క్లబ్‌ హౌస్‌ యజమానికి అధికారుల దాసోహం

పులివెందులలో ఫోర్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణం పేరుతో కడప ఎంపీ అవివాష్‌రెడ్డి బావ, క్లబ్‌హౌస్‌ యజమాని విజయశేఖర్‌రెడ్డికి అయాచిత లబ్ధి చేకూర్చేందుకు అధికారులు అడ్డదారులు తొక్కారు.

Published : 04 Jul 2024 05:01 IST

1.71 ఎకరాలకు బదులు 2.17 ఎకరాలకు వైఎస్సార్‌ జిల్లా గత కలెక్టర్‌ సిఫార్సు
పులివెందులలో ఫోర్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణం కోసం యథాతథంగా కొనాలని గత సీఎంవోలో కీలక అధికారి ఒత్తిళ్లు

ఈనాడు, అమరావతి: పులివెందులలో ఫోర్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణం పేరుతో కడప ఎంపీ అవివాష్‌రెడ్డి బావ, క్లబ్‌హౌస్‌ యజమాని విజయశేఖర్‌రెడ్డికి అయాచిత లబ్ధి చేకూర్చేందుకు అధికారులు అడ్డదారులు తొక్కారు. క్లబ్‌హౌస్‌ విస్తీర్ణం 1.71 ఎకరాలైతే 2.17 ఎకరాలుగా వైఎస్సార్‌ జిల్లా గత కలెక్టర్‌ పర్యాటకాభివృద్ధి సంస్థకు సిఫార్సు చేసేశారు. పర్యాటకులే రాని ప్రాంతంలో స్టార్‌ హోటల్‌ నిర్మాణ ప్రతిపాదనే ఆశ్చర్యకరమైతే.. ప్రభుత్వం ఆదేశించడమే తరువాయి అన్నట్టు వైఎస్సార్‌ జిల్లా యంత్రాంగం అప్పట్లో గుడ్డిగా వ్యవహరించింది. అప్పటి సీఎంవోలో అన్నీ తానై వ్యవహరించిన ఉన్నతాధికారి ఒకరు.. కలెక్టర్‌ సిఫార్సులను యథాతథంగా అమలుచేసేలా పర్యాటకాభివృద్ధి సంస్థపై ఒత్తిడి తెచ్చారు. 2.17 ఎకరాలకూ పర్యాటకాభివృద్ధి సంస్థ డబ్బు చెల్లించి ఉంటే ఇది మరో కుంభకోణమయ్యేది. విస్తీర్ణం 1.71 ఎకరాలుగానే నిర్ధారించుకుని పర్యాటకాభివృద్ధి సంస్థ డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది. 

కలెక్టర్‌ సిఫార్సులివి..

పులివెందుల మండలం కె.వెలమవారిపల్లెలోని విజయహోమ్స్‌కు చెందిన క్లబ్‌హౌస్‌ విస్తీర్ణం 2.17 ఎకరాలుగా వైఎస్‌ఆర్‌ జిల్లా అప్పటి కలెక్టర్‌ విజయరామరాజు 2022 నవంబరు 11న రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎకరాకు రూ.రూ.96.80 లక్షల ధర చొప్పున 2.17 ఎకరాలకు మొత్తం రూ.2,10,05,600, దానిపై 100% సొల్యూషన్‌ కింద మరో రూ.2,10,05,600 కలిపి మొత్తం రూ.4,20,11,200 డిపాజిట్‌ చేయాలని పర్యాటకాభివృద్ధి సంస్థకు కలెక్టర్‌ సూచించారు. దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లబ్‌హౌస్‌ విస్తీర్ణం 1.71 ఎకరాలుగా తేల్చారు. ఎన్నికలలోగా పులివెందులలో స్టార్‌ హోటల్‌ నిర్మించాలని జగన్‌ ప్రభుత్వం భావించింది. సీఎంవో ఆదేశాలపై హోటల్‌ నిర్మాణానికి పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు రూ.23.50 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. 

2022 ఏప్రిల్‌లోనే స్టార్‌హోటల్‌ ఏర్పాటు ఆలోచనకు బీజం

పులివెందులలో ఫోర్‌ స్టార్‌ హోటల్‌ ఏర్పాటుచేయాలన్న ఆలోచనకు 2022 ఏప్రిల్‌ 18న అప్పటి సీఎం జగన్‌ అధ్యక్షతన నిర్వహించిన పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ (పాడా) సమావేశంలో బీజం పడింది. ఇందుకోసం నాలుగు స్థలాలను తెరపైకి తెచ్చి వాటిలో ఎంపీ అవినాష్‌రెడ్డి బావ విజయశేఖర్‌రెడ్డికి చెందిన నిర్మాణంలో ఉన్న క్లబ్‌హౌస్‌ స్థలాన్ని ఖరారు చేశారు. హోటల్‌ పేరుతో నిర్మాణంలోని క్లబ్‌హౌస్‌ పనులను పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ, పర్యాటకాభివృద్ధి సంస్థలతో పూర్తి చేయించి తమ అవసరాలకు వాడుకోవాలన్నది వైకాపా నేతల ఉద్దేశంగా తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని