రాబోయే ఐదేళ్లలో సభ నిర్వహణ దేశానికే ఆదర్శంగా నిలవాలి

శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనందున ఆయనను అభినందిస్తూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శనివారం సభలో మాట్లాడారు.

Published : 23 Jun 2024 05:45 IST

సభలో మంత్రులు, తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు

ఈనాడు, అమరావతి: శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనందున ఆయనను అభినందిస్తూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శనివారం సభలో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో సభాగౌరవాన్ని మంటగలిపారని, మంత్రులు, ఎమ్మెల్యేల దుర్భాషలతో సభ స్థాయిని దిగజార్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లు సభను హుందాగా నడిపించాలని, సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు. శాసనసభ దేశానికే ఆదర్శంగా నిలవాలని సూచించారు.


అక్రమ కేసుల బాధ నాకు తెలుసు
-మంత్రి బీసీ జనార్దనరెడ్డి

‘వైకాపా ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసుల బాధను నేనూ అనుభవించాను. 32 రోజులు జైల్లో పెట్టారు. ఆ సమయంలో కుటుంబసభ్యుల ఆవేదన, పోలీసు అధికారుల మాటలు అన్నీ తెలుసు. మీపైన ఎన్ని కేసులు పెట్టినా మీరు తెదేపాకు సైనికుడిగా ఉన్నారు. వైకాపా వారు సభకు రాలేదు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు రావాల్సిన అవసరం ఉంది.’


దేవాలయం లాంటి సభలో దుర్భాషలు
-మంత్రి కొల్లు రవీంద్ర

‘గత ఐదేళ్లలో అయ్యన్నపాత్రుడిని వేధించారు. ఈ సభలో అనేక అవమానాలు జరిగాయి. దేవాలయం లాంటి సభలో దుర్భాషలాడారు. అలాంటివారు అడ్రస్‌ లేకుండా పోయారు. అందరూ సభను ఉపయోగించుకొని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.’


తెదేపా అంటే బీసీలే గుర్తుకొస్తారు:
-మంత్రి నిమ్మల రామానాయుడు

‘వైకాపా అంటే జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి.. వీళ్లే గుర్తుకొస్తారు. తెదేపా అంటే కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, కాలవ శ్రీనివాసులు, కేఈ కృష్ణమూర్తి గుర్తుకొస్తారు. బీసీ నేతను సభాపతిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. 2019 ముందు ఒక్క కేసు కూడా లేని నాపై వైకాపా హయాంలో 25 కేసులు పెట్టారు.’


సభ గౌరవాన్ని కాపాడాలి
-మంత్రి ఫరూక్‌

‘సభా సంప్రదాయాలను, గౌరవాన్ని కాపాడాలి. గత ప్రభుత్వంలో సభలో వ్యక్తిగత విషయాలపై మాట్లాడారు. అసభ్య పదజాలం వాడినా రికార్డుల నుంచి తొలగించలేదు. చంద్రబాబు కంటతడి చూడలేకపోయాం. జగన్‌ సభలోకి వస్తే శుక్రవారం ఒక్క వ్యాఖ్య అయినా చేశామా? అదీ మర్యాద. బడ్జెట్‌పై చర్చ జరగాలి.’


సభలో తెలుగు వాడకాన్ని ప్రోత్సహించాలి
-మంత్రి నాదెండ్ల మనోహర్‌

‘శాసనసభలో తెలుగుభాష వాడకంపై దృష్టిసారించాలి. చర్చల్లోనూ తెలుగును ప్రోత్సహించేలా సహకరిస్తారని ఆశిస్తున్నాం. గత ఐదేళ్లలో జరిగిన సమావేశాలు గౌరవాన్ని తగ్గించాయి. చర్చలు జరగాలి. సభ హుందాతనాన్ని పెంచాలి.’


స్వాతంత్య్ర పోరాటంలా ఎన్నికలు జరిగాయి
-భాజపా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు

‘మొన్నటి ఎన్నికలు స్వాతంత్య్రం ఉద్యమంలా జరిగాయి. నాయకులు ఇలా ఉంటారా? అని చూసిన ప్రజలు బుద్ధి చెప్పారు. చంద్రబాబు తలదించుకుని కూర్చుంటే అది మంచిదని వైకాపా వారు అనుకున్నారు. 2018లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకుంటానని ప్రకటించినా వైకాపా పాలన చూసిన తర్వాత విధానాన్ని మార్చుకున్నాను.’


క్లాసిక్‌ లీడర్‌గా ఉంటారు
-ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు

‘అందరికీ అర్థమయ్యేలా సరళమైన భాషలో మాట్లాడారు. శాసనసభకు ఒక క్లాసిక్‌ లీడర్‌గా ఉంటారని నమ్మకం ఉంది. సభాపతిగా అయ్యన్నపాత్రుడిని ఎన్నుకుంటున్నారని తెలిసి సభకు వచ్చిన వైకాపా అధినేత జగన్‌ తన పేరునే మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి.’


మహిళలను అవమానించారు
-మంత్రి సంధ్యారాణి

‘గత ప్రభుత్వంలో మంత్రుల మాటలు వినలేక చెవులు, కళ్లు మూసుకోవాల్సిన పరిస్థితి. మహిళలను దారుణంగా అవమానించారు. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలనో.. రికార్డుల నుంచి తొలగించాలనో అంటాం. గత ఐదేళ్లలో అన్ని మాటలూ రికార్డుల నుంచి తొలగించాల్సినవే.’


ఎస్సీ, ఎస్టీ, బీసీలే బాధితులు: ఎమ్మెల్యేలు 

ఐదేళ్లలో ఎంతో విధ్వంసం జరిగిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే బాధితులని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరిగేలా చూస్తారని ఆశిస్తున్నామని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులను అవమానించారని, అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని ఎమ్మెల్యే కళావెంకటరావు సూచించారు. గత సభాపతి ప్రజాస్వామ్య విలువలను కాపాడలేదని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ విమర్శించారు. సభాపతిగా అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏపీ రాజకీయ చరిత్రలో మైలురాయని ఎమ్మెల్యే సింధూరరెడ్డి తెలిపారు. జగన్‌ ఎదుర్కొనేందుకే ఎమ్మెల్యేగా వచ్చానని, తన కోరిక నెరవేరుతుందో లేదో అనిపిస్తోందని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తెలిపారు. అయ్యన్నపాత్రుడు సభాపతిగా గౌతమ బుద్ధుడిగా ఉండాల్సి రావడంతో తనకు ఏదోలా ఉందని వెల్లడించారు. సభకు వైకాపా సభ్యులు రాకపోవడం నిరుత్సాహపరిచిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సభాపతి ఎంపిక సమయంలో విపక్ష నాయకుడు పక్కన నిలబడకుండా వెళ్లిపోవడం ప్రమాణాన్ని ఉల్లంఘించడమేనని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు