ఒడిశా తరహాలో ఏపీలోనూ ‘వరల్డ్‌ స్కిల్‌ సెంటర్‌’

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న వరల్డ్‌ స్కిల్‌ సెంటర్‌ తరహాలో రాష్ట్రంలోనూ అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

Published : 05 Jul 2024 04:37 IST

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వెల్లడి
ఎన్నారై టీడీపీ సహకారంతో 15 మంది ఉపాధ్యాయులకు అమెరికాలో ఉద్యోగాలు

ఈనాడు డిజిటల్, అమరావతి: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న వరల్డ్‌ స్కిల్‌ సెంటర్‌ తరహాలో రాష్ట్రంలోనూ అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి రాష్ట్రంతో పాటు దేశవిదేశాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. టీడీపీ ఎంపవర్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో నైపుణ్య శిక్షణ పొంది అమెరికాలో ఉద్యోగాలు సంపాదించిన 15 మంది ఉపాధ్యాయులను మంత్రి అభినందించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు జావా నేర్చుకున్న 31 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు, యూఎస్‌ ఐటీ రిక్రూట్‌మెంట్‌ కన్సల్టెన్సీ ద్వారా శిక్షణ పొందిన నలుగురికి ధ్రువపత్రాలు అందజేశారు. ‘విదేశాలకు వెళ్తున్న ఉపాధ్యాయులు గురువుల గౌరవాన్ని నిలబెట్టాలి. అక్కడ మంచి విషయాలు నేర్చుకుని గొప్పగా స్వదేశానికి తిరిగి రావాలి. మాతృభూమి రుణం తీర్చుకోవాలి’ అని మంత్రి శ్రీనివాస్‌ ఆకాంక్షించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇకపై ప్రభుత్వ సహకారం ఉంటుందని తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ వేమూరి రవికుమార్‌ తెలిపారు. టీడీపీ ఎంపవర్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా విదేశాలకు వెళ్లిన వారు విజయవంతంగా ఉద్యోగాలు చేస్తున్నారని, ఇప్పుడు వెళ్తున్న ఉపాధ్యాయులకు     టెక్ట్రా ఐటీ సర్వీసెస్‌ సీఈవో మేకా శ్రీకాంత్‌ వసతి కల్పిస్తారని తెలిపారు. 2015 నుంచి 107 మంది ఉపాధ్యాయులను అమెరికాకు పంపినట్లు సెంటర్‌ హెడ్‌ డాక్టర్‌ యామినీ పెండ్యాల వెల్లడించారు. కార్యక్రమంలో ఇండియన్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీ అధ్యక్షుడు అబ్దుల్‌ ఖాదర్‌ జిలానీ, టెక్ట్రా ఐటీ సర్వీసెస్‌ సీఈవో మేకా శ్రీకాంత్, బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని