పిన్నెల్లిని పోలీసు కస్టడీకి అప్పగించాలని వాదనలు

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు వేసిన పిటిషన్‌పై గురువారం మాచర్ల అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో వాదనలు సాగాయి.

Published : 05 Jul 2024 04:38 IST

తీర్పు నేటికి వాయిదా 

ఈనాడు డిజిటల్, నరసరావుపేట, మాచర్ల, న్యూస్‌టుడే: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు వేసిన పిటిషన్‌పై గురువారం మాచర్ల అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో వాదనలు సాగాయి. సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు విన్పించారు. తీర్పును శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు జడ్జి శ్రీనివాస కల్యాణ్‌ తెలిపారు. పోలీసుల తరఫున ఏపీపీ కె.రవీంద్రకుమార్, హైకోర్టు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు విన్పించారు. పిన్నెల్లి తరఫున న్యాయవాదులు బాలసత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి వాదించారు. నెల్లూరు జైలులోనే విచారించాలని, పోలీసు కస్టడీకి అవసరం లేదని పిన్నెల్లి తరఫు న్యాయవాదులు కోరారు. మాచర్లలో కాకుండా క్రోసూరు తీసుకెళ్లి విచారిస్తామని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటామని పోలీసు తరఫు న్యాయవాదులు జడ్జికి విన్నవించారు. కారంపూడిలో హింసాత్మక ఘటనలు, సీఐపై హత్యాయత్నం, పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రం వద్ద తెదేపా ఏజెంటుపై గొడ్డలితో దాడి కేసుల్లో విచారించేందుకు పిన్నెల్లిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు ఇటీవల కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసుల్లో న్యాయస్థానం పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో నెల్లూరు జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని