ప్రకృతి సేద్యంలో ఇదేమి చోద్యం?

‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ పేరిట కొన్నాళ్లుగా భారీ దోపిడీ జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నడిచే ఈ సంస్థ కార్యకలాపాలపై ఎవరి పర్యవేక్షణా లేదు.

Updated : 21 Jun 2024 06:25 IST

రైతులకు అందని సాయం
విశ్రాంత అధికారులకు పునరావాసం
జగన్‌ విధేయ అధికారులకు చోటు
విచారణ జరిపితే అక్రమాలు వెలుగులోకి

ఈనాడు, అమరావతి: ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ పేరిట కొన్నాళ్లుగా భారీ దోపిడీ జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నడిచే ఈ సంస్థ కార్యకలాపాలపై ఎవరి పర్యవేక్షణా లేదు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనూ పట్టుమని పది మంది రైతులు ఈ విధానం అనుసరించకపోగా, తప్పుడు నివేదికలతో నిధులు కాజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఈ పథకం అమలుకు కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు ద్వారా రూ.790 కోట్ల రుణం మంజూరు కాగా, ఇప్పటికే రూ.100 కోట్లు వచ్చాయి. మరో రూ.90 కోట్లు త్వరలో అందనున్నాయి. విప్రో ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ద్వారా గతంలో ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున మంజూరు కాగా, ప్రస్తుతం రూ.65 కోట్లు అందనున్నాయి. పరంపరాగత కృషి వికాస యోజన కింద కేంద్రమిచ్చే నిధులు కూడా ఖర్చైపోతున్నాయి. అయినా సంస్థలోని సుమారు 9,400 మంది సిబ్బందికి 15 నెలలుగా జీతాలివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారణ జరిపిస్తే, అక్రమాలు వెలుగు చూసే ఆస్కారముంది.

ఎనిమిదేళ్లుగా అదే అధికారి 

2015-16లో ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ పేరుతో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, తర్వాత రైతు సాధికార సంస్థ పరిధిలోకి తెచ్చారు. ఆ సంస్థకు కార్యనిర్వాహక వైస్‌ ఛైర్మన్‌ కూడా ఆయనే. ఎనిమిదేళ్లుగా ఈ బాధ్యతలు విజయ్‌కుమార్‌ ఒక్కరే నిర్వహిస్తున్నారు. వైకాపా హయాంలో దీన్ని ఏపీసీఎన్‌ఎఫ్‌ (ఆంధ్రప్రదేశ్‌ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం)గా మార్చారు. తొలినాళ్లలో సత్ఫలితాలిచ్చినా, కాలక్రమంలో మొక్కుబడిగా మారింది. ఇక, గతంలో గుంటూరు కలెక్టర్‌గా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ను సంస్థ ఈడీగా నియమించారు. పదవిలో ఉన్నప్పుడే నాటి సీఎం జగన్‌ను వైకాపా కార్యకర్తలకు మించి కీర్తించిన ఆయనకు శేష జీవితంలో ఇక్కడ పునరావాసం కల్పించారు. ఈ విభాగంలో కొన్నాళ్లుగా ఒకే సామాజికవర్గానికి పెద్దపీట వేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ఈ లెక్కల్లో నిజమెంత?

రాష్ట్రంలో 4,120 గ్రామాల్లో 10.70 లక్షల మంది రైతులు 12 లక్షల ఎకరాల్లో పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం చేస్తున్నట్లు ఈ విభాగం అధికారులు చెబుతున్నారు. 45 దేశాల ప్రతినిధులు ఈ విధానాలను పరిశీలించారన్నది వీరి మరో ప్రచారం. వాస్తవానికి, గతేడాది కరవుతో రాష్ట్రంలో 47.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయలేదు. వేసిన పంటలు కరవు, తుపాను దెబ్బకు సుమారు 50 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. అయినా ఇంత విస్తృతంగా ప్రకృతి సాగు ఎక్కడ చేశారో అధికారులకే తెలియాలి.     ఈ విభాగం సిబ్బందికి రూ.కోట్లలో జీతభత్యాలు  చెల్లిస్తున్నా, వీరి కార్యకలాపాలేంటో వ్యవసాయ శాఖకు తెలియదు. గతంలో గ్రామాల వారీగా    సర్వే చేయించగా, వీరు చెప్పిన లెక్కల్లో 10% రైతులు కూడా ప్రకృతి సాగు చేయడం లేదని గుర్తించారు. అసలు ఈ విభాగం ఒకటి ఉందన్న సంగతే తెలియదని రైతులు చెబుతున్నారు. ఆవుల పంపిణీ, ప్రకృతి సాగులో వాడే వివిధ ఉత్పత్తుల సరఫరా పేరుతో నిధులు కాజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పులివెందులలో ప్రయోగశాల పేరిట హడావిడి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని