ఇంకా వైకాపాకే జీ హుజూర్‌!

విశాఖ జిల్లా అధికారులు ఇప్పటికీ వైకాపాకు జీ హుజూర్‌ అంటూనే ఉన్నారు. పూర్తి అనుమతుల్లేకుండా ఎప్పుడో పూర్తయిన వైకాపా కార్యాలయ భవనాలకు, తాజాగా అనుమతులిచ్చేందుకు పావులు కదిలాయి.

Updated : 22 Jun 2024 09:31 IST

ఎప్పుడో పూర్తయిన పార్టీ భవనాలకు ఇప్పుడు అనుమతులిచ్చే ప్రయత్నం
ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం వేళ విశాఖ అధికారుల తీరిది
గంటల వ్యవధిలోనే రెండు లాగిన్స్‌ దాటిన దస్త్రాలు

ఆన్‌లైన్‌లో దస్త్రాలు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ జిల్లా అధికారులు ఇప్పటికీ వైకాపాకు జీ హుజూర్‌ అంటూనే ఉన్నారు. పూర్తి అనుమతుల్లేకుండా ఎప్పుడో పూర్తయిన వైకాపా కార్యాలయ భవనాలకు, తాజాగా అనుమతులిచ్చేందుకు పావులు కదిలాయి. ఇన్నాళ్లూ వైకాపా కార్యకర్తల్లా పనిచేసిన అధికారులే మళ్లీ స్వామిభక్తి చాటారు. శుక్రవారం ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తున్నవేళ గుట్టుచప్పుడు కాకుండా పట్టణ ప్రణాళిక వెబ్‌సైట్‌ లాగిన్‌లో వైకాపా కార్యాలయాల భవన నిర్మాణాల ప్లాన్‌ దస్త్రాలను వేగంగా ముందుకు కదిపారు.

విశాఖ నగరం ఎండాడలో ప్యాలెస్‌లా నిర్మించిన వైకాపా కార్యాలయం 

వీఎంఆర్డీఏ ద్వారా మాస్టర్‌ ‘ప్లాన్‌’ 

విశాఖలోని చినగదిలి మండలం ఎండాడ గ్రామ సర్వేనంబరు 175/4లో రెండు ఎకరాల స్థలాన్ని వైకాపా కార్యాలయానికి కేటాయించారు. అనుమతులు లేకుండానే పార్టీ కార్యాలయ భవనాలు పూర్తయ్యాయి. సాధారణంగా జీవీఎంసీ నుంచి ఇక్కడ కట్టే భవన నిర్మాణాలకు ప్లాన్‌ అనుమతులు పొందాలి. కానీ, కలెక్టర్‌ మల్లికార్జున ఛైర్మన్‌గా ఉన్న వీఎంఆర్డీఏకు.. రూ.10వేలు చెల్లించి దరఖాస్తు చేసి వదిలేశారు. ఈ నెల 20వ తేదీ గురువారం మధురవాడ జోన్‌-2 సచివాలయ ప్లానింగ్‌ కార్యదర్శి ఎండాడలోని వైకాపా భవనాల వద్దకు వెళ్లారు. భవన నిర్మాణాలకు ప్లాన్‌ ఉందా.. లేదా అని పరిశీలిస్తుండగా.. అక్కడ ఉన్న ఓ మహిళ ‘భవనం ఎప్పుడో పూర్తయింది. ఇప్పుడు ప్లాన్‌ ఏంటి? ఏమున్నా ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడుకోండి’ అని సమాధానమివ్వడంతో అధికారులు అవాక్కయ్యారు. అప్పటికే మీసాల వెంకట సుబ్రహ్మణ్యం ఎల్‌టీపీ వద్ద 525 రోజులుగా ఈ భవనాల ప్లాన్‌ దస్త్రం ఉంది. జిల్లా అధికారుల సలహాతో ఆఘమేఘాలపై గురువారం సాయంత్రమే వైకాపా నేతలు సుమారు రూ.14 లక్షలు చెల్లించారు. దీంతో ఎల్‌టీపీ లాగిన్‌ నుంచి అదేరోజు రాత్రి 7.27 గంటలకు దస్త్రం ముందుకు కదిలి వీఎంఆర్డీఏ టౌన్‌ ప్లానింగ్‌లోని సతీష్‌ అనే ఉద్యోగి లాగిన్‌కు చేరింది. శుక్రవారం సాయంత్రం 3.57 గంటలకు డి.రామానాయుడు అనే ఉద్యోగి లాగిన్‌కి వెళ్లగా.. అక్కడ 19 నిమిషాల్లో దస్త్రానికి ఆమోదముద్ర వేసి పై అధికారులకు పంపారు. ఇంకాసేపు ఆగితే అనుమతులకు కావాల్సిన మిగిలిన తంతు అంతా పూర్తిచేసేవారే. ఈలోగా జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ ఫిర్యాదుచేయడంతో వీఎంఆర్‌డీఏ టౌన్‌ప్లానింగ్‌లో అధికారులు దస్త్రాలను నిలిపివేశారు. వందల రోజులుగా కదలని ఫైలు గంటల వ్యవధిలో కదలడానికి జిల్లా అధికారుల ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది.

అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో అనుమతుల్లేకుండా పూర్తయిన వైకాపా భవనం

అనకాపల్లి ప్లాన్‌ 351 రోజులుగా లాగిన్‌లోనే 

అనకాపల్లి జిల్లా రాజుపాలెం గ్రామ సర్వే నంబరు 75/3లో 1.75 ఎకరాల భూమిని గతంలో కాపు కార్పొరేషన్‌కు కేటాయించారు. వీఎంఆర్డీఏ నిధులతో చుట్టూ ప్రహరీ నిర్మించారు. తర్వాత 2022లో వైకాపా కార్యాలయానికి అదే స్థలం ఇచ్చారు. భవన నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక అధికారులకు దరఖాస్తు చేసి 351 రోజులవుతున్నా అనుమతులు రాలేదు. కానీ, జీవీఎంసీ జోన్‌-7 పరిధిలో వైకాపా భవన నిర్మాణాలు దర్జాగా పూర్తిచేశారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ నిధులతో ఈ కార్యాలయానికి రోడ్లు, విద్యుత్‌ దీపాలు ఏర్పాటుచేయడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని