రుషికొండపై భవనాలకు ప్రజాధనం దుర్వినియోగం

Published : 24 Jun 2024 03:52 IST

మాజీ సీఎం జగన్, ఆయన క్యాబినెట్‌పై పోలీసులకు ఫిర్యాదు 

సీఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు అందజేస్తున్న గంగాధర్‌

మంగళగిరి, న్యూస్‌టుడే: విశాఖలోని రుషికొండపై పర్యావరణ అనుమతులు లేకుండా భవనాలు నిర్మించి దాదాపు రూ.421 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మాజీ సీఎం జగన్, ఆయన మంత్రివర్గ సహచరులు, అప్పటి సీఎస్‌ జవహర్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టి.గంగాధర్‌ గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. సహ చట్టం ద్వారా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ నుంచి తీసుకున్న వివరాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. రుషికొండపై రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన హరిత రిసార్ట్స్‌ స్థానంలో హోటళ్ల నిర్మాణం చేపట్టేందుకు 2021 జులై 6న టెండర్లు పిలిచారని పేర్కొన్నారు. డీఈసీ సంస్థతో ఒప్పందం చేసుకొని.. 9.88 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటకుల బస నిమిత్తం హోటళ్ల నిర్మాణం చేపట్టారని చెప్పారు. అందుకోసం ప్రభుత్వం అయిదు జీవోల ద్వారా రూ.421.87 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. సదరు హోటళ్ల నిర్మాణానికి సంబంధిత శాఖల నుంచి అన్ని అనుమతులూ తీసుకున్నట్లు తనకు ఇచ్చిన సమాచారంలో అసత్యాలు ఉన్నాయని గంగాధర్‌ తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల నుంచి ఈసీ సర్టిఫికెట్‌ వంటి అనుమతులు లేకుండానే పాత హరిత రిసార్ట్స్‌ను కూల్చివేశారన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని