చట్ట నిబంధనల్ని పాటించండి

వివిధ జిల్లాల్లోని వైకాపా కార్యాలయాల భవనాల విషయంలో చట్ట నిబంధనల్ని పాటించాలని అధికార యంత్రాంగాన్ని హైకోర్టు ఆదేశించింది.

Published : 05 Jul 2024 04:34 IST

వాదనలు చెప్పుకొనే అవకాశమివ్వండి
వైకాపా కార్యాలయాల భవనాల విషయంలో అధికారులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: వివిధ జిల్లాల్లోని వైకాపా కార్యాలయాల భవనాల విషయంలో చట్ట నిబంధనల్ని పాటించాలని అధికార యంత్రాంగాన్ని హైకోర్టు ఆదేశించింది. చట్టం నిర్దేశించిన మేరకు ప్రతిదశలో వైకాపా వర్గాలు(పిటిషనర్లు) వాదనలు చెప్పుకొనేందుకు, వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేదాకా భవనాల కూల్చివేత విషయంలో తొందరపాటు చర్యలొద్దంది. వైకాపా భవనాల నిర్మాణంలో  ఉల్లంఘనలు ప్రజాహితంపై ప్రభావం చూపుతున్నప్పుడు, పబ్లిక్‌ న్యూసెన్స్‌కు కారణమైనప్పుడు, ప్రజా భద్రతకు, ఆయా ప్రాంత నివాసులకు ప్రమాదకరంగా ఉన్నప్పుడే కూల్చివేత అధికారాన్ని వినియోగించాలంది. ఉల్లంఘనలు స్వల్పమైనప్పుడు, ప్రజలపై ప్రభావం చూపనప్పుడు ఆ భవనాలను కూల్చేందుకు అధికారులు చర్యలు చేపట్టవద్దంది. విస్తృత ప్రజాప్రయోజనం ఇమిడిలేనప్పుడు భవనాల కూల్చివేత అధికారాన్ని వినియోగించవద్దని అధికారులను ఆదేశించింది.

రెండు వారాల్లో వివరణ ఇవ్వొచ్చు

‘ఉల్లంఘనల విషయంలో వివరణ కోరుతూ ఇప్పటికే జారీచేసిన ఉత్తర్వుల విషయంలో చట్ట నిబంధనల్ని అధికారులు పాటించాలి. పిటిషనర్లు రెండు వారాల్లో అధికారులకు వివరణ ఇవ్వొచ్చు. వాదనలకు బలం చేకూరే సాక్ష్యాధారాలు, దస్త్రాలను అధికారులకు సమర్పించొచ్చు. వివరణలను పరిగణనలోకి తీసుకున్నాక అధికారులు విచారణను ప్రారంభించాలి. రికార్డులన్నీ పరిశీలించాక ఆయా భవనాల వ్యవహారంలో తగిన నిర్ణయం తీసుకోవాలి. విచారణ పెండింగ్‌లో ఉండగా ఆయా భవనాల విషయంలో తొందరపాటు చర్యలొద్దు. అధికారులను ఆశ్రయించడానికి ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలనూ పిటిషనర్లు సద్వినియోగం చేసుకోవచ్చు. చట్ట నిబంధనలకు లోబడి నిష్పక్షపాతంగా విచక్షణ అధికారాలను వినియోగించి అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకోవాలి’ అని హైకోర్టు పేర్కొంది. న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ గురువారం ఈమేరకు తీర్పు ఇచ్చారు. 

అనుమతి పొందకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయాల భవనాలను ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలంటూ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నోటీసులు జారీచేశారు. వీటిని సవాలు చేస్తూ వివిధ జిల్లాల వైకాపా అధ్యక్షులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. 21 పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. ఇటీవల తీర్పును వాయిదా(రిజర్వు) వేసిన విషయం తెలిసిందే. నిర్ణయాన్ని గురువారం ప్రకటిస్తూ చట్ట నిబంధనల్ని పాటించాలని అధికారుల్ని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని