సంక్షిప్త వార్తలు (20)

తిరుమల శ్రీవారిని భారత మహిళా క్రికెటర్ల బృందం బుధవారం దర్శించుకుంది. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి మూలమూర్తిని జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, షెఫాలీవర్మ, రేణుకాసింగ్, పూజా వస్త్రాకర్, దీప్తిశర్మ దర్శించుకున్నారు.

Updated : 04 Jul 2024 06:36 IST

శ్రీవారి సేవలో భారత మహిళా క్రికెటర్లు 

ఆలయం ఎదుట భారత మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్‌ కౌర్, షెఫాలీ వర్మ, రేణుకాసింగ్, పూజావస్త్రాకర్‌

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారిని భారత మహిళా క్రికెటర్ల బృందం బుధవారం దర్శించుకుంది. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి మూలమూర్తిని జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, షెఫాలీవర్మ, రేణుకాసింగ్, పూజా వస్త్రాకర్, దీప్తిశర్మ దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేదపండితులు వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మహిళా క్రికెటర్లను చూసేందుకు పెద్దఎత్తున భక్తులు వచ్చారు.


ఆక్వాలో దోపిడీని నిలదీద్దాం.. రాష్ట్రస్థాయి మహాసభలో రైతుల ఉద్ఘాటన 

సభలో మాట్లాడుతున్న గాంధీ భగవాన్‌రాజు

పాలకొల్లు, న్యూస్‌టుడే: ఆక్వా రంగంలో దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని ఆక్వా రైతు సంఘాల రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జైభారత్‌ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రస్థాయి మహాసభ నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. సంక్షోభంలో కూరుకున్న ఆక్వా రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే రైతులంతా ఐక్యంగా పని చేయాలన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వాలు ఆక్వా రైతులకు హామీలిచ్చాయని.. వాటిని నెరవేర్చాలని ప్రభుత్వ పెద్దలకు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై తీర్మానాన్ని సిద్ధం చేశారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాక 45 రోజుల్లో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. రైతు నాయకులు రుద్రరాజు సత్యనారాయణరాజు, బోణం చినబాబు, కర్నేని గౌరునాయుడు తదితరులు పాల్గొన్నారు.


కళ్యాణదుర్గంలో ఉచిత డీఎస్సీ శిక్షణ కేంద్రం

శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు 

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు డీఎస్సీ అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సొంత నిధులు వెచ్చిస్తున్నారు. బుధవారం ఆయన కళ్యాణదుర్గం ఆర్డీవో రాణిసుస్మిత, పలువురు తెదేపా నాయకులతో కలిసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ శిక్షణ కోసం ఇప్పటి వరకు సుమారు వెయ్యి మందికిపైగా అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.


జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన పోలీసులకు డీజీపీ అభినందనలు

ఈనాడు డిజిటల్, అమరావతి: జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులను డీజీపీ ద్వారకా తిరుమలరావు అభినందించారు. అస్సాంలోని గువాహటిలో జూన్‌ 24 నుంచి 30 వరకు జరిగిన అఖిల భారత పోలీస్‌ జూడో క్లస్టర్‌-2024లో రాష్ట్ర పోలీసు బృందం 9 (ఒకటి బంగారు, రెండు రజతం, 6 కాంస్య) పతకాలు గెలుచుకుంది. ఐజీ కేవీ మోహనరావు నేతృత్వంలో రాష్ట్ర పోలీసు బృందం ఈ పోటీల్లో పాల్గొంది.


డ్రగ్స్‌ నియంత్రణపై.. మంత్రివర్గ ఉపసంఘం తొలి భేటీ నేడు 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వెలగపూడి సచివాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. ఈ ఉపసంఘానికి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత వహిస్తారు. మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, గుమ్మిడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.


పీహెచ్‌సీల ఆధ్వర్యంలో 104 సేవల్ని నిర్వహించాలి

ఈనాడు డిజిటల్, అమరావతి: 104 ఆరోగ్య సేవల్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీల) ద్వారా ప్రభుత్వమే నిర్వహించాలని 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ) ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు కోరారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల కంటే తక్కువ వేతనంతో తాము పని చేస్తున్నామని బుధవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యశాఖ నియామకాల్లో తమకు వెయిటేజీ ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం వివక్ష చూపిందని విమర్శించారు.


పెట్టుబడులు పెట్టేందుకు ‘క్లబ్‌ మహీంద్రా’ సిద్ధం: సీఎం చంద్రబాబు

ఈనాడు డిజిటల్, అమరావతి : రాష్ట్రంలో ఆతిథ్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ‘క్లబ్‌ మహీంద్రా’ సంస్థ ఆసక్తి చూపడం సంతోషాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సంస్థ ఛైర్మన్‌ సీపీ గుర్నానీ, ఆయన బృందంతో భేటీ అయినట్లు బుధవారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. భేటీ ఫొటోల్ని పోస్టు చేశారు. క్లబ్‌ మహీంద్రా సంస్థ దేశ, విదేశాల్లో ఆతిథ్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. ఈ సంస్థకు 140కి పైగా రిసార్టులు ఉన్నాయి.


ప్రజావేదిక కార్యక్రమం ఈవారం లేదు 

ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రతి శనివారం తెదేపా కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న ప్రజావేదిక కార్యక్రమం ఈ సారి వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ శనివారం కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని ఎమ్మెల్సీ, పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానులు గమనించాలని కోరారు.


ఏకేయూ వీసీ అంజిరెడ్డి రాజీనామా

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లాలోని ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎం.అంజిరెడ్డి తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఆయన వీసీగా 16 నెలలు పనిచేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపగా.. రిజిస్ట్రార్‌ హరిబాబుకు ఇన్‌ఛార్జి వీసీగా బాధ్యతలు అప్పగించారు.


గవర్నర్‌తో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ భేటీ

ఈనాడు, అమరావతి: మహిళలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంతోపాటు వారు సాధికారత సాధించేలా చట్టాలపై అవగాహన కల్పించేందుకు వివిధ రకాల శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై రాష్ట్ర మహిళా కమిషన్‌ దృష్టి సారించిందని ఆ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్‌ కార్యకలాపాల గురించి గవర్నర్‌ ఆమెను అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు చేపడుతున్న ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌ సౌకర్యానికి కమిషన్‌ ప్రోత్సాహాన్ని అందించాలని ఈ సందర్భంగా గవర్నర్‌ సూచించారు.


ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

సీఎంకు ఏపీ గెజిటెడ్‌ అధికారుల వినతి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర విభజనతో తలెత్తిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఏపీ గెజిటెడ్‌ అధికారుల ఐకాస ఛైర్మన్‌ కృష్ణయ్య.. సీఎం చంద్రబాబును కోరారు. ఈనెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన అంశాలపై చర్చించనున్న నేపథ్యంలో చంద్రబాబుకు వినతిపత్రం సమర్పించారు. ఇరు రాష్ట్రాల ఉద్యోగుల పరస్పర బదిలీలు, డిప్యూటేషన్లకు స్పష్టమైన మార్గదర్శకాల కల్పన, విభజనతో తలెత్తిన అపరిష్కృత సమస్యలపై చర్చించాలని కోరారు. పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్స్‌ జాబితాలో ఉన్న వాటి అప్పులు, ఆస్తులు, మానవ వనరులు నేటికీ పంపకాలు చేయలేదని పేర్కొన్నారు.


పాఠశాల విద్యలో ఒకే లక్ష్యంతో రెండు కార్యక్రమాలు: టీఎన్‌యూఎస్‌

ఈనాడు, అమరావతి: విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలు గందరగోళంగా ఉన్నాయని.. ‘బడికిపోతా’, ‘విద్యా ప్రవేశ్‌’ రెండు కార్యక్రమాలు ఒకే లక్ష్యంతో నిర్వహిస్తున్నారని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టీఎన్‌యూఎస్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఒకే లక్ష్యంతో నిర్వహించే రెండు కార్యక్రమాలను నెలలపాటు నిర్వహించడం వల్ల బోధనకు ఆటంకాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. టీచ్‌ టూల్‌ ప్రోగ్రాం పేరుతో శిక్షణలు, పాఠశాలల సందర్శనతో ఉపాధ్యాయులు బోధనకు దూరమయ్యే పరిస్థితి ఉందని, ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించాలని కోరారు.


అనర్హులకు పింఛను ఇప్పించుకున్న వైకాపా సర్పంచి

కలెక్టరుకు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం కొళత్తూరు గ్రామ వైకాపా సర్పంచి రవి తన బంధువులను డప్పు కళాకారులుగా నమోదు చేయించి ఐదేళ్లు పింఛను పొందినట్లు గ్రామస్థులు బుధవారం కలెక్టరు, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.6 లక్షల మేర లబ్ధి పొందినట్లు, ఆ మొత్తాన్ని వారి నుంచి రికవరీ చేయాలని ఫిర్యాదులో కోరారు. పింఛను పొందిన సర్పంచి బంధువులు ముగ్గురూ డప్పు కొట్టిన సందర్భాలు లేవని గ్రామస్థులు తెలిపారు. అర్హులను విస్మరించి, అనర్హులకు సాయం అందించారని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.


జీపీ, ఏజీపీల నియామకంపై హైకోర్టులో పిల్‌

రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ

ఈనాడు, అమరావతి: హైకోర్టు, దిగువ న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ), ఏజీపీల నియామకంపై మార్గదర్శకాలు రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వ్యాజ్యం దాఖలైంది. దీనిపై ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని పిటిషనర్, న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్‌ కోరగా ధర్మాసనం అందుకు నిరాకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఎన్‌ జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.


పీపీ, ఏపీపీ పోస్టుల భర్తీకి ఆదేశించండి

హైకోర్టులో పిల్‌ దాఖలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ), సహాయ పీపీ(ఏపీపీ) పోస్టులు భర్తీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం, ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్, డీజీపీ, ఏపీ రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డును ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్‌ దాఖలు చేసిన పిల్‌ను బుధవారం హైకోర్టు విచారించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని పేర్కొంటూ ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. అంతకు ముందు న్యాయవాది యోగేష్‌ వాదనలు వినిపిస్తూ.. ఏళ్ల తరబడి పీపీ, ఏపీపీ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. దిగువ కోర్టుల్లో పెండింగ్‌ కిమినల్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోందన్నారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కౌంటర్‌ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది. 


వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలి

మంత్రి సత్యప్రసాద్‌కు ఆ సంఘం విజ్ఞప్తి

ఈనాడు, అమరావతి: గ్రేడ్‌-2 నుంచి గ్రేడ్‌-1గా పదోన్నతి కల్పిస్తూ జీఓ 166 జారీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వీఆర్వో సంఘం నాయకులు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు విజ్ఞప్తి చేశారు. జీఓ జారీ చేసి ఏడాది కావొస్తున్నా ఇంతవరకూ చర్యలు తీసుకోనందువల్ల అర్హులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. వీఆర్వోల ప్రొబేషన్‌ కాలానికి సంబంధించి మెమో జారీ చేసి 6 నెలలైనా చర్యల్లేవని తెలిపారు. అపరిష్కృత అంశాలపైనా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు బుధవారం వీఆర్వోల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు, ఉపాధ్యక్షుడు మిరియాల లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.


వైద్య ఆరోగ్య శాఖలో యాప్స్‌ తగ్గించాలి

వైద్య ఆరోగ్యశాఖలో వివరాల నమోదుకు క్షేత్రస్థాయి సిబ్బందికి ఇబ్బడిముబ్బడిగా ఉన్న మొబైల్‌ యాప్స్‌ను తగ్గించాలని రాష్ట్ర ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల సంఘం ప్రతినిధులు బుధవారం మంత్రి సత్యకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. క్షేత్రస్థాయి సిబ్బందికి ముఖ ఆధారిత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఇతర శాఖల విధులు వైద్య ఆరోగ్య సిబ్బందికి అప్పగించొద్దని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సంఘం అధ్యక్షుడు ఆస్కార్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. వినతిపత్రాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుకూ అందజేశామన్నారు. 


నిలకడగా సిద్ధేశ్వరానంద భారతీస్వామి ఆరోగ్యం

ఈనాడు, అమరావతి: తమిళనాడులోని శ్రీసిద్ధేశ్వరీ పీఠం సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి ఆరోగ్యం నిలకడగా ఉందని, భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పీఠం కార్యదర్శి కిరణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 2న చెన్నైలోని కావేరీ వైద్య సంస్థలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలక్టివ్‌ యాంజియోప్లాస్టీ చికిత్స చేశారని వెల్లడించారు. ప్రస్తుతం స్వామివారు వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతిలో ఉన్నారని తెలిపారు. భక్తులెవరూ వ్యక్తిగతంగా గాని, ఫోన్లు చేసిగానీ పీఠం సిబ్బందిని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు.


రైళ్లలో రాయితీలు పునరుద్ధరించండి: మంత్రికి ఎంపీ కలిశెట్టి వినతి

ఈనాడు, దిల్లీ: రైళ్లలో వృద్ధులు, దివ్యాంగులు, పాత్రికేయులకు రాయితీలను పునరుద్ధరించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. బుధవారం ఆయన ఇక్కడ రైల్వే మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దివ్యాంగులకు రైల్వే స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. రాయితీలు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ధ్రువపత్రాలను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.


సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన నిఘా విభాగాధిపతి మహేష్‌ చంద్ర లడ్హా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని