సంక్షిప్త వార్తలు(12)

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.రవీంద్రబాబు శుక్రవారం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తెల్లవారుజామున అభిషేక సేవలో, ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి మూలమూర్తిని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు.

Updated : 22 Jun 2024 05:33 IST

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

ఆలయం ఎదుట కుటుంబసభ్యులతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.రవీంద్రబాబు

తిరుమల, న్యూస్‌టుడే: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.రవీంద్రబాబు శుక్రవారం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తెల్లవారుజామున అభిషేక సేవలో, ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి మూలమూర్తిని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.


‘కనెక్ట్‌ టు ఆంధ్ర’కు రూ.5 కోట్ల విరాళం

అమరావతి: దేవీ సీఫుడ్స్‌ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద ‘కనెక్ట్‌ టు ఆంధ్రా’కు రూ.5 కోట్ల విరాళాన్ని అందించింది. ఇందుకు సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ పోట్రు బ్రహ్మానందం శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. 


హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్మన్‌గా జస్టిస్‌ నరేందర్‌

ఈనాడు, అమరావతి: ఏపీ హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్మన్‌గా న్యాయమూర్తి జస్టిస్‌ జి.నరేందర్‌ నియమితులయ్యారు. హైకోర్టు సీజే, ఏపీ న్యాయసేవాధికార సంస్థ పాట్రన్‌ ఇన్‌ చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకానికి సంబంధించి ప్రభుత్వం గెజిట్‌ ప్రచురించింది.   


ఫ్యాప్టో నూతన కార్యవర్గం ఎన్నిక 

- ఛైర్మన్, ప్రధాన కార్యదర్శులుగా సాయిశ్రీనివాస్, ఎస్‌.చిరంజీవి

ఈనాడు, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఛైర్మన్, ప్రధాన కార్యదర్శులుగా ఎల్‌.సాయి శ్రీనివాస్, ఎస్‌.చిరంజీవి ఎన్నికయ్యారు. విజయవాడలో శుక్రవారం జరిగిన ఫ్యాప్టో సమావేశంలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కో ఛైర్మన్లుగా కె.నరహరి, మనోజ్‌కుమార్, చందోలు వెంకటేశ్వర్లు, కె.ప్రకాష్‌రావు, కోశాధికారిగా చింతల సుబ్బారావు, కార్యదర్శులుగా ఎంఎస్‌ ఇమామ్‌ బాషా, డి.మధుసూదనరావుతోపాటు కార్యవర్గ సభ్యులుగా 12 మంది ఎన్నికయ్యారు. డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఎన్‌.వెంకటేశ్వర్లు, భానుమూర్తి, వి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. సీపీఎస్‌ రద్దు చేయాలని, ప్రభుత్వ బడుల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించాలని నూతన కార్యవర్గం తీర్మానించింది. డీఎస్సీ-2003 ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. 


అక్రమ కేసులు ఎత్తివేయండి.. హోంమంత్రికి మత్స్యకారుల వినతి

ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ప్రభుత్వ హయాంలో తమ మీద పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని హోంమంత్రి వంగలపూడి అనితకు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురానికి చెందిన పలువురు మత్స్యకారులు విన్నవించారు. తమను కొట్టి జైళ్లు, కోర్టుల చుట్టూ తిప్పారని కన్నీటిపర్యంతమయ్యారు. స్పందించిన హోంమంత్రి.. బాపట్ల జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేసి సమస్య పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.


ఏజీని మర్యాదపూర్వకంగా కలిసిన ఐలు నాయకులు

ఈనాడు, అమరావతి: అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్‌ ఆధ్వరంలో రాష్ట్ర కార్యవర్గ నాయకులు.. అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ను శుక్రవారం హైకోర్టులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏజీగా కొత్తగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏజీ దృష్టికి తీసుకొచ్చారు. మృతి చెందిన 788 మంది కుటుంబాల కోసం మ్యాచింగ్‌ గ్రాంట్‌ మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏజీని కలిసినవారిలో రాష్ట్ర కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు, ఉపాధ్యక్షుడు వై.రమేష్‌ తదితరులున్నారు. మరోవైపు కేంద్రం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు నియమితులైన న్యాయవాదులు (సెంట్రల్‌ గవర్నమెంట్‌ స్టాండింగ్‌ కౌన్సిల్స్‌) ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. 


సంపూర్ణ పోషణ ఇక బాలసంజీవని 

ఈనాడు, అమరావతి: వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ పథకాల పేర్లను మళ్లీ ‘బాలసంజీవని’గా రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2014-19 మధ్య ఈ పథకాలను బాల సంజీవని పేరుతో అమలు చేశారు. 


మచిలీపట్నం పోర్టు ఈడీ రాజీనామా ఆమోదం

ఈనాడు, అమరావతి: మచిలీపట్నం పోర్టు అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ) వై.విద్యాశంకర్‌ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యానశాఖలో జాయింట్‌ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన ఆయన్ను మచిలీపట్నం పోర్టు ఈడీగా గత ప్రభుత్వం నియమించింది.  


అగ్నిమాపక డీజీగా బాగ్చీ బాధ్యతల స్వీకరణ  

ఈనాడు డిజిటల్, అమరావతి: పౌరులకు శాఖాపరమైన సేవలు అందించే విషయంలో ఏ అధికారి అయినా లంచం డిమాండ్‌ చేస్తే 94409 06254 నంబర్‌కు ఫోన్‌ చేయాలని ప్రజలకు అగ్నిమాపకశాఖ డీజీ శంఖబ్రత బాగ్చీ సూచించారు. లంచం అడిగే వ్యక్తికి సంబంధించిన వీడియో, ఆడియో రికార్డింగుల్ని ఎస్‌ఎంఎస్‌ లేదా వాట్సప్‌ చేయాలన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలోని అగ్నిమాపకశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అవినీతిని ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. 


గ్రూప్‌-2 మెయిన్‌ పరీక్ష వాయిదా వేయాలి: డీవైఎఫ్‌ఐ 

ఈనాడు, అమరావతి: గ్రూప్‌-2 మెయిన్స్‌ను వాయిదావేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న డిమాండుచేశారు. పరీక్షను జులై 28 నుంచి నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించిందని, ఎన్నికల సమయంలో అభ్యర్థుల సన్నద్ధతకు ఇబ్బందులు ఏర్పడ్డాయని అందుకే వాయిదా వేయాలని పేర్కొన్నారు.  


జీవితంలో యోగా భాగం కావాలి 

ఈనాడు, అమరావతి: జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో శుక్రవారం రాష్ట్ర స్థాయి మెగా ఇన్‌క్లూజీవ్‌ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ విద్యార్థుల కంటే దివ్యాంగులు దేనిలోనూ తీసిపోరన్నారు. గతేడాది విశాఖపట్నంలో ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 500 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ సాధించారని పేర్కొన్నారు. 


హైకోర్టు ప్రాంగణంలో యోగా వేడుకలు 

ఈనాడు, అమరావతి: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో ఘనంగా వేడుకలు జరిగాయి. వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎంపవర్‌మెంట్‌ కేంద్ర విద్యార్థులు ప్రాణాయామం చేశారు. కార్యక్రమంలో విట్‌ ప్రొఫెసర్‌ డా.గోస్వామి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని