ప్రోత్సాహకాలు అందిస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్‌తో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు.

Published : 04 Jul 2024 05:21 IST

పారిశ్రామికవేత్తలకు మంత్రి భరత్‌ భరోసా 

పారిశ్రామికవాడ మ్యాప్‌ను పరిశీలిస్తున్న మంత్రి భరత్, పక్కన కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

హనుమాన్‌ జంక్షన్, గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్‌తో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. తగిన ప్రోత్సాహం అందిస్తే రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వరస కడతారని, ఆ దిశగా చంద్రబాబు నాయకత్వంలో కృషి చేస్తామన్నారు. కృష్ణా జిల్లాలోని మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామికవాడల్ని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి బుధవారం ఆయన సందర్శించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మూసివేతకు గురైన అశోక్‌ లేలాండ్‌ బస్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌తో పాటు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన పలు పరిశ్రమలను పరిశీలించారు. పారిశ్రామికవేత్తలు, ఏపీఐఐసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూముల ధర విపరీతంగా పెంచడం, విద్యుత్తు కోతలు, ఇతరత్రా సమస్యలను పలువురు పారిశ్రామికవేత్తలు మంత్రికి నివేదించారు. మల్లవల్లి పారిశ్రామికవాడ ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు ఎకరం ధర రూ.16.50 లక్షలుగా నిర్ణయిస్తే, వైకాపా ప్రభుత్వం దాన్ని రూ.89 లక్షలకు పెంచడం దారుణమని మంత్రి వ్యాఖ్యానించారు. బస్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌తో సహా మిగతా పరిశ్రమలనూ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడతామని ప్రకటించారు. అంతకుముందు మంత్రి వీరపనేనిగూడెం వద్ద పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి తలెత్తుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని