రూసా నిధులు ధారాదత్తం!

ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్షా అభియాన్‌ (రూసా) కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధుల వ్యయం గాడి తప్పుతోంది. పలు విద్యా సంస్థల్లో ఈ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి.

Published : 22 Jun 2024 04:56 IST

అమెరికా సంస్థకు రూ.1.03 కోట్లు చెల్లించి సేవలు పొందని ఆంధ్ర వర్సిటీ
నాగార్జున విశ్వవిద్యాలయంలో డీపీఆర్‌ లేకుండానే రూ.3 కోట్ల వ్యయం
కేంద్ర ప్రభుత్వం చేయించిన ఆడిట్‌లో వెలుగు చూసిన అక్రమాలు 

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్షా అభియాన్‌ (రూసా) కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధుల వ్యయం గాడి తప్పుతోంది. పలు విద్యా సంస్థల్లో ఈ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ప్రధానంగా భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, పరికరాల కొనుగోళ్ల కోసం రూసా కింద కేంద్రం కొన్నేళ్లుగా నిధులిస్తూ వచ్చింది. కొన్ని వర్సిటీల్లో భవన నిర్మాణాలను అసంపూర్తిగా వదిలేయగా.. మరికొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా డీపీఆర్‌లు లేకుండానే పనులు చేసేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నిధులిచ్చినా సకాలంలో పనులు పూర్తిచేయని దుస్థితి నెలకొంది. ఏపీలోని విద్యా సంస్థలకు ఇచ్చిన నిధులపై కేంద్ర ప్రభుత్వం గతేడాది మార్చి వరకు ఆడిట్‌ చేయించింది. గుర్తించిన లోపాలపై నివేదిక ఇవ్వాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. రూసాను కేంద్రం ఇప్పుడు పీఎం ఉషా కింద మార్పు చేసింది. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఈ నిధులపై దృష్టిపెడితే ఉన్నత విద్యా సంస్థల్లో సౌకర్యాలు మెరుగుపడతాయి.

నిధులు చెల్లించి ఊరుకున్నారు

విద్యార్థులకు విదేశీ అధ్యాపకులతో ఉపన్యాసాలు, పరిశోధనలకు సహకారం పేరుతో ఆంధ్ర విశ్వవిద్యాలయం రూ.1.03 కోట్ల నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆడిట్‌లో బహిర్గతమైంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని తయారు చేసే విధానాన్ని అభివృద్ధి చేయడం, పరిశోధనల్లో భాగస్వామ్యం, కోర్‌ సబ్జెక్టులపై శిక్షణ కోసమంటూ అమెరికాకు చెందిన పర్డ్యూ విశ్వవిద్యాలయంతో ఆంధ్ర వర్సిటీ గతంలో ఒప్పందం చేసుకుంది. అందుకోసం ఏడాదికి రూ.2.06 కోట్లు వెచ్చించాల్సి ఉండగా, ముందస్తుగా రూ.1.03 కోట్లు చెల్లించారు. తర్వాత ఆ వర్సిటీతో ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. రూసా నిధులు రూ.2.22 కోట్లతో చేపట్టిన బాలికల వసతిగృహం నిర్మాణాలను అసంపూర్తిగా వదిలేశారు. విశ్వవిద్యాలయం నిధులు రూ.5.65 కోట్లతో చేపట్టిన పనుల్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. రూ.6.54 కోట్లతో విద్యార్థుల వసతిగృహాన్ని నిర్మించినా, దాన్ని కూడా గతేడాది ఆగస్టు వరకు వాడుకలోకి తీసుకురాలేదని ఆడిట్‌ విభాగం పేర్కొంది. 

అనుమతులు లేకుండా ఇష్టారాజ్యం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డీపీఆర్‌ అనుమతులు లేకుండానే రూ.3.03 కోట్ల మేర వ్యయం చేశారు. రెండు పరికరాల కొనుగోలుకు 2019 అక్టోబరులో రూ.49.15 లక్షలు వ్యయమవుతుందని కొటేషన్‌ తీసుకున్నారు. కానీ, సకాలంలో వాటిని కొనుగోలు చేయలేదు. తీరా 2021 ఆగస్టులో వాటి కొనుగోలు కోసం రూ.59.18 లక్షలు చెల్లించారు. 

  • శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో రూ.1.41 కోట్లతో డీపీఆర్‌ రూపొందించినా, ఆ పనుల్ని ప్రారంభించలేదు. నాణ్యత తనిఖీల విభాగం ధ్రువీకరించకుండానే కొన్ని పనులకు రూ.57 లక్షలు చెల్లించేశారు. కాంట్రాక్టు పనులకు టెండర్లు పిలిచిన విశ్వవిద్యాలయం అధికారులు ఎల్‌1గా నిలిచిన వ్యక్తికి రూ.31 కోట్ల మేర పనులు అప్పగిస్తే, నిబంధనలకు విరుద్ధంగా ఎల్‌2గా నిలిచిన వ్యక్తికి రూ.33 లక్షల విలువగల పనుల్ని కట్టబెట్టారు.
  • పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.1.60 కోట్లతో 18 తరగతి గదుల నిర్మాణానికి అంచనాలు రూపొందించగా, అవే నిధులతో 10 గదులు మాత్రమే పూర్తిచేశారు. వాటిలోనూ దివ్యాంగుల కోసం సదుపాయాలు కల్పించలేదు. 
  • స్వయం ప్రతిపత్తి కళాశాలల విభాగంలో సెయింట్‌ థెరిసా కళాశాలకు ఇచ్చిన రూ.1.16 కోట్లతో 15 గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చివరికి వాటిలో ఐదు గదుల పనులను మాత్రమే ప్రారంభించారు. గతేడాది మార్చి వరకు వాటినీ పూర్తి చేయలేదు. 
  • విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో భవన నిర్మాణ పనులను ఏపీ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు అప్పగించారు. ఈ సంస్థలో ఇంజినీర్లు లేకపోవడంతో ఐదారేళ్లుగా ఆయా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ జాప్యం వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని