ఎవరి ఆదేశాలతో ఆర్థిక సంఘం నిధులు మళ్లించారు?

కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ద్ధిశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 22 Jun 2024 06:22 IST

పంచాయతీలకు నిధులివ్వకుండా పనులెలా చేస్తారు?
అధికారులపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆగ్రహం

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ద్ధిశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. ఆర్థిక సంఘం నిధులు సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాలకు ఎంత మేర మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధుల వ్యాప్తిపై అసెంబ్లీ కమిటీ హాలులో పురపాలక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రులు నారాయణ, సత్యకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. నిధుల అంశం ప్రస్తావనకు వచ్చినపుడు పవన్‌ కల్యాణ్‌ అసహనం వ్యక్తం చేశారు. ‘స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులు ఎందుకివ్వడం లేదు? ఎవరి ఆదేశాలతో వాటిని మళ్లించారు? నిధులివ్వకుండా పంచాయతీల్లో పనులెలా చేస్తారు?’ అని అధికారులను ప్రశ్నించారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో లోపాలవల్లే విజయవాడలో ఇటీవల డయేరియా కేసులు ఉత్పన్నమైనట్లు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి, వైద్య ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఏకే సింఘాల్, కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.

వాలంటీర్ల వ్యవస్థను పంచాయతీల పరిధిలో చేర్చాలి: బుచ్చిరాజు

వాలంటీర్ల వ్యవస్థను గ్రామ పంచాయతీల పరిధిలోకి తీసుకురావాలని ఏపీ పంచాయతీరాజ్‌ సంక్షేమ ట్రస్ట్‌ ఛైర్మన్‌ టీఎంబీ బుచ్చిరాజు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయనకు రాసిన లేఖలో పంచాయతీరాజ్‌ వ్యవస్థలో తీసుకోవలసిన అనేక చర్యలు, అమలు చేయాల్సిన సంస్కరణలను బుచ్చిరాజు ప్రస్తావించారు. ‘73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీరాజ్‌ సంస్థలకు 29 అంశాలకు సంబంధించి నిధులు, విధులు, బాధ్యతలు బదలాయించాలి. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలి. పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్లను మూడుగా మార్చాలి. పదేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలి’ అని బుచ్చిరాజు విజ్ఞప్తి చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని