శభాష్‌ ఇందు!

పాఠశాల నుంచి వచ్చిన చిన్నారికి ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న తల్లి కనిపించింది. తండ్రితో గొడవపెట్టుకొని అమ్మ ఏమైనా చేసుకుందోనని అనుమానించి.. వెంటనే కిలోమీటరు దూరంలో ఉన్న పోలీసు స్టేషన్‌కు పరుగున వెళ్లింది.

Updated : 23 Jun 2024 06:14 IST

అపస్మారకస్థితిలో ఉన్న తల్లిని చూసి కి.మీ.పరిగెత్తి పోలీసులకు తెలిపిన చిన్నారి

గోపాలపురం, న్యూస్‌టుడే: పాఠశాల నుంచి వచ్చిన చిన్నారికి ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న తల్లి కనిపించింది. తండ్రితో గొడవపెట్టుకొని అమ్మ ఏమైనా చేసుకుందోనని అనుమానించి.. వెంటనే కిలోమీటరు దూరంలో ఉన్న పోలీసు స్టేషన్‌కు పరుగున వెళ్లింది. విషయం చెప్పి పోలీసులను తీసుకొచ్చి.. తల్లిని కాపాడుకుంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో శనివారం చోటుచేసుకుంది. వేళ్లచింతలగూడెం గ్రామానికి చెందిన లక్ష్మి, దానయ్య భార్యాభర్తలు. కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇందు (8వ తరగతి), లాస్య (5వ తరగతి)అనే ఇద్దరు కుమార్తెలున్నారు. శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఇందు పాఠశాల నుంచి ఇంటికి వచ్చారు. అప్పటికే లక్ష్మి చీమల మందు తాగి.. ఇంట్లో పడిపోయారు. ఎంత పిలిచినా ఆమె నుంచి స్పందన లేకపోవడంతో ఇందు వెంటనే బడిలో ఉన్న చెల్లిని తీసుకొని, కిలోమీటరు దూరంలో ఉన్న పోలీసు స్టేషన్‌కు పరిగెత్తింది. ‘‘మా అమ్మ కదలడం లేదు. ఉలుకూపలుకూ లేకుండా ఇంట్లో పడిపోయారు. వచ్చి ఏమైందో చూడండి. అమ్మను కాపాడండి’’ అంటూ పోలీసుల వద్ద విలపించారు. వెంటనే స్పందించిన ఎస్సై సతీష్‌కుమార్‌ ముగ్గురు పోలీసులను ఆ పిల్లలతో పంపారు. అక్కడ అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మిని హుటాహుటిన గోపాలపురం సీహెచ్‌సీకి తరలించారు. లక్ష్మి చీమల మందు తాగిందని, ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. భార్యాభర్తల గొడవే ఇందుకు కారణమని పోలీసులు వెల్లడించారు. దానయ్యను పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తామని ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని