శాసనసభ ఆవరణలో.. ఎవరేమన్నారంటే

శాసనసభ ఆవరణలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. 

Published : 22 Jun 2024 05:16 IST

ఈనాడు, అమరావతి: శాసనసభ ఆవరణలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. 


 అమరావతిని గత ప్రభుత్వం బాగా దెబ్బతీసింది. 

 గత ప్రభుత్వం రాజధాని అమరావతిని చాలా వరకు దెబ్బతీసింది. మెజారిటీ ప్రాంతం అడవిలా తయారైంది. మొత్తం ముళ్ల కంపలను తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. అన్నీ తీసేస్తే ఎక్కడ, ఎంత నష్టం జరిగిందనేది తెలుస్తుంది. దానికి అనుగుణంగా ముందుకు వెళతాం. రాష్ట్రంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించాం. వైద్యాధికారుల సూచనలకు అనుగుణంగా ముందుకు వెళతాం

పురపాలకశాఖ మంత్రి నారాయణ


నా తమ్ముడు రియల్‌ హీరో

 ‘రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సినిమా వరకే పవర్‌స్టార్‌. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆయన నిజమైన హీరో. గ్రేట్‌ లీడర్‌’ అని సినీనటుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. ‘పవన్‌కల్యాణ్‌ అసెంబ్లీకి రావడం థ్రిల్లింగ్‌ కంటే ఒక బాధ్యతగా భావిస్తున్నాం. ఆయన తీసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణశాఖలు చాలా కీలకమైనవి.  ఆయా శాఖల ద్వారా ప్రజలకు ఏమేరకు మేలు చేయాలనే దానిపైనే పవన్‌ దృష్టి కేంద్రీకరించారు.కొత్తగా పదవి కారణంగా వ్యక్తిగతంగా పవన్‌కు వచ్చే అడ్వాంటేజ్‌ ఏమీ లేదు. కానీ పదవి ద్వారా వచ్చిన పవర్‌ను ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలని మేం కోరుకుంటున్నాం’ అని స్పష్టం చేశారు. 

జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు


జగన్‌కు ప్రతిపక్షహోదా లేకపోయినా గౌరవంగా వ్యవహరించాం

ప్రతిపక్షహోదా జగన్‌కు లేకపోయినా.. ప్రభుత్వం గౌరవంగా ప్రమాణ స్వీకారం చేయించిందని, మొదటి సెషన్‌లోనే ధర్మమార్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించారని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వ హయాంలో వైకాపా నేతలు, మంత్రులు వాడిన భాష, యాసల కారణంగానే జగన్‌ 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇప్పుడు అలాంటి భాష వాడేవారెవరూ లేరు. పోలవరం, అమరావతి, పేదలకు గృహాలు, పింఛన్లు, మౌలిక సదుపాయాలు, ఇతర హామీలన్నీ అమలు చేసి చూపిస్తాం. అభివృద్ధి కార్యక్రమాలు పులివెందుల నుంచే ప్రారంభించేందుకు కూడా తెదేపా ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని పేర్కొన్నారు. 

రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి


తనను అగౌరవపర్చిన సభలో జగన్‌కు గౌరవమిచ్చిన చంద్రబాబు 

 తనని అగౌరవపర్చిన సభలో జగన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవమిచ్చారని తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. అదీ ఆయన వ్యక్తిత్వమని కొనియాడారు. ‘వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును నానా ఇబ్బందులకు గురిచేసింది. ఆ పార్టీ నేతలు ఆయనపై వ్యక్తిగత దూషణలు సైతం చేశారు. అయినా కూడా అసెంబ్లీలో జగన్‌ ప్రమాణస్వీకార సమయంలో సీఎం చంద్రబాబు హుందాగా వ్యవహరించారు.

తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు


నాపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన వ్యక్తికి ఏడేళ్లు శిక్ష పడాలి 

ఎవరికైనా పసుపు రంగు దుస్తులు వేసి..రాత్రికిరాత్రి వారితో కొట్టించి..ఆ తర్వాత జగనే ఓదార్పుయాత్ర పేరుతో తిరుగుతారేమోనని తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఒకవేళ ఓదార్పుయాత్ర చేయాలనుకుంటే... జనం ఆయన్ను ఓదార్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ‘నా మీద థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన వ్యక్తికి ఇంకా పూర్తి స్థాయి శిక్ష పడలేదు. ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకావాలి. ఆయన చేసిన అన్యాయాలకు, కస్టోడియల్‌ టార్చర్‌ను ప్రోత్సహించినందుకు, దాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించినందుకు కనీసం ఏడేళ్ల శిక్ష పడాలి. అప్పుడే నాపై జరిగిన దాడికి న్యాయం జరిగినట్టు. ఏ అంటే అమరావతి..పీ అంటే పోలవరం అని నాలుగేళ్లుగా నేను చెబుతూనే ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇవి సాకారమవుతాయి’ అని రఘురామకృష్ణరాజు అన్నారు. 

తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు 


ఇకనుంచైనా కేసుల విచారణకు హాజరుకావాలి

 ‘‘రాబోయే ఎన్నికల్లో తెదేపాకు సింగిల్‌ డిజిట్‌ వస్తుందంటున్న జగన్‌రెడ్డి..ముందు ఆయన మీద సీబీఐ పెట్టిన కేసుల విచారణకు హాజరుకావాలి. ఇంతకాలం సీఎం పదవిని అడ్డంపెట్టుకొని తప్పించుకు తిరిగిన ఆయన ఇక న్యాయస్థానానికి వెళ్లాలి. జగన్‌ రాష్ట్రాన్ని ప్రైవేటు ఎస్టేట్‌లా మార్చుకోవాలని చూశారు. ఆ ప్రక్రియ పూర్తికాకుండానే తనను సాగనంపారనే బాధ ఆయన ముఖంలో కనిపించింది. కల్తీమద్యం తాగించి..దాని ద్వారా వచ్చిన రూ.వేల కోట్లను కంటైనర్లలో తరలించారు. వీటన్నింటికీ శిక్ష అనుభవించాలి. సర్వేపల్లిలో వైకాపా వారు కబ్జా చేసిన వెయ్యి ఎకరాలపై విచారణ చేయిస్తున్నా’ అని సోమిరెడ్డి తెలిపారు.

మాజీమంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని