంది. వాటిని పరిశీలించి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని