ఎత్తిపోతల్లో ఎగసిన గోదారి!

నైరుతి పలకరించి నెల రోజులు గడిచినా కృష్ణాలో ప్రవాహాల్లేవు. గోదావరిలో మాత్రమే కాస్త వరద పారుతోంది. ఈ నీటి పాయలను బీళ్ల వైపు మళ్లించాలని.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

Published : 04 Jul 2024 05:11 IST

ఒకేరోజు 4 లిప్టుల నుంచి నీటి తరలింపు
నదుల అనుసంధాన ఫలాలు మళ్లీ అందుబాటులోకి
నీరు విడుదల చేసిన మంత్రి రామానాయుడు 

ఈనాడు, అమరావతి: నైరుతి పలకరించి నెల రోజులు గడిచినా కృష్ణాలో ప్రవాహాల్లేవు. గోదావరిలో మాత్రమే కాస్త వరద పారుతోంది. ఈ నీటి పాయలను బీళ్ల వైపు మళ్లించాలని.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వరద జలాల సద్వినియోగానికి అడుగులు వేశారు. కృష్ణా, గోదావరి అనుసంధాన ఫలాలు అందించేందుకు జులై ప్రారంభంలోనే ఓ నిర్ణయానికొచ్చారు. ఆ వెంటనే కార్యాచరణ మొదలుపెట్టారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా బుధవారం ఒక్క రోజే నాలుగు ఎత్తిపోతల ద్వారా జలాలు విడుదల చేశారు. కృష్ణా డెల్టా తాగు, సాగునీటి అవసరాలకు పట్టిసీమ ఎత్తిపోతలు, ఏలేరు జలాశయం నింపేందుకు పురుషోత్తపట్నం లిఫ్టును ప్రారంభించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు నిర్మించిన పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాలకూ జలాలు విడుదల చేశారు. ఒకే రోజు గోదావరికి రెండు వైపుల ఉన్న పథకాలను మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా ప్రారంభించారు. ఈ ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు రెండు రోజుల కిందట మంత్రి రామానాయుడు, అధికారులతో మాట్లాడారు. సోమ, మంగళవారాల్లో గోదావరి బ్యారేజి అధికారులతో మంత్రి సమీక్షించారు. గోదావరి డెల్టా ఖరీఫ్‌ అవసరాలు పోనూ.. ప్రవాహాలు సద్వినియోగం చేసుకునేందుకు ఉన్న అవకాశాలు చర్చించారు. మంగళవారం గోదావరిలో 11,620 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. బుధవారం నాటికి 39,903 క్యూసెక్కులకు చేరాయి. ప్రవాహ అంచనాలు లెక్కించారు. డెల్టా అవసరాలు పోను పట్టిసీమతోపాటు ఇతర ఎత్తిపోతలకూ నీరివ్వచ్చని తేలడంతో 4 పథకాల ద్వారా నీళ్లు విడుదల చేశారు. 

ఏమిటీ ప్రయోజనం?

పట్టిసీమ: ఈ ఎత్తిపోతల ద్వారా విడుదల చేసిన నీరు పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజికి చేరుతుంది. ఎప్పుడో చంద్రబాబు హయాంలో ఈ పథకాన్ని నిర్మించారు. జగన్‌ హయాంలో అవసరం ఉన్నా ఉపయోగించుకోలేదు. ప్రస్తుతం కృష్ణాకు నీళ్లు ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కృష్ణా డెల్టాకు తాగు నీరు అత్యవసరం. అందుకే పట్టిసీమ నుంచి జలాలు విడుదల చేశారు. 

పురుషోత్తపట్నం: గోదావరికి ఎడమ వైపున పురుషోత్తపట్నం వద్ద పంపు హౌస్‌ ఏర్పాటు చేసి నీటిని పోలవరం ఎడమ కాలువ ద్వారా మళ్లించి తిరిగి ఏలేరు జలాశయానికి ఎత్తిపోయడం దీని ఉద్దేశం. ఏలేరు జలాశయం సామర్థ్యం 23.44 టీఎంసీలు. విశాఖ నగరానికి తాగు, విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో సాగు, పారిశ్రామిక అవసరాలకు ఈ జలాలు మళ్లించవచ్చు. ఈ ఎత్తిపోతలతో 2.15 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వగలుగుతారు. 

తాడిపూడి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2,06,000 ఎకరాలకు ఈ ఎత్తిపోతలతో నీళ్లు అందుతాయి. 

పుష్కర: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 18 మండలాల్లోని 1,85,000 ఎకరాలకు దీంతో నీళ్లు అందుతాయి.


ప్రస్తుతం నీటి విడుదల (క్యూసెక్కుల్లో..) 

పట్టిసీమ: 1,050 (పూర్తి సామర్థ్యం: 8,500) 
తాడిపూడి: 175 (పూర్తి సామర్థ్యం: 1,400).
పురుషోత్తపట్నం: 700 (పూర్తి సామర్థ్యం: 3,500)
పుష్కర: 175 (పూర్తి సామర్థ్యం: 1400) 

  • గోదావరిలో ప్రవాహాలను బట్టి పూర్తి సామర్థ్యం వరకూ నీరు విడుదల చేసేలా ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి రామానాయుడు ‘ఈనాడు’కు చెప్పారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని