అనంత వెంకట్రామిరెడ్డి అక్రమాలపై విచారణ చేయించాలి

అనంతపురం అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని నగరానికి చెందిన విశ్రాంత అదనపు ఎస్పీ బాల నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 24 Jun 2024 03:47 IST

విశ్రాంత ఏఎస్పీ బాల నరసింహారెడ్డి లేఖలు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని నగరానికి చెందిన విశ్రాంత అదనపు ఎస్పీ బాల నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, హోంమంత్రి అనితకు ఆదివారం లేఖలు రాశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అనంతపురంలో మూడేళ్ల క్రితం రోడ్ల విస్తరణ చేపట్టే క్రమంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారు. రోడ్ల విస్తరణ పనుల్లో రూ.35 కోట్ల కమీషన్‌ తీసుకున్నారు. డబ్బులిచ్చినవారి భవనాలు పడగొట్టలేదు. తన సోదరులు సుబ్బారెడ్డి, చంద్రారెడ్డిలను మధ్యవర్తులుగా పెట్టుకుని అక్రమాలు చేసి రూ.2 వేల కోట్లు గడించారు. అక్రమ సంపాదనతో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో భవంతులు కొన్నారు. తన ఇంటికి సమీపంలోని ఎకరా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐటీఐ కళాశాలకు చెందిన 6 సెంట్ల స్థలాన్ని ఇప్పటికే ఆక్రమించుకున్నారు. నగరంలో మేయర్‌ వసీంను అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన అక్రమాలపై ప్రస్తుత తెదేపా ప్రభుత్వం సీబీసీఐడీ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి’’ అని లేఖల్లో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని