ఏపీఎండీసీలో ముగ్గురు సలహాదారుల తొలగింపు

ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో ముగ్గురు సలహాదార్ల సేవలను ఉపసంహరిస్తూ సంస్థ ఎండీ ఎన్‌.యువరాజ్‌ శుక్రవారం ఉత్తర్వు జారీచేశారు.

Published : 22 Jun 2024 04:59 IST

అదానీకి అడ్డగోలుగా మేలుచేసిన ప్రసాద్‌
పనిలేకుండా జీతం పొందిన నాగేశ్వరరావు

ఈనాడు, అమరావతి: ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో ముగ్గురు సలహాదార్ల సేవలను ఉపసంహరిస్తూ సంస్థ ఎండీ ఎన్‌.యువరాజ్‌ శుక్రవారం ఉత్తర్వు జారీచేశారు. బొగ్గు విభాగానికి సలహాదారు డీఎల్‌ఆర్‌ ప్రసాద్, ఆరోగ్యం, భద్రత, పర్యావరణం (హెచ్‌ఎస్‌ఈ) విభాగ సలహాదారు కె.నాగేశ్వరరావు, న్యాయ సలహాదారు ఎం.వెంకటరమణల సేవలు తక్షణం ఉపసంహరిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

అదానీకి మేలుచేసేందుకు వచ్చిన ప్రసాద్‌

సలహాదారుల్లో డీఎల్‌ఆర్‌ ప్రసాద్‌ దాదాపు నాలుగున్నరేళ్లపాటు ఏపీఎండీసీలో చక్రం తిప్పారు. ఎంపీ మిథున్‌రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలతో సంస్థకు సలహాదారుగా వచ్చారు. గతంలో అదానీ సంస్థల్లో పనిచేసిన ఆయన.. ఏపీఎండీసీకి సలహాదారుగా వచ్చాక.. మధ్యప్రదేశ్‌లోని సులియారీ బొగ్గు ప్రాజెక్టు నుంచి బొగ్గు సరఫరా ప్రాజెక్టు అదానీ సంస్థకు దక్కేలా కీలకంగా వ్యవహరించారు. బిడ్‌ దక్కించుకునే గుత్తేదారు రూ.250 కోట్లు డిపాజిట్‌ చేయాలనే నిబంధన పెట్టి, ఎక్కువ సంస్థలు పోటీపడకుండా చేయడంలో డీఎల్‌ఆర్‌ ప్రసాద్‌ సఫలీకృతులయ్యారు. దీంతో బొగ్గు బేసిక్‌ ధర కంటే కేవలం 1 శాతం మాత్రమే అదనంగా కోట్‌చేసి అదానీ పవర్‌ సంస్థ బొగ్గు టెండరును కొట్టేసింది. బీచ్‌ శాండ్‌ టెండర్లు, ఇంకా అనేక అంశాల్లో డీఎల్‌ఆర్‌ ప్రసాద్‌ కీలకంగా ఉంటూ, వైకాపా పెద్దలకు, పెద్దిరెడ్డి కుటుంబానికి, అదానీ గ్రూపునకు మేలు జరిగేలా చూశారనే ఆరోపణలు ఉన్నాయి.

పనిలేకుండా నాగేశ్వరరావుకు జీతం

కేంద్ర మైన్స్‌ సేఫ్టీ విభాగంలో ఉప సంచాలకుడిగా పనిచేసి పదవీ విరమణచేసిన కె.నాగేశ్వరరావును వెంటనే ఏపీఎండీసీలో (ఎచ్‌ఎస్‌ఏఈ) సలహాదారుగా తీసుకున్నారు. ఎంపీ మిథున్‌రెడ్డితో ఉన్న సంబంధాల కారణంగా ఆయనకు ఏపీఎండీసీలో ఈ పునరావాసం దొరికింది. ఆయన ఈ సంస్థలో జీతం తీసుకుంటూ.. చేసిన పని ఏదీలేదని అక్కడి ఉద్యోగులు చెబుతుంటారు.

ఫైనాన్స్‌ మేనేజర్‌ రాజీనామా ఆమోదం

మంగంపేట ముగ్గురాయి గనుల్లో ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ మేనేజర్‌గా ఉన్న కొండారెడ్డి రాజీనామాను అధికారులు ఆమోదించారు. గతంలో రిటైరైన ఆయన్ను కొంత కాలం ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయంలో, తర్వాత మంగంపేటలో ఫైనాన్స్, అండ్‌ అకౌంట్స్‌ మేనేజర్‌గా కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయనతో రాజీనామా చేయించి, ఆమోదించారు.

సోమవారం తెరుచుకోనున్న కార్యాలయాలు?

గనులశాఖ కమిషనర్‌/ సంచాలకుడు, ఏపీఎండీసీ ఇన్‌ఛార్జి ఎండీగా నియమితులైన ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ సోమవారం బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిసింది. మొన్నటి వరకు ఈ బాధ్యతలో ఉన్న వెంకటరెడ్డిని ఈనెల 7న ప్రభుత్వం బదిలీచేశాక, అదేరోజు అర్ధరాత్రి ఈ రెండు కార్యాలయాలను ఏపీఎస్పీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని తాళాలు వేశారు. దస్త్రాలు, హార్డ్‌డిస్క్‌లు వంటివేవీ మాయం చేయకుండా ఈ చర్యలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఉద్యోగులు ఎవరినీ విధులకు కూడా హాజరుకానివ్వడం లేదు. కొత్త కమిషనర్‌ రాకతో ఈ రెండు కార్యాలయాల తాళాలు సోమవారం తెరుచుకోనున్నట్లు సమచారం.


మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లను కొనసాగిస్తారా?

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి సిఫార్సు చేసిన వారిని ఏపీఎండీసీలో పెద్ద సంఖ్యలో మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లుగా తీసుకొని ఇంతకాలం జీతాలు ఇస్తూ వచ్చారు. అర్హతలు లేకపోయినా, అనుభవం ఉండకపోయినా.. వారిని ఏపీఎండీసీ నిధులతో ఇప్పటి వరకు పోషించారు. వీరిలో 90 శాతం దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినవారే ఉన్నారు. ఇంకా వీరిని కొనసాగించి, జీతాలిచ్చి పోషిస్తారా అనే విమర్శలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని